సాక్షి, తాడేపల్లి: విశాఖలోని రిషికొండలో భవనాలపై టీడీపీ బురద చల్లుతోందని విమర్శించారు మాజీమంత్రి ఆర్కో రోజా. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలని హితవు పలికారు.
కాగా, మాజీ మంత్రి రోజా గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి. మేమేమీ వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదు. సెవెన్ స్టార్ రేంజ్‌లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించాం.
టీడీపీ నేతలు మేము కట్టిన మెడికల్ కాలేజీలు, నాడు-నేడు స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా ఇలానే చూపించండి. రిషికొండలో నాణ్యమైన, అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిర్మించాం. గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా?. కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షతోనే నిర్మాణాలు చేపట్టాం.
ఆడుదాం ఆంధ్రా ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ జరిగింది రూ.100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్ ఇలా కూడా అవుతుందా?. క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు గుర్తు లేవా?. అసలు ఆడుదాం ఆంధ్రా టెండర్లు మా క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్దార్థ్ రెడ్డి అవినీతి చేశాం అనడం హాస్యాస్పదమే అవుతుంది. మళ్ళీ 2029లో జగనన్నను సీఎం చేసుకోవడానికి తగ్గట్టుగా ఐదేళ్లు పనిచేస్తాం.
రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలుపై దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంపై టీడీపీ నేతలు దృష్టి పెట్టాలి. ఈవీఎంలపై జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?. చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అని అనలేదా? అంటూ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment