సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గున రాజేంద్రనాథ్ చెప్పారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వేల కోట్ల బిల్లులు బకాయిలు పెట్టి పోయినప్పటికీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చామన్నారు. ఇప్పటివరకు ఐఆర్‌గా ఉద్యోగులకు రూ.15,839.99 కోట్లు అందజేశామని చెప్పారు. శుక్రవారం శాసన మండలిలో ‘ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం’పై జరిగిన స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడారు.
కోవిడ్ సమయంలో ఉపాధి, ఆదాయం కోల్పోయిన పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. పరిస్థితులు చక్కబడిన వెంటనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్ద పీట వేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న కరువు భత్యాన్ని కూడా దశలవారీగా ఇస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 50,000 మంది ఆర్టీసీ
కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకోవడమే కాకుండా 1.30 లక్షల మంది గ్రామ/వార్డు కార్యదర్శులను నియమించామన్నారు. మరో 23,000 ప్రభుత్వ పోస్టులకు నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు తెలిపారు. సీపీఎస్ రద్దుపై కమిటీలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
గత ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసింది: విఠాపు బాలసుబ్రమణ్యం
అంతకుముందు పీడీఎఫ్ ఎమ్మెల్సీ విఠాపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిందని, ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా ముద్ర వేసుకుందని అన్నారు. అందువల్లే కొత్త ప్రభుత్వంపై ఆశలు పెట్టకున్నామన్నారు. అందుకు తగినట్టుగానే ఈ ప్రభుత్వం మొదట్లో ఐఆర్ బాగా ఇవ్వడంతో సంతోషించామన్నారు.
కానీ సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు, డీఏల పెండింగ్ వంటి ప్రధాన విషయాలతోపాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక సమస్యలు ఉన్నాయని వివరించారు. తమ సమస్యలపై ఉన్నతాధికారులు కూడా స్పందించడంలేదని, మీరైనా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. చెప్పి చెప్పి అలసిపోయామని, రాష్ట్రంలో ఉన్న పది లక్షలకుపైగా ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కలిసి పోరాటాలు చేస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment