సాక్షి, అమరావతి: వివిధ శాఖల్లో పెరిగిపోతున్న న్యాయ వివాదాలను వేగంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం లీగల్ మేనేజ్‌మెంట్ యూనిట్ (ఎల్‌ఎంయూ), లీగల్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ (ఎల్‌ఎంవో) పేరుతో రెండు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
న్యాయ కేసుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ లీగల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్ (ఓఎల్‌సీఎంఎస్) ఏర్పాటు చేసిన తర్వాత నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం ఆర్థికపరమైనవే. వీటికి న్యాయపరంగా పాటించాల్సిన ప్రోటోకాల్స్, పరిష్కారం తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన లేకపోవడం కారణంగా గుర్తించింది.
ఈ సమస్య పరిష్కారానికి ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్) లీగల్ మేనేజ్‌మెంట్ యూనిట్, లీగల్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్ సహాయం తీసుకోనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎల్‌ఎంయూ, ఎల్‌ఎంవో విధివిధానాలను స్పష్టంగా పేర్కొన్నారు.
ఎల్‌ఎంయూ
సీనియర్, జూనియర్ న్యాయ విశ్లేషకులు, పోగ్రామ్ మేనేజర్, డేటా ఎనలటిక్స్ సభ్యులతో లీగల్ మేనేజ్‌మెంట్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఇది ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌కి గవర్నెన్స్ కన్సల్టెన్సీ వింగ్‌గా పనిచేస్తుంది. వివిధ శాఖల్లో న్యాయపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఓఎల్‌సీఎంఎస్‌ను సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటుంది.
న్యాయ శాఖ అధికారుల సూచనలతో ప్రతి విభాగంలో లిటిగేషన్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్స్, టెంప్లెట్స్, అధికారులకు సూచనలు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ఎల్‌ఎంయూకు అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అడ్వొకేట్ జనరల్ కో చైర్‌పర్సన్‌గా ఉండే ఈ అడ్వైజరీ కమిటీలో రెవెన్యూ, ఆర్థిక, పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, హోం, పాఠశాల విద్య, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శులు, ఫైనాన్స్, జీఏడీ కార్యదర్శులు, ఓఎల్‌సీఎంఎస్ నోడల్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు.
న్యాయ శాఖ కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ రెండు నెలలకు ఒకసారి సమావేశమై అన్ని విభాగాల్లో అమలవుతున్న ప్రాజెక్టులు, వాటి పనితీరు, న్యాయపరమైన ఇబ్బందులు వంటి వాటిని గుర్తించి పరిష్కరించాలి. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షునిగా వివిధ శాఖల విభాగాధిపతులతో కూడిన 12 మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై పర్యవేక్షిస్తుండాలి.
ఎల్‌ఎంవో
సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఎల్‌ఎంయూ సహకారం అందిస్తుంది. న్యాయపరంగా కేసులు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి, అధికా రులు, ప్రభుత్వ ప్లీడర్లు, ఏజీ కౌన్సిల్ ఆఫీసర్ల సమాచారం త్వరతగతిన చేరేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఎల్‌ఎంవోగా ప్ర ముఖ న్యాయసేవల సంస్థ దక్ష సొసైటీ వ్యవహరించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment