CM YS Jagan Review on Department of Higher Education - Sakshi
Sakshi News home page

విదేశాల్లో కోర్సులను మన విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి: సీఎం జగన్‌

Published Thu, Jan 19 2023 1:08 PM | Last Updated on Thu, Jan 19 2023 6:40 PM

CM YS Jagan Review on Department of Higher Education - Sakshi

సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ  సమీక్షా సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డి, విద్యాశాఖ సలహాదారు ఏ సాంబశివారెడ్డి, ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్‌జీయూకేటీ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కే సి రెడ్డి, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్,  ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కె హేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సీఎం వైఎస్ జగన్‌ సూచనలు ఇవే..
- డిగ్రీ విద్యార్థుల నైపుణ్యం పెంచాలి..
డిగ్రీ చదువుతున్నవారి నైపుణ్యాలను బాగా పెంచాలి. వివిధ కోర్సులను పాఠ్యప్రణాళికలో ఇంటిగ్రేట్‌ చేయాలి. విదేశాల్లో విద్యార్థులకు అందిస్తున్న వివిధ కోర్సులను పరిశీలించి వాటిని కూడా ఇక్కడ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలి. జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌ ఉండాలి. సర్టిఫైడ్‌ ఆన్‌లైన్‌ వర్టికల్స్‌ కరిక్యులమ్‌లో భాగం కావాలి. ఈ తరహా కోర్సుల వలన డిగ్రీ పూర్తయ్యేనాటికి స్వయం ఉపాధి అందుతుంది. ప్రఖ్యాత కాలేజీల కరిక్యులమ్‌ చూసి, వాటిని మన దగ్గర అమలయ్యేలా చూడాలి. స్వయం ఉపాధిని కల్పించే నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్ వంటి సంస్ధలతో ఈ కోర్సుల కోసం టైఅప్‌ చేసుకోవాలి. రిస్క్‌ ఎనాలసిస్, బ్యాంకింగ్, రిస్క్‌ మేనేజిమెంట్, రియల్‌ ఎస్టేట్‌ వంటి కోర్సులపై దృష్టి పెట్టాలి. వచ్చే జూన్‌ నాటికి పాఠ్యప్రణాళికలో ఈ కోర్సులు భాగం కావాలి.

- పోస్టులు భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌.. 
ఉన్నత విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాము. ఈ ఖాళీల భర్తీపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. కోర్టు కేసులను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుని జూన్‌ నాటికి నియామక ప్రక్రియను ప్రారంభించేలా చూడాలి. ఉన్నత విద్యాశాఖలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నాము. ఈ నేపధ్యంలో సిబ్బంది భర్తీ కూడా త్వరితగతిన చేపట్టాలి. ఆ మేరకు మరింత చురుగ్గా పనిచేయాలి.

- కాలేజీల్లో ప్రమాణాలు పెరగాలి..
ఉన్నత విద్యాశాఖ పరిధిలోని ప్రతి కాలేజీలో కూడా బోధనపరంగా, వసతులు పరంగా నాణ్యత పెరగాలి. ప్రతి విద్యా సంస్థ కూడా నాక్‌ అక్రిడిటేషన్‌ సాధించాలి. మూడేళ్లలో కాలేజీల ప్రమాణాలు పెంచుకునేలా వారికి చేయూత నివ్వాలి. ఒక్కో ఏడాది ఒక్కో లక్ష్యాన్ని అందుకుంటూ మూడేళ్లలో ప్రమాణాలు పెంచుకోవాలి. మూడేళ్ల తర్వాత కచ్చితంగా ఉన్నత విద్యాశాఖలోని విద్యాసంస్థలు నాక్‌ అక్రిడిటేషన్‌ సాధించాలి. అలా సాధించలేని పక్షంలో సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలి. అప్పుడే విద్యార్ధులకు నాణ్యమైన విద్య అందుతుంది.

- 175 స్కిల్‌ సెంటర్లు ఏర్పాటు..
కళాశాలల్లో కోర్సులన్నీ నేటి అవసరాలకు తగిన విధంగా రూపొందించాలి. కళాశాలలకు అనుమతుల విషయంలో కూడా యూనిఫామ్‌ పాలసీ ఉండాలి. వివిధ కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్‌ అందించే బాధ్యత స్కిల్‌ యూనివర్సిటీ తీసుకోవాలి. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 స్కిల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాము. ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న పరిశ్రమలకు అనుగుణంగా కోర్సులు ఏర్పాటు చేయాలి. హై ఎండ్‌ స్కిల్స్‌లో భాగంగా.. సాప్ట్‌వేర్‌ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేయాలి.

కోడింగ్, క్లౌడ్‌ సర్వీసెస్‌ వంటి డిమాండ్‌ ఉన్న కోర్సులపై దృష్టి పెట్టాలి. విద్యార్ధులకు సర్టిఫికేషన్‌ ఉంటేనే ఎంప్లాయిమెంట్‌ పెరుగుతుంది. ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖలు కలిపి కరిక్యులమ్‌ రూపొందించాలి. సోలార్‌ పార్క్‌లు, సోలార్‌ మోటార్లు, ప్యానెల్స్‌ రిపేరు వంటి వాటిలో నైపుణ్యం కొరత చాలా ఎక్కువగా ఉంది. ప్రతి నియోజకవర్గంలో ఇవి అందుబాటులో ఉండాలి. ఈ మేరకు కోర్సులు, కరిక్యులమ్, శిక్షణ ఉండాలి. వచ్చే జూన్‌ లక్ష్యంగా ఈ తరహా కోర్సులు ఏర్పాటు చేయాలి.  

కొన్ని ప్రైవేటు బీఈడీ కాలేజీల్లో బోధన, వసతులు తీసికట్టుగా ఉన్నాయని, మరికొన్ని కాలేజీలు మోసపూరిత చర్యలకు దిగుతున్నాయని సమావేశంలో చర్చ జరిగింది. ఈ క్రమంలో బోధన సిబ్బంది, వసతి, సౌకర్యాలను ప్రమాణంగా తీసుకోవాలని, అందులో చదివే విద్యార్థుల హాజరును మరొక ప్రమాణంగా తీసుకుని ఆయా కాలేజీలపై ఒక నిర్ణయానికి రావాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. 

బోధన సిబ్బంది సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీని బలోపేతం చేయడం సహా సెంట్రల్‌ ఆంధ్రా పరిధిలో ఒక చోట అకడమిక్‌ స్టాఫ్‌ కాలేజీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు.  

- డ్రాప్‌ అవుట్‌ పరిస్థితి ఉండకూడదు..
పిల్లలు చదువులు ప్రారంభించిన తర్వాత ఏ దశలోనూ డ్రాప్‌ అవుట్‌ అన్న పరిస్థితే రాకుండా ఈ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంది. పిల్లలను బడికి పంపితే చాలు.. నేరుగా తల్లి అకౌంట్‌లోకి   అమ్మ ఒడి పథకం ద్వారా డబ్బు జమచేస్తోంది. టెన్త్‌ తర్వాత ఐటీఐ, పాలిటెక్నిక్‌ వైపు వెళ్తున్న వారికి కూడా విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తోంది. ఇక మెడిసిన్, ఇంజనీరింగ్‌ వంటి ఇతర చదువులు చదువుతున్న వారికి పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తోంది. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను దేశంలో అందిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే. అలాగే వసతి దీవెన కూడా అందిస్తున్న రాష్ట్రం కూడా ఏపీనే. ఈ కార్యక్రమాల వల్ల ఎక్కడా కూడా చదువులు మానేయాల్సిన పరిస్థితి అన్నది లేదు. ఫలితంగా జీఈఆర్‌ రేషియో తప్పకుండా పెరుగుతుంది. సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాల సాధనలో ఇవి ప్రతిబింబించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

- యూనివర్శిటీల్లో రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంపై ఆలోచన చేయాలి. సమర్థులైన బోధనా సిబ్బందిని నియమించేందుకు, తద్వారా బోధనా ప్రమాణాలను విశ్వవిద్యాలయాల్లో పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలి. 

- ట్రిపుల్‌ ఐటీలపైనా సీఎం సమీక్ష
ట్రిపుల్‌ ఐటీలలో సిబ్బంది నియామకం, ఇతర పెండింగ్‌ అంశాలను సత్వరమే పరిష్కరించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు.  

చదవండి: (మంగళగిరిలో రాష్ట్ర అటవీశాఖ కార్యాలయం ప్రారంభం)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement