
సాక్షి, అమరావతి: ‘ఆడుదాం ఆంధ్ర’ కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సుమారు మూడు లక్షల మ్యాచ్లు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు. ఈ మ్యాచ్‌ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘ఆడుదాం ఆంధ్ర’పై సీఎస్ క్యాంపు కార్యాలయంలో సోమవారం రాష్ట్ర స్థాయి ఎపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించారు.
జవహర్‌రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 2 నుంచి ప్రారంభమయ్యే ‘ఆడుదాం ఆంధ్ర’లో క్రికెట్, బాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల్లో సుమారు 3 లక్షల మ్యాచ్‌లను నిర్వ హించనున్నట్లు చెప్పారు. వీటికి అదనంగా 3కే మారథాన్, యోగా, టెన్నికాయిట్ ఈవెంట్లను కూడా నిర్వహిస్తామని వివరించారు.
క్రికెట్,వాలీబాల్,కబడ్డి, కోకో క్రీడల్లో నియోజకవర్గ స్థాయిలో ప్రథమ,ద్వితీయ,తృతీయ విజేతలకు వరసగా 35 వేల రూ.లు,15వేలు,5వేల రూ.ల నగదు ప్రోత్సాహకాన్ని అందించడం జరుగుతుందని సిఎస్ తెలిపారు. అదే విధంగా జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ,తృతీయ పోటీ విజేతలకు వరసగా 60 వేల రూ.లు,30వేల రూ.లు,10 వేల రూ.లు అందించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ,తృతీయ విజేతలకు వరసగా 5 లక్షల రూ.3 లక్షలు,2 లక్షల రూ.లను ఇవ్వనున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ క్రీడాకారులు అంబటి రాయుడు, కరణం మల్లేశ్వరి, పీవీ సింధు, డి.హారిక, శ్రీకాంత్, వి.జ్యోతి సురేఖ వంటివారిని అంబాసిడర్లుగా ప్రకటించి భాగస్వాములను చేయాలన్నారు. అనంతరం 2023–28 క్రీడా విధానంపై కూడా చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర యువజన సరీ్వసులు, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, శాప్ ఎండీ హర్షవర్ధన్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ అర్జునరావు, గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ మురళి పాల్గొన్నారు.