AP CS Jawahar Reddy Comments on EMP Rationalization and Promotions - Sakshi
Sakshi News home page

AP: కొత్త జిల్లాల్లో పదోన్నతులు, ఖాళీలపై సీఎస్‌ కీలక ఆదేశాలు

Published Thu, Feb 16 2023 4:55 PM | Last Updated on Thu, Feb 16 2023 6:20 PM

AP CS Jawahar Reddy Comments On Emp Rationalization And Promotions - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ఖాళీలపై సీఎస్‌ కేఎస్‌. జవహర్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్ లేదా పదోన్నతులు కల్పించుట లేక ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం ద్వారా త్వరితగతిన ఖాళీలు భర్తీ చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. 

కాగా, గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం ఐదవ బ్లాక్‌లో కలెక్టర్ల మీటింగ్‌ హాల్‌లో సీఎస్‌ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరచడం, డెలిగేషన్ ఆఫ్ పవర్స్, ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1, 2 పోస్టుల ఖాళీల భర్తీ, ఈ-ఆఫీసు ద్వారా ఈ-రిసీప్ట్స్, ఈ-డిస్పాచ్ ఆపరేషనలైజేషన్, ఏసీబీ, విజిలెన్స్ కేసుల పరిష్కారం, కలెక్టర్లతో వీడియో సమావేశాల్లో వచ్చిన అంశాలపై ఫాలోఅప్ చర్యలు, అసెంబ్లీకి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వివిధ ఎల్ఏక్యూ, ఎల్సిక్యూలపై సత్వరం సమాచారం అందించడం, ఏపీ ఆన్‌లైన్‌ లీగల్ కేసుల మానిటరింగ్ విధానం తదితర అజెండా అంశాలపై సీఎస్‌ జవహర్ రెడ్డి కార్యదర్శులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా సీఎస్‌ జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. కొత్త జిల్లాల్లో గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ విభాగాల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది రేషనలైజేషన్ లేదా పదోన్నతులు కల్పించాలి. లేనిపక్షంలో ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలు ద్వారా ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాలి. సచివాలయాల్లో పనిచేస్తున్నఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు చర్యలు తీసుకోవాలి. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూపు 1, 2 స్థాయి పోస్టుల ఖాళీల వివరాలను వెంటనే సాధారణ పరిపాలన శాఖకు అందజేయాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ విధానం కింద ఈ-రిసీప్ట్స్, ఈ-డిస్పాచ్ విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలి. 

త్వరలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్ననేపథ్యంలో అసెంబ్లీ, శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వివిధ శాఖలు అందించాల్సిన సమాధానాలను త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ఏసీబీ, విజిలెన్స్‌ కేసులను నిరంతరం మానిటర్ చేస్తూ ఆయా కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. అదే విధంగా ఏపీ ఆన్‌లైన్‌ లీగల్ కేసుల మేనేజ్‌మెంట్ విధానం కింద వివిధ శాఖల్లో నమోదు అవుతున్న కోర్టు కేసుల్లో సకాలంలో కౌంటర్లు దాఖలుచేయడం కోర్టు కేసులపై జాప్యం లేకుండా సకాలంలో చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. దీనిపై త్వరలో జీపీలు, కార్యదర్శులతో ఒక వర్క్‌ షాపు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. 

గతంలో నిర్వహించిన ఉద్యోగ సంఘాల జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన డిమాండ్లలో ఆర్ధికేతర అంశాలకు సంబంధించిన డిమాండ్లను త్వరిత గతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో పలు ఇతర అంశాలపై కూడా కార్యదర్శులతో సమీక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement