డొకోమోతో వివాదానికి ‘టాటా’! | Tata Sons, DoCoMo settle legal dispute | Sakshi
Sakshi News home page

డొకోమోతో వివాదానికి ‘టాటా’!

Published Wed, Mar 1 2017 12:50 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

డొకోమోతో వివాదానికి ‘టాటా’!

డొకోమోతో వివాదానికి ‘టాటా’!

1.18 బిలియన్‌ డాలర్లు చెల్లించేందుకు అంగీకారం...
సెటిల్‌మెంట్‌ కుదిరిందని టాటా సన్స్‌ ప్రకటన
భారత్‌ నుంచి వైదొలిగేందుకు  డొకోమోకు లైన్‌క్లియర్‌  


న్యూఢిల్లీ: జపాన్‌ టెలికం దిగ్గజం ఎన్‌టీటీ డొకోమోతో వివాదానికి టాటా గ్రూప్‌ ముగింపు పలకనుంది. తమ టెలికం జాయింట్‌ వెంచర్‌ సంస్థ నుంచి డొకోమో వైదొలిగే విషయంలో చాలా ఏళ్లుగా నడుస్తున్న న్యాయ వివాదంపై కోర్టు వెలుపల సెటిల్‌మెంట్‌కు అంగీకరించినట్లు టాటా సన్స్‌ మంగళవారం ప్రకటించింది. ఈ కేసులో డొకోమోకు 1.18 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ. 7,900 కోట్లు) పరిహారాన్ని చెల్లించనున్నట్లు తెలిపింది. ‘జూన్‌ 22, 2016న లండన్‌ ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టు(ఎల్‌సీఐఏ) డొకోమోకు అనుకూలంగా ఇచ్చిన ఆదేశాలను పాటించేందుకు మేం అంగీకరిస్తున్నాం. దేశంలో సానుకూల పెట్టుబడి పరిస్థితులు కొనసాగేవిధంగా జాతీయ ప్రయోజనాలను దృష్టిలోపెట్టుకొని దీనికి ఓకే చెప్పాం.

కాంట్రాక్టు నిబంధనలను పక్కాగా పాటించే విషయంలో అంతర్జాతీయంగా టాటా గ్రూప్‌ పేరొందింది. దీనికి అనుగుణంగానే డొకోమోకు అనుకూలంగా ఆర్బిట్రేషన్‌ కోర్టు తీర్పుపై భారత్‌లో లేవనెత్తిన అభ్యంతరాలను వెనక్కితీసుకోవాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది’ అని టాటా సన్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, తమ మధ్య జరిగిన సెటిల్‌మెంట్‌కు అనుమతించడంతోపాటు.. ఈ కేసులో న్యాయపరమైన ప్రక్రియను నిలిపివేయాలని(సస్పెండ్‌) ఢిల్లీ హైకోర్టుకు డొకోమో, టాటా సన్స్‌ విన్నవించాయి. టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీని తొలగించడం... కొత్త చైర్మన్‌గా ఎన్‌.చంద్రశేఖరన్‌ పగ్గాలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఈ వివాదానికి తెరపడుతుండటం గమనార్హం.

చట్టపరమైన చర్యలకు బ్రేక్‌: డొకోమో
‘ఆర్బిట్రేషన్‌ కోర్టు తీర్పు ప్రకారం టాటా సన్స్‌ 1.18 బిలియన్‌ డాలర్లను ఇప్పటికే డిపాజిట్‌ చేసింది. తాజాగా కుదిరిన సెటిల్‌మెంట్‌ మేరకు ఈ మొత్తాన్ని ఇక కోర్టు మాకు చెల్లించేందుకు దోహ దం చేస్తుంది. టాటా టెలిసర్వీసెస్‌లో మా వాటా షేర్లను టాటా సన్స్‌కు బదలీ చేసేందుకు మార్గం సుగమం అవుతుంది’ అని డొకోమో ఒక ప్రకటన లో పేర్కొంది. వివాదాన్ని సంయుక్తంగా భారత్‌లో నే పరిష్కరించుకుంటున్న నేపథ్యంలో... అమెరికా, బ్రిటన్‌లలో టాటాలపై తాము చేపట్టిన చట్టపరమైన చర్యలను సస్పెండ్‌ చేసేందుకు అంగీకరించామని డొకోమో తెలిపింది. తాజా పరిణామాలతో భారత్‌ నుంచి డొకోమో పూర్తిగా వైదొలిగేందుకు లైన్‌ క్లియర్‌ అయింది. కాగా, డొకోమోతో భవిష్యత్తులో మళ్లీ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని టాటా సన్స్‌ పేర్కొంది. మరోపక్క, టాటాసన్స్‌తో కొత్త భాగస్వామ్య ఒప్పందం కింద మళ్లీ తాము భారత్‌లో పెట్టుబడులను పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని డొకోమో కూడా చెప్పడం గమనార్హం.

వివాదం సంగతిదీ...
2009 నవంబర్‌లో టాటా టెలిసర్వీసెస్‌లో జపాన్‌ కంపెనీ ఎన్‌టీసీ డొకోమో 26.5% వాటాను కొనుగోలు చేసింది. టాటాడొకోమో జాయింట్‌ వెంచర్‌(జేవీ)లో భాగస్వామిగా చేరింది. షేరుకి రూ.117 చొప్పున దాదాపు రూ.12,740 కోట్లను టాటా టెలి హోల్డింగ్‌ కంపెనీ అయిన టాటా సన్స్‌కు చెల్లించింది.
అయితే, తాము గనుక ఐదేళ్ల వ్యవధిలోపే ఈ జేవీ నుంచి వైదొలగిన పక్షంలో తాము చెల్లించిన ధరలో కనీసం 50 శాతాన్ని తమకు వెనక్కి ఇవ్వాలని డొకోమో షరతు పెట్టింది. దీనికి టాటా సన్స్‌ కూడా అంగీకరించడంతో ఒప్పందం కుదిరింది.
వ్యాపార ప్రతికూలతలతో డొకోమో 2014లో జేవీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించింది. డీల్‌ మేరకు షేరుకి రూ.58 చొప్పున రూ.7,200 కోట్లు చెల్లించాలని టాటాలను కోరింది.
అయితే, ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం షేరుకి రూ.23.34 చొప్పున మాత్రమే తాము ఇవ్వగలమని టాటా గ్రూప్‌ పేర్కొంది.
దీనిపై డొకోమో అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. టాటాలు డొకోమోకు 1.18 బిలియన్‌ డాలర్లను చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది.
ఆర్బిట్రేషన్‌ కోర్టు ఆదేశాల మేరకు ఆర్‌బీఐ తన విదేశీ మారక చట్టం నుంచి మినహాయింపునివ్వాలని డొకోమో కోరింది. ఈ మినహాయింపు కోసం ఆర్‌బీఐ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. అయితే, ఈ ప్రతిపాదనను కేంద్రం తోసిపుచ్చింది. కాగా, టాటా–డొకోమోకు ఓకే చెబితే చాలా కేసుల్లో ఇలాంటి మినహాయింపులు ఇవ్వాల్సివస్తుందన్న కారణంతోనే ఆర్థిక శాఖ నిరాకరిస్తున్నట్లు సమాచారం. తాజా సెటిల్‌మెంట్‌తో బంతి ఇప్పుడు కేంద్రం కోర్టులోకి చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement