![SVBC Channel Employee Dismissed Due To Watching Obscene Video - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/11/computer.jpg.webp?itok=FqGvCTJS)
సాక్షి, తిరుమల : శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ)లో ఓఎస్‌ఓ( అటెండర్)గా విధులు నిర్వహిస్తున్న ఒక ఉద్యోగిని బుధవారం విధుల నుండి తొలగించారు. ఈ ఏడాది సెప్టెంబరు నెలలో వెంకట క్రిష్ణ అనే భక్తుడు శతమానం భవతి కార్యక్రమానికి సంబందించిన వివరాలను మెయిల్ ద్వారా కోరారు. అందుకు ఎస్వీబీసీ ఉద్యోగి భక్తుడికి అశ్లీల వెబ్ సైట్ కు సంబంధించిన లింక్ పంపించారు. దీనిపై భక్తుడు టీటీడీ చైర్మన్, ఈవోలకు ఫిర్యాదు చేశారు.. ఈ విషయంపై స్పందించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి విచారణకు ఆదేశించారు.
(చదవండి : ఎస్వీబీసీలో సిబ్బంది ‘అశ్లీల’ నిర్వాకం)
దాదాపు 25 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లతో ఎస్వీబీసీలోని అన్ని కంప్యూటర్లను సెక్యూరిటీ అడిట్ చేశారు. సైబర్ సెల్ టీం దర్యాప్తులో మరో ముగ్గురు లేదా నలుగురు ఉద్యోగులు ఇలాంటి పనులు చేసినట్లు తెలిసింది. ఇంకా ఎంతమంది ఉద్యోగులు ఇలాంటి పనులు చేశారో పరిశీలించి వారిని కూడా ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఎస్వీబీసీ సిఈవో తెలిపారు.
ఈ సంఘటన అనంతరం సంస్థ ప్రతిష్టను పరిరక్షించడంలో భాగంగా పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నది. ఇకపై ఎస్వీబీసీ కంప్యూటర్ ఆపరేషన్ టీటీడీ ఐటీ విభాగం పర్యవేక్షణలో జరుగుతుంది. ఎస్వీబీసీలో ప్రతి కంప్యూటర్ కు పాస్వర్డ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా ఏ కంప్యూటర్ ను ఎవరు ఉపయోగిస్తున్నారు అనేది తెలుస్తుంది. అదేవిధంగా ఎస్వీబీసీని టీటీడీ విజిలెన్స్ పర్యవేక్షణలోనికి తీసుకురావాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment