‘టిక్కెట్లు లేని భక్తులు కొండకు రావొద్దు’ | TTD Officials Inspect All Arrangements For Vaikunta Ekadasi | Sakshi
Sakshi News home page

వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

Published Wed, Dec 23 2020 12:59 PM | Last Updated on Wed, Dec 23 2020 3:41 PM

TTD Officials Inspect All Arrangements For Vaikunta Ekadasi - Sakshi

సాక్షి, తిరుమల : డిసెంబర్‌ 25వ తేదీ శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి వైకుంఠ దర్శనం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ మేరకు బుధవారం తిరుమల వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి తనిఖీలు నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, శ్రీవారి ఆలయం, భక్తులు భౌతిక దూరం వంటి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవో జవహర్‌ రెడ్డి మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ముందస్తుగా ఆన్‌లైన్‌ ద్వారా ఇరవై వేల టిక్కెట్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు ఆఫ్‌లైన్‌లో రేపటి నుంచి స్థానిక భక్తుల కోసం పది వేల టిక్కెట్లు విడుదల చేశామన్నారు. టిక్కెట్లు కలిగిన భక్తులు మాత్రమే తిరుమల దర్శనానికి రావాలని టీటీడీ ఈవో సూచించారు. చదవండి: వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలోనే స్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నామన్నారు. డిసెంబరు 25వ తేదీ‌ నుంచి జనవరి 3వ తేదీ వరకూ రోజుకు ముప్పై వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం‌ రోజు మూడు వేల నుంచి నాలుగు వేల మంది వీఐపీలు ఉదయం 4 గంటల నుంచి వీఐపీ భక్తులకు, 8 గంటల నుంచి సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభిస్తామని తెలిపారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సర్వదర్శనం భక్తులకు స్వామి వారి దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. పది రోజుల పాటు టిక్కెట్లు లేని భక్తులు కొండకు రావద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఇందుకు టీటీడీ భక్తులు సహకరించాలని కోరుతున్నట్లు టీటీడీ ఈవో జవహర్‌ రెడ్డి పేర్కొన్నారు.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement