విజయవాడ, సాక్షి: వరద బీభత్సం ముమ్మాటికీ మానవ తప్పిదమేనని, నష్టనివారణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీ వరద బాధితులకు అండగా నిలిచే క్రమంలో.. వైఎస్సార్‌సీపీ ఇవాళ భారీ విరాళం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన పార్టీ సమావేశం అనంతరం.. విజయవాడలో బొత్స మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు సర్కార్‌ను నిలదీసిన బొత్స.. ‘‘భారీ వర్షాలు వస్తాయని మీకు తెలుసా? తెలియదా?. వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. అసలు ఇరిగేషన్ శాఖ ఏం చేస్తోంది?. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. వరద బాధితులకు కనీసం భోజనం కూడా అందించడ లేదు. బాధితులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వంపై లేదా? అధికార యంత్రాగం అసలేం చేస్తోంది?. మీరు, మీ సలహాదారులు ఏంచేస్తున్నారు.
మా లాగా ఎందుకు చేయలేకపోతున్నారు.. గతంలోనూ ప్రకాశం బ్యారేజీకి 11 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పుడు మేమంతా వారం రోజులు అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షించాం. ఇప్పుడు వరదలు వస్తున్నా ఎందుకు మానిటరింగ్ చేయలేకపోయారు. అసలు ఎన్ని రిలీఫ్ క్యాంపులు పెట్టారు.. ఎంత మందిని తరలించారు.. బయటకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది.
మాపై బురదా?.. రిటైనింగ్ వాల్ లేకుంటే ఎంత నష్టం జరిగి ఉండేది. గోడ కట్టాం కాబట్టే నష్టం తగ్గింది. కరకట్టకు గండి పడితే కుట్ర కోణం అంటున్నారు. బ్యారేజీని బోట్లు ఢీ కొడితే కుట్ర కోణం అంటున్నారు. బాధ్యత ఉన్నవాళ్లు అలా మాట్లాడతారా?. బాబు ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు. మేం ప్రశ్నిస్తుంటే మాపై బురద జల్లుతున్నారు.
జగన్ చేసిన మంచి.. రిటైనింగ్ వాల్ పై సిగ్గు లేని టీడీపీ ప్రచారం
పాల ప్యాకెట్లతో మొదలుపెట్టి.. మూడు రోజులుగా వరదకి విజయవాడ అతలాకుతలం అయ్యింది. ప్రజలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. కనీసం నీళ్లు, పాలు కూడా అందక అవస్థలు పడుతున్నారు. ఈరోజు వరకు కనీస అవసరాలు అందలేదు. అందుకే వరద బాధితులకు పార్టీ తరఫున కోటి రూపాయల సాయం అందించాలని వైఎస్ జగన్ నిర్ణయించారు. రేపు ఉదయం నుంచే పార్టీ నుంచి సహాయక చర్యలు పప్రారంభం అవుతాయి. లక్ష పాల ప్యాకెట్లను పంపిణీ చేస్తాం. బాధితులకు ఏం సాయమో తెలుసుకుని అందజేస్తాం అని బొత్స అన్నారు.
హెరిటేజ్ నుంచి పాలివ్వలేరా?.. సీఎం చంద్రబాబే ఆహారం ఇవ్వలేకపోయాను అన్నారు. వరదకి తగ్గట్టుగా ఎందుకు ఆహారం సిద్ధం చేయలేకపోయారు. హెరిటేజ్ నుండి, ఇతర డైరీల నుండి పాలు ముందు తెప్పించలేరా?. చంద్రబాబు అనుభవం, విజన్ అని మాట్లాడతారు. మాటలే కానీ పని ఏది?. అసలు ముందుగా ఎందుకు స్పందించలేదు?. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నీటిని, వరద ని అంచనా వేసి నీరు వదిలితే ఈ ఉపద్రవం వచ్చేది కాదు. బుడమేరుకి బ్యాక్ వాటర్ వస్తుందని తెలియదా?. సీఎం ఒక్క సమావేశం అయినా పెట్టారా?. పోనీ ఒక్క మంత్రి అయినా సమావేశం పెట్టారా..? చెప్పండి.
బస్సులో బస! ఎవరొద్దన్నారు.. చంద్రబాబు తాను బస్‌లో పడుకుని పని చేస్తున్నాం అంటున్నారు. బస్ లో పడుకున్నా.. ఆఫీస్ లో పడుకున్న..ఏం లాభం?. ఆయన నివాసం ఎంత దూరం?. అది మునిగింది కాబట్టే కదా మీరు కలెక్టరేట్ కి వెళ్ళింది. కరకట్టలోపల కట్టడాలు మునిగిపోతాయని, ఎప్పటికైనా అది ప్రమాదమని మేం ఎప్పుడో చెప్పాం. పడవల్లో జనం రావడానికి వేలకు వేలు వసూలు చేస్తుంటే ఏం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలను ఆదుకోండి. వరద తగ్గుతుంది కాబట్టి ప్రజలను ఆదుకోండి. అధికారులు మాట వినకపోతే చర్యలు తీసుకోండి.. ఎవరోద్దన్నారు!.
వరదలతో రైతులు తీవ్రంగా పంటలు నష్టపోయారు. రైతులను ప్రభుత్వం పూర్తిగా ఆదుకోవాలి. అమరావతి గ్రామాల్లో మూగజీవాలు వరదకు కొట్టుకు వెళ్లాయి. కరకట్టకి వరద వచ్చిందా? లేదా?. నాకు అనుమతి ఇవ్వండి.. చూసొద్దాం పదండి. దాచేస్తే వాస్తవాలు దాగిపోవు అని చంద్రబాబును ఉద్దేశించి బొత్స అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment