
సాక్షి, అమరావతి: బాల్య వివాహాల నివారణపై రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి నుంచి ప్రత్యేక దృష్టి సారించడం ఫలితాలనిస్తోంది. గత నెలలో 159 బాల్య వివాహాలను నివారించిన ప్రభుత్వ యంత్రాంగం.. ఈ నెలలో ఇప్పటి వరకు 85 బాల్య వివాహాలను నివారించినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కేఎస్ జవహర్‌రెడ్డి కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షలో వెల్లడించారు.
ఇదే స్ఫూర్తిని ఇక ముందు కూడా కొనసాగించాల్సిందిగా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. జిల్లాల వారీగా బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే హాట్‌స్పాట్లను గుర్తించి అక్కడ చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని, అక్షయ తృతీయ, శ్రావణ, మాఘ మాసాలు మొదలైన శుభ సందర్భాల్లో బాల్య వివాహాలు జరగకుండా మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం బాల్య వివాహాల నివారణకు జారీచేసిన మార్గదర్శకాలపై సంబంధిత సిబ్బందికి, అధికారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. 15–18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలను, 15–21 సంవత్సరాల వయస్సు గల బాలురను గుర్తించి వారిని ఓపెన్ స్కూల్స్, ఇంటర్, ఇతర దూరవిద్య కార్యక్రమాల్లో చేర్పించాలని సీఎస్ ఆదేశించారు.
పాఠశాలలు, కళాశాలల బయట ఉన్న కౌమార బాలికలను గుర్తించి వారికి నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇప్పించాలని చెప్పారు. బాల్య వివాహాల నిషేధ అధికారులు ప్రతి మూడు నెలలకోసారి సమీక్షలు నిర్వహించాలని, బాల్య వివాహాల నివారణతో పాటు బాలల హక్కులు, బాలల రక్షణ సమస్యలపై స్కూల్స్, జూనియర్ కాలేజీలు, సంక్షేమ హాస్టళ్లలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment