సాక్షి, అమరావతి: స్వేచ్ఛామారుతంలో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రతి మదిలో పంద్రాగస్టు సంతోషం ఉప్పొంగింది. గుండెల్లో జాతీయ భావా న్ని నింపుకొని.. గుండెలపై జాతీయ జెండాను పెట్టుకున్నవారితో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మురిసిపోయింది. త్యాగధనుల స్మరణలో.. ప్రజాసంక్షేమ నాయకత్వంలో.. బంగారు భవిష్యత్తు ధీమాలో రాష్ట్రంలో 77వ స్వాతంత్య్రదిన వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా సాగాయి.
త్రివర్ణపతాక రెపరెపల నడుమ సాయుధదళాల కవాతు, దేశభక్తిని నింపిన పోలీసు అందరినీ ఉత్తేజితుల్ని చేశాయి. స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్‌ను పరిశీలించారు. గ్యాలరీల్లో ఆసీనులైన ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ప్రత్యేక ఆహా్వనితులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ ముందుకు సాగారు. తర్వాత సాయుధదళాల గౌరవ వందనం స్వీకరించారు.
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
వేడుకల్లో 14 ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాష్ట్రంలో ప్రభుత్వ సేవలను ప్రతిబింబిస్తూ శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. అగ్నిమాపక, పాఠశాల విద్య, వైద్యం, అటవీ, పరిశ్రమలు, రెవెన్యూ, గృహనిర్మాణ, సంక్షేమ, మహిళా అభివృద్ధి–శిశుసంక్షేమ, గ్రామీణ పేదరిక నిర్మూలన, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్టు, వ్యవసాయ, పశుసంవర్థక, గ్రామ–వార్డు సచివాలయాల శకటాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. పాఠశాల విద్య–సమగ్ర శిక్ష శకటానికి మొదటి బహుమతి దక్కగా వైద్య ఆరోగ్యశాఖ, గ్రామ–వార్డు సచివాలయాలశాఖ రెండు, మూడు బహుమతుల్ని దక్కించుకున్నాయి.
దేశభక్తిని చాటిన సాయుధదళాల కవాతు
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక సాయుధదళాల కవాతు స్వతంత్ర భారతావని రక్షణ, దేశభక్తిని, అమరవీరుల త్యాగనిరతిని చాటిచెప్పింది. తెలంగాణ రాష్ట్ర 17వ స్పెషల్ పోలీసు బెటాలియన్, ఏపీ ఎన్‌సీసీ బాలబాలికల బృందం పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు, యూత్ రెడ్‌క్రాస్, మాజీ సైనికుల కవాతు ప్రశంసలు అందుకుంది.
ఏపీఎస్పీ బ్రాస్‌బ్యాండ్, ఫైర్‌బ్రాండ్ బృందాల కళాప్రదర్శన ఆçహూతుల్లో స్వాతంత్య్ర ఉద్వేగాన్ని పెంచింది. కవాతులో ఉత్తమ ప్రదర్శనగా సాయుధదళాల విభాగంలో 9వ ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్, ద్వితీయ స్థానంలో 16వ ఏపీఎస్పీ విశాఖ బెటాలియన్ నిలిచాయి. అన్ ఆర్మ్‌డ్ విభాగంలో ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రథమ స్థానం, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందం ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి.
స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు
ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతీరెడ్డి, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, మేయర్ భాగ్యలక్ష్మి, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఆర్టీఐ ప్రధాన కమిషనర్ ఆర్‌ఎం బాషా, అగ్రిమిషన్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి, తెలుగు–సంస్కృత అకాడమీ చైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి, ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షుడు విజయబాబు, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాలకు అవార్డులు
ఈ ఏడాది జరిగిన పదోతరగతి పరీక్షల్లో నూరుశాతం విద్యార్థుల ఉత్తీర్ణతతో పాటు విద్యార్థుల సరాసరి అత్యధిక మార్కులు సాధించిన స్కూళ్లకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అవార్డులను అందజేశారు. సీతంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జియ్యమ్మవలస జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (పార్వతీపురం మన్యం జిల్లా), ఏపీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల (భీమునిపట్నం), భద్రగిరిలోని ఏపీ గిరిజన బాలికల సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల–యూఆర్జేసీ (పార్వతీపురం మన్యం జిల్లా), మంచాల ఏపీ మోడల్ స్కూల్ (అనకాపల్లి జిల్లా), పెద్దపవని ఏపీ సాంఘిక సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ (శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా), డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మెమోరియల్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ (కర్నూలు), వీరఘట్టం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ (పార్వతీపురం మన్యం జిల్లా) ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు అవార్డులను అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment