సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు వైద్యం అందని ద్రాక్షలా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు వైద్యుల కొరతతో అలంకారప్రాయంగా మిగిలాయి. వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలను పరిశీలిస్తే సుమారు వంద ఆస్పత్రుల్లో వైద్యులు లేరని తేలింది. జాతీయ ఆరోగ్య మిషన్ మన రాష్ట్రానికి ఏటా రూ.1,100 కోట్ల వరకు నిధులిస్తున్నా కూడా.. ప్రభుత్వం వైద్యులను నియమించడం లేదు. అయితే కార్పొరేటీకరణలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను నియమించడం లేదని తెలిసింది. ఇప్పటికే చిత్తూరు జిల్లా ప్రభుత్వాస్పత్రిని ప్రైవేటుకు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఏలూరు, విజయనగరం, ప్రొద్దుటూరు ఆస్పత్రులను కూడా ప్రైవేటుకు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈవిధంగా ప్రతీ సేవను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న రాష్ట్ర సర్కార్.. ఈ క్రమంలోనే వైద్యుల నియామకంపై తాత్సారం చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై గ్రామీణ పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యుల నియామకానికి ససేమిరా
రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో వేలాది వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో పీజీ డిప్లొమా చదివిన వారు ఉంటే సరిపోతుంది. అదే బోధనాస్పత్రుల్లో అయితే పీజీ వైద్యులు కావాలి. కానీ పీజీ డిప్లొమా చదివిన వారిని రెగ్యులర్‌గా నియమించుకునేందుకు కూడా ప్రభుత్వం వెనుకాడుతోంది. కాంట్రాక్టు పద్ధతికి మొగ్గుచూపుతుండటంతో వైద్యులు వెనుకడుగు వేస్తున్నారు. నేరుగా నియమిస్తామని కొన్నిరోజులు, ఏపీపీఎస్సీకి సూచించామని మరికొన్ని రోజులు చెప్పిన సర్కారు ఇప్పటివరకూ ఒక్క వైద్యుడినీ నియమించలేకపోయింది. పేదలకు వైద్య సేవలు అందించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని, అందుకే కొత్తగా వైద్యుల్ని నియమించడం లేదని వైద్య వర్గాలు మండిపడుతున్నాయి.
ప్రసవానికి నరకయాతన
గ్రామీణ ప్రాంతాల గర్భిణులకు ప్రసవం చేయడం సామాజిక ఆరోగ్య కేంద్రాల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం ప్రసూతి వైద్యురాలు, చిన్నపిల్లల వైద్యులు, మత్తు వైద్యులు ప్రతి కేంద్రంలోనూ ఉండాలి. రాష్ట్రవ్యాప్తంగా 190 సామాజిక ఆరోగ్య కేంద్రాలుంటే వందకుపైగా ఆస్పత్రులు వైద్యుల కొరత ఎదుర్కొంటున్నాయి. శస్త్రచికిత్స అవసరమైతే కాన్పు చేయకుండా ప్రైవేటు ఆస్పత్రులకు పంపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment