టాలీవుడ్ మూవీ జ్యువెల్ థీఫ్ రివ్యూ.. ఎలా ఉందంటే? | Tollywood Movie Jewel Thief Review In Telugu | Sakshi
Sakshi News home page

Jewel Thief Review In Telugu: జ్యువెల్ థీఫ్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?

Published Fri, Nov 8 2024 6:28 PM | Last Updated on Fri, Nov 8 2024 6:39 PM

Tollywood Movie Jewel Thief Review In Telugu

టైటిల్: జ్యూవెల్ థీఫ్ -  మూవీ రివ్యూ

నటీనటులు: కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్, అజయ్ తదితరులు
డైరెక్టర్: పీఎస్ నారాయణ
నిర్మాత: మల్లెల ప్రభాకర్
నిర్మాణ సంస్థ:  శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా
సంగీతం: ఎం. ఎం. శ్రీలేఖ

విడుదల తేదీ: 08 నవంబర్ 2024

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌ సినిమాలకు ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది. అందుకే సరికొత్త కంటెంట్‌తో దిగితే ప్రేక్ష‌కులే సూప‌ర్ హిట్ చేస్తారు. అలాంటి తరహాలో వ‌చ్చిన తాజా చిత్రం జ్యూవెల్ థీఫ్(Beware of Burglar). ఇవాళ ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. పీఎస్ నారాయణ దర్శకత్వం వహించగా.. మల్లెల ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

అసలు కథేంటంటే..

సిన్సియర్ ట్రావెల్స్ ఓనర్ కృష్ణ (కృష్ణసాయి) వ‌జ్రాలు, బంగారం న‌గ‌లు దొంగిలిస్తుంటాడు. శివారెడ్డితో క‌లిసి దొంత‌నాలు చేస్తూ వ‌చ్చిన డ‌బ్బుల‌తో అనాథ పిల్ల‌ల‌కు పంచిపెడ‌తాడు. నేహ (నేహా) నెక్లెస్ కూడా దొంగిలిస్తాడు. ప‌ట్టుబ‌డి జైలుకు వెళ్లి వ‌స్తాడు. కృష్ణ గురించి అస‌లు విష‌యం తెలుసుకుని అతన్ని ప్రేమిస్తుంది. ఇదే క్ర‌మంలో ఒక కండీష‌న్ పెడుతుంది. మోసం చేయకుండా, జూదం ఆడకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించాలని చాలెంజ్ విసురుతుంది. ఈ క్ర‌మంలో ధ‌నిక కుటుంబానికి చెందిన అనారోగ్యంగా ఉన్న వ్య‌క్తికి ప‌నులు చేస్తూ, అత‌డిని బాగు చేస్తాడు. కానీ అనారోగ్యంగా ఉన్న వ్య‌క్తిని చంపిన‌ట్టు హ‌త్య కేసులో ఇరుక్కుంటాడు. న‌మ్మించి భారీ దెబ్బ కొడ‌తారు. ఇంత‌కీ కృష్ణను మోసం చేసింది ఎవ‌రు? ఊహించ‌ని చిక్కుల్లో ఎలా ఇరుక్కుంటాడు? హ‌త్య కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాడా? లేదా? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

జ్యూవెల్ థీఫ్ అనే టైటిల్‌ వినగానే ఇదేదో దొంగల ముఠా కథ అయి ఉంటుందనుకుంటారు. అలాంటిదే అయినప్పటికీ ఇందులో ప్రేమకథను కూడా చూపించారు డైరెక్టర్. ఫస్ట్‌ హాఫ్‌లో పాత్రల పరిచయం, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమాయణం చూపించారు. పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్‌గానే వచ్చినప్పటికీ ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు.

అయితే సెకండాఫ్‌లో కథలో వేగం పుంజుకుంటుంది. ఆ హత్య కేసు చుట్టే కథ మొత్తం తిరుగుగుతుంది. కథను తాను అనుకున్నట్లుగా ప్రేక్షకులకు చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. త‌ను రాసుకున్న‌ కథను ఆక‌ట్టుకునే రీతిలో తెరపై ఆవిష్కరించారు. కానీ స్క్రీన్ ప్లే మరింత ఆకట్టుకునేలా ఉంటే బాగుండేది. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు.

ఎవరెలా చేశారంటే..

హీరో కృష్ణసాయి తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో డాన్స్, మేనరిజం, హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాలలో సూపర్ స్టార్ కృష్ణ పోలికలతో కనబడతారు. హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ తన గ్లామ‌ర్, ఫ‌ర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంది. సీనియర్ నటీనటులైన ప్రేమ, అజయ్ క‌థ‌కు తమదైన నటనతో అలరించారు. ఇక పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతా రెడ్డి తమ పాత్రల్లో చక్కగా న‌టించారు. సాంకేతికత విషయానికొస్తే ఎం.ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచింది. బ్యాక్ గ్రాండ్ స్కోర్ ఫర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ విజువల్స్ అందంగా చూపించారు. ఎడిటర్ జేపీ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. ఫైటర్ మాస్టర్ మార్షల్ రమణ స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement