legal dispute
-
పదోన్నతుల ఆశ.. బదిలీలకు భరోసా
సాక్షి, హైదరాబాద్: బదిలీలు, పదోన్నతులకు న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో విద్యాశాఖలో మళ్లీ హడావుడి మొదలైంది. కొన్నేళ్లు గా ఎదురుచూస్తున్న టీచర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై కొన్ని నెలల క్రితం విధించిన స్టేకి హైకోర్టు బుధవారం సడలింపు ఇచ్చింది. దీంతో తక్షణమే ప్రక్రియను మొదలుపెట్టాలని విద్యాశాఖకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినట్టు తెలిసింది. కోర్టు ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే విధివిధానాలపై ఉన్నతాధికారులు చర్చించే అవకాశముంది. వీలైనంత త్వరగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి. బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన డేటా, దరఖాస్తుల స్వీకరణకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పనపై దృష్టిపెట్టాల్సి ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎనిమిదేళ్లుగా నోచుకోని పదోన్నతులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వగా, దాదాపు 6 వేల మంది పదోన్నతులు పొందారు. ఆ తర్వాత ప్రమోషన్ల వ్యవహారం వాయిదా పడుతూనే ఉంది. ఎనిమిదేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. 2021లో బదిలీలు, పదోన్నతులు చేపడతామని ప్రభుత్వం ప్రకటించినా కోవిడ్ దృష్ట్యా ఇది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు, 317 జీవో అమల్లో భాగంగా కొత్త జిల్లాలకు బదిలీలు చేపట్టడం అనేక వివాదాలకు దారితీసింది. వాస్తవానికి ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల్లో 6,362 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు ఇవ్వాల్సి ఉంటుంది. 7,141 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని విద్యాశాఖ తెలిపింది. ఇందులో 30 శాతం నేరుగా టీఆర్టీ ద్వారా భర్తీ చేయనుండగా, 70 శాతం ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తారు. హెచ్ఎం పోస్టులు 1,947 ఖాళీలుండగా, ఇందులో పదోన్నతులతో భర్తీ చేసేందుకు 1,367 మంది అర్హులని లెక్కతేల్చారు. ప్రైమరీ స్కూల్ హెచ్ఎంల పోస్టులు 2,043 ఖాళీలుంటే, 1,942 మందికి పదోన్నతులు లభిస్తాయి. ఇతరత్రా కలుపుకొంటే మొత్తం 10,352 మంది టీచర్లకు పదోన్నతులు లభించే వీలుంది. బదిలీలకు 50 వేల మంది రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2018లో సాధారణ బదిలీలు చేశారు. నిబంధనల ప్రకారం ఐదేళ్లు ఒకేచోట పనిచేసే హెచ్ఎంలు, 8 ఏళ్లుగా ఒకేచోట పనిచేసే టీచర్లు బదిలీలకు దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది. 2018లో 78 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 48 వేల మందికి బదిలీలు జరిగాయి. గత జనవరిలో బదిలీల షెడ్యూల్ ఇవ్వగా.. 75 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా షెడ్యూల్ ఇస్తే 8 ఏళ్లు నిండిన వారి సంఖ్య మరో 2 వేలు పెరిగే అవకాశముంది. వీరిలో సీనియారిటీ, సర్వీస్ పాయింట్ల ప్రాతిపదికన 50 వేల మంది బదిలీ అయ్యే వీలుంది. కొత్త షెడ్యూల్ ఎప్పుడు? ఆన్‌డ్యూటీ తీసుకునే ఉపాధ్యాయ సంఘాల నేతలకు సరీ్వస్ పాయింట్లపై కోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తాజా షెడ్యూల్లో ఈ పాయింట్లను తొలగించాల్సి ఉంది. దీంతో గత జనవరిలో మొదలు పెట్టిన బదిలీల ప్రక్రియలో మార్పులు చేసి ప్రభు త్వం కొత్త షెడ్యూల్ ఇవ్వడంతోపాటు మార్గదర్శకాలను రూపొందించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ఏ ప్రాతిపదికన మూడు కేటగిరీలుగా సరీ్వసు పాయింట్లు ఇస్తారు. దీంతోపాటే సరీ్వస్‌ను బట్టి కొన్ని పాయింట్లు ఇస్తారు. వీటన్నింటినీ పరిగణనలోనికి తీసుకుని జిల్లాల వారీగా సీనియారిటీ, సబ్జెక్టుల వారీగా సీనియారిటీని తయారు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియకు కొంత సమయం పడుతుందని, షెడ్యూల్ మాత్రం వీలైనంత త్వరగా ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. టీఆర్టీకి పోస్టులు పెరుగుతాయా? విద్యాశాఖలో 22 వేల ఖాళీలుంటే, ప్రభుత్వం కేవలం 5,089 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై నిరుద్యోగులు, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. తాజాగా పదోన్నతులు చేపడుతున్న నేపథ్యంలో కొన్ని కొత్త ఖాళీలు వెల్లడయ్యే వీలుంది. మొత్తం 10 వేలకుపైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఐదువేలతో కలుపుకొంటే మొత్తం 15 వేలకుపైగా నియామకం చేపట్టాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా మోక్షం కల్పించండి: ఉపాధ్యాయ సంఘాలు కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో తక్షణమే టీచర్ల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియకు షెడ్యూల్ ఇవ్వాలని, ఖాళీలను భర్తీ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి కోరారు. న్యాయస్థానం ఆదేశాలను స్వాగతిస్తున్నామని పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, బీరెల్లి కమలాకర్ రావు తెలిపారు. ఏళ్ల తరబడి టీచర్లు బదిలీలు, పదోన్నతులకు నోచుకోవడం లేదని, ఇకనైనా ప్రభుత్వం షెడ్యూల్ ఇవ్వాలని పీఆర్టీయూ తెలంగాణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెన్నయ్య కోరారు. ఉపాధ్యా సంఘాల నేతలు పది ప్రత్యేక పాయింట్లు కోల్పోవడం దురదృష్టకరమని, ఈ అంశాన్ని పరిశీలించాలని ఎస్టీయూ అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులు సదానందం గౌడ్, పర్వత్‌రెడ్డి కోరారు. -
ప్రభుత్వ శాఖల్లో న్యాయ వివాదాల సత్వర పరిష్కారం
సాక్షి, అమరావతి: వివిధ శాఖల్లో పెరిగిపోతున్న న్యాయ వివాదాలను వేగంగా పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం లీగల్ మేనేజ్మెంట్ యూనిట్ (ఎల్ఎంయూ), లీగల్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ (ఎల్ఎంవో) పేరుతో రెండు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయ కేసుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన ఆన్లైన్ లీగల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ (ఓఎల్‌సీఎంఎస్) ఏర్పాటు చేసిన తర్వాత నమోదవుతున్న కేసుల్లో అత్యధిక శాతం ఆర్థికపరమైనవే. వీటికి న్యాయపరంగా పాటించాల్సిన ప్రోటోకాల్స్, పరిష్కారం తదితర అంశాలపై ఉద్యోగులకు అవగాహన లేకపోవడం కారణంగా గుర్తించింది. ఈ సమస్య పరిష్కారానికి ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ (ఏపీసీఎఫ్ఎస్ఎస్) లీగల్ మేనేజ్మెంట్ యూనిట్, లీగల్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ సహాయం తీసుకోనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎల్ఎంయూ, ఎల్ఎంవో విధివిధానాలను స్పష్టంగా పేర్కొన్నారు. ఎల్ఎంయూ సీనియర్, జూనియర్ న్యాయ విశ్లేషకులు, పోగ్రామ్ మేనేజర్, డేటా ఎనలటిక్స్ సభ్యులతో లీగల్ మేనేజ్మెంట్ యూనిట్ ఏర్పాటు చేస్తారు. ఇది ఏపీసీఎఫ్ఎస్ఎస్కి గవర్నెన్స్ కన్సల్టెన్సీ వింగ్‌గా పనిచేస్తుంది. వివిధ శాఖల్లో న్యాయపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటికి పరిష్కార మార్గాలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఓఎల్సీఎంఎస్ను సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటుంది. న్యాయ శాఖ అధికారుల సూచనలతో ప్రతి విభాగంలో లిటిగేషన్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్, టెంప్లెట్స్, అధికారులకు సూచనలు ఇచ్చే వ్యవస్థ ఏర్పాటు చేస్తుంది. ఇందుకోసం ఎల్ఎంయూకు అడ్వైజరీ, ఎగ్జిక్యూటివ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అడ్వొకేట్ జనరల్ కో చైర్‌పర్సన్‌గా ఉండే ఈ అడ్వైజరీ కమిటీలో రెవెన్యూ, ఆర్థిక, పీఆర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, హోం, పాఠశాల విద్య, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శులు, ఫైనాన్స్, జీఏడీ కార్యదర్శులు, ఓఎల్‌సీఎంఎస్ నోడల్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు. న్యాయ శాఖ కార్యదర్శి సభ్య కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీ రెండు నెలలకు ఒకసారి సమావేశమై అన్ని విభాగాల్లో అమలవుతున్న ప్రాజెక్టులు, వాటి పనితీరు, న్యాయపరమైన ఇబ్బందులు వంటి వాటిని గుర్తించి పరిష్కరించాలి. రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధ్యక్షునిగా వివిధ శాఖల విభాగాధిపతులతో కూడిన 12 మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని ఏర్పాటుచేశారు. ఈ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశమై పర్యవేక్షిస్తుండాలి. ఎల్ఎంవో సమస్యలను వేగంగా పరిష్కరించడానికి ఎల్ఎంయూ సహకారం అందిస్తుంది. న్యాయపరంగా కేసులు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలి, అధికా రులు, ప్రభుత్వ ప్లీడర్లు, ఏజీ కౌన్సిల్ ఆఫీసర్ల సమాచారం త్వరతగతిన చేరేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. ఎల్ఎంవోగా ప్ర ముఖ న్యాయసేవల సంస్థ దక్ష సొసైటీ వ్యవహరించనున్నట్లు ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. -
మధ్యవర్తిత్వంతో సత్వర న్యాయ పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: ఆర్బిట్రేటరీ (న్యాయ వివాదాలకు మధ్యవర్తిత్వం) వ్యవస్థతో వేగంగా న్యాయవివాదాల పరిష్కారం సాధ్యమవుతుందని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిసొల్యూషన్ (ఐసీఏడీఆర్) రీజినల్ ఇన్చార్జి జేఎల్ఎన్ మూర్తి అన్నారు. ప్రత్యామ్నాయ న్యాయవివాదాల పరిష్కారాలపై ఇంజినీర్లకు అవగాహన కల్పించేందుకు ఎర్రమంజిల్‌లోని ఈఎన్సీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన రెండు రోజుల సదస్సులో ఆయన ప్రసంగించారు. మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ వినోభా దేవి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జేఎల్ఎన్ మూర్తి స్వాగతోపాన్యాసం చేస్తూ.. ఆర్బిట్రేటరీలతో ఉన్న ప్రయోజనాలను వివరించారు. రూ.40 లక్షల్లోపు విలువైన పనులకు మధ్యవర్తిత్వాన్ని ఆశ్రయించవచ్చని తెలంగాణ ప్రభుత్వం వెసులుబాటు కల్పించడాన్ని ఆయన స్వాగతించారు. ఇంజినీరింగ్ పనుల్లో జాప్యం నివారించి, అభివృద్ధి వేగిరపరిచేలా ఆర్బిట్రేటరీ దోహదపడుతుందన్నారు. కేసుల ఆధారంగా సంబంధిత రంగంలో నిపుణులైన వ్యక్తులు (మెడికల్, ఇంజనీరింగ్, సీఏ, ఫైనాన్స్) కేసులు వాదించడంతో సత్వర పరిష్కారం దొరికేందుకు వీలు చిక్కుతుందన్నారు. నచ్చిన సమయంలో, నచ్చిన వేదిక, నచ్చిన భాషను జడ్జిని ఎంచుకునే వీలు ఉండటం దీని ప్రత్యేకత అని వివరించారు. ఆగ్నేసియా దేశాలైన సింగపూర్, మలేసియా ఆర్థికాభివృద్ధిలో ఆర్బిట్రేటరీ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందన్నారు. 1996లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన వ్యవస్థకు ప్రధాని మోదీ ఇటీవల చేసిన చట్టసవరణల ద్వారా ఆర్బిట్రేటరీ ద్వారా సులువుగా, వేగంగా జాతీయ, అంతర్జాతీయ న్యాయవివాదాలు సమసిపోతున్నాయన్నారు. మనరాష్ట్రంలోకూడా పలు కేసుల శీఘ్ర పరిష్కారానికి పలువురు ఆర్బిట్రేటరీని ఆశ్రయిస్తున్నారని వెల్లడించారు. గృహహింస, వరకట్న వేధింపులు, కుటుంబ పరమైన వివాదాలు, పలు ఇతర ఐపీసీ కేసులను అంతర్జాతీయ ప్రత్యామ్నాయ న్యాయ వివా దాల పరిష్కార వేదిక (ఐసీఏడీఆర్) వేగంగా పరిష్కరిస్తుందన్నారు. అనంతరం మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథలో తలెత్తే వివాదాలపై ఇంజనీర్లకు అవగాహన కల్పించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. -
డొకోమోతో వివాదానికి ‘టాటా’!
⇒ 1.18 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకారం... ⇒ సెటిల్మెంట్ కుదిరిందని టాటా సన్స్ ప్రకటన ⇒ భారత్ నుంచి వైదొలిగేందుకు డొకోమోకు లైన్‌క్లియర్ న్యూఢిల్లీ: జపాన్ టెలికం దిగ్గజం ఎన్టీటీ డొకోమోతో వివాదానికి టాటా గ్రూప్ ముగింపు పలకనుంది. తమ టెలికం జాయింట్ వెంచర్ సంస్థ నుంచి డొకోమో వైదొలిగే విషయంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న న్యాయ వివాదంపై కోర్టు వెలుపల సెటిల్మెంట్కు అంగీకరించినట్లు టాటా సన్స్ మంగళవారం ప్రకటించింది. ఈ కేసులో డొకోమోకు 1.18 బిలియన్ డాలర్ల(దాదాపు రూ. 7,900 కోట్లు) పరిహారాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. ‘జూన్ 22, 2016న లండన్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టు(ఎల్‌సీఐఏ) డొకోమోకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలను పాటించేందుకు మేం అంగీకరిస్తున్నాం. దేశంలో సానుకూల పెట్టుబడి పరిస్థితులు కొనసాగేవిధంగా జాతీయ ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని దీనికి ఓకే చెప్పాం. కాంట్రాక్టు నిబంధనలను పక్కాగా పాటించే విషయంలో అంతర్జాతీయంగా టాటా గ్రూప్ పేరొందింది. దీనికి అనుగుణంగానే డొకోమోకు అనుకూలంగా ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పుపై భారత్‌లో లేవనెత్తిన అభ్యంతరాలను వెనక్కితీసుకోవాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది’ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తమ మధ్య జరిగిన సెటిల్మెంట్కు అనుమతించడంతోపాటు.. ఈ కేసులో న్యాయపరమైన ప్రక్రియను నిలిపివేయాలని(సస్పెండ్) ఢిల్లీ హైకోర్టుకు డొకోమో, టాటా సన్స్ విన్నవించాయి. టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించడం... కొత్త చైర్మన్‌గా ఎన్.చంద్రశేఖరన్ పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ వివాదానికి తెరపడుతుండటం గమనార్హం. చట్టపరమైన చర్యలకు బ్రేక్: డొకోమో ‘ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పు ప్రకారం టాటా సన్స్ 1.18 బిలియన్ డాలర్లను ఇప్పటికే డిపాజిట్ చేసింది. తాజాగా కుదిరిన సెటిల్మెంట్ మేరకు ఈ మొత్తాన్ని ఇక కోర్టు మాకు చెల్లించేందుకు దోహ దం చేస్తుంది. టాటా టెలిసర్వీసెస్‌లో మా వాటా షేర్లను టాటా సన్స్‌కు బదలీ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది’ అని డొకోమో ఒక ప్రకటన లో పేర్కొంది. వివాదాన్ని సంయుక్తంగా భారత్‌లో నే పరిష్కరించుకుంటున్న నేపథ్యంలో... అమెరికా, బ్రిటన్లలో టాటాలపై తాము చేపట్టిన చట్టపరమైన చర్యలను సస్పెండ్ చేసేందుకు అంగీకరించామని డొకోమో తెలిపింది. తాజా పరిణామాలతో భారత్ నుంచి డొకోమో పూర్తిగా వైదొలిగేందుకు లైన్ క్లియర్ అయింది. కాగా, డొకోమోతో భవిష్యత్తులో మళ్లీ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని టాటా సన్స్ పేర్కొంది. మరోపక్క, టాటాసన్స్‌తో కొత్త భాగస్వామ్య ఒప్పందం కింద మళ్లీ తాము భారత్‌లో పెట్టుబడులను పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని డొకోమో కూడా చెప్పడం గమనార్హం. వివాదం సంగతిదీ... ⇒ 2009 నవంబర్‌లో టాటా టెలిసర్వీసెస్‌లో జపాన్ కంపెనీ ఎన్టీసీ డొకోమో 26.5% వాటాను కొనుగోలు చేసింది. టాటాడొకోమో జాయింట్ వెంచర్(జేవీ)లో భాగస్వామిగా చేరింది. షేరుకి రూ.117 చొప్పున దాదాపు రూ.12,740 కోట్లను టాటా టెలి హోల్డింగ్ కంపెనీ అయిన టాటా సన్స్‌కు చెల్లించింది. ⇒ అయితే, తాము గనుక ఐదేళ్ల వ్యవధిలోపే ఈ జేవీ నుంచి వైదొలగిన పక్షంలో తాము చెల్లించిన ధరలో కనీసం 50 శాతాన్ని తమకు వెనక్కి ఇవ్వాలని డొకోమో షరతు పెట్టింది. దీనికి టాటా సన్స్ కూడా అంగీకరించడంతో ఒప్పందం కుదిరింది. ⇒ వ్యాపార ప్రతికూలతలతో డొకోమో 2014లో జేవీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. డీల్ మేరకు షేరుకి రూ.58 చొప్పున రూ.7,200 కోట్లు చెల్లించాలని టాటాలను కోరింది. ⇒ అయితే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం షేరుకి రూ.23.34 చొప్పున మాత్రమే తాము ఇవ్వగలమని టాటా గ్రూప్ పేర్కొంది. ⇒ దీనిపై డొకోమో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. టాటాలు డొకోమోకు 1.18 బిలియన్ డాలర్లను చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. ⇒ ఆర్బిట్రేషన్ కోర్టు ఆదేశాల మేరకు ఆర్బీఐ తన విదేశీ మారక చట్టం నుంచి మినహాయింపునివ్వాలని డొకోమో కోరింది. ఈ మినహాయింపు కోసం ఆర్బీఐ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. అయితే, ఈ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. కాగా, టాటా–డొకోమోకు ఓకే చెబితే చాలా కేసుల్లో ఇలాంటి మినహాయింపులు ఇవ్వాల్సివస్తుందన్న కారణంతోనే ఆర్థిక శాఖ నిరాకరిస్తున్నట్లు సమాచారం. తాజా సెటిల్మెంట్తో బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులోకి చేరింది.