
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలోని అంశాలను త్వరగా అమలు చేయాలని పలు కేంద్ర ప్రభుత్వ శాఖలకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ బల్లా చెప్పారు. విభజన చట్టం 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాల అమలు పురోగతిపై అజయ్ భల్లా అధ్యక్షతన ఢిల్లీలో మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంబంధిత కేంద్ర శాఖల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రెండు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అజయ్ భల్లా మాట్లాడుతూ.. 13వ షెడ్యూల్లోని అంశాల అమలులో ఏమైనా మినహాయింపులు అవసరమైతే కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర కేబినెట్ ముందుకు తీసుకురావాలని చెప్పారు. పోర్టులు లాంటి ప్రాజెక్టుల వల్ల రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా మేలు జరుగుతుందని అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశా నిర్దేశం చేసిన అంశాలను ఈ సమావేశంలో సీఎస్ జవహర్‌రెడ్డి వివరించారు. వాటిని త్వరగా అమలు చేయాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం కోరినవివీ..
విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు పీపీపీ విధానంలో చేపడతామని, ప్రైవేట్ డెవలపర్ 60 శాతం భరిస్తున్నందున వయబులిటీ గ్యాప్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం 40 శాతం గ్రాంట్‌గా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ ప్రతిపాదనను కేంద్ర పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయాలని కేంద్ర హోంశాఖను కోరింది. సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మంజూరు చేయాలని, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై త్వరగా నిర్ణయం తీసుకుని అమలు చేయాలని చెప్పింది.
విశాఖపట్నం నుంచి రాయలసీమ ప్రాంతానికి అత్యంత వేగంగా నడిచే హై స్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేయాలని కోరింది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం, తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన విద్యుత్ బకాయిలు, మూడు ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర సాయం తదితర అంశాలను రాష్ట్ర ప్రభుత్వం సమావేశంలో ప్రస్తావించింది. ఈ అంశాలపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా్ల సానుకూలంగా స్పందించారు.