సాక్షి, గుంటూరు : గ్రామీణ ప్రాంత ప్రజలకు నిరంతరం అత్యవసర వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో జిల్లాలో 32 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను 24 గంటల ఆసుపత్రులుగా మార్చారు. వీటికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. అయితే వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఈ ఆసుపత్రులకు వెళ్ళాలంటేనే రోగులు భయపడుతున్నారు. ఇక్కడ పనిచేసే వైద్యులు ప్రైవేటు ఆసుపత్రులు నడుపుతూ అక్కడే ఉంటున్నారు. ఎక్స్‌రే, రక్తపరీక్షా కేంద్రాలు పనిచేయని స్థితిలో ఉన్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వచ్చిన రోగులకు నర్సులే ప్రాథమిక వైద్య సేవలు అందించి పెద్దాసుపత్రులకు పంపి చేతులు దులుపుకుంటున్నారు. జనరేటర్ సౌకర్యం లేక, రాత్రి వేళల్లో కరెంటు పోతే కొవ్వొత్తుల వెలుగులో కాన్పులు చేస్తున్నారు. కొన్ని సంఘటనలను పరిశీలించండి..
► ప్రకాశం జిల్లా మార్టురుకు చెందిన మహమ్మద్ బాషా ప్రత్యర్థుల దాడిలో తలపగలడంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. బంధువులు 108వాహనంలో శనివారం రాత్రి 9గంటలకు చిలకలూరిపేటలోని ప్రభుత్వాసుత్రికి తీసుకువచ్చారు. డ్యూటీ డాక్టర్ లేకపోవటంతో సిబ్బంది ప్రాథమిక చికిత్స చేసి ఆయనకు కబురు చేశారు. డ్యూటీ డాక్టర్ 9.40గంటలకు వచ్చి పరిస్థితి తీవ్రంగా ఉందంటూ గుంటూరు ప్రభుత్వాసుపత్రికి రిఫర్ చేసి వెళ్ళిపోయారు.
► చిలకలూరిపేట వడ్డెరపాలెంకు చెందిన మల్లెల వెంకటేశ్వర్లు(42) ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య మల్లెల కుమారి బంధువుల ట్రాలీ ఆటోలో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పట్టించుకొనేవారు లేకపోవటంతో రాత్రి 11 గంటల వరకు మృతదేహం ఆటోలోనే ఉంది.
► కొల్లిపరలో స్టాఫ్‌నర్సు, స్వీపర్ మినహా ఒక్కరూ కూడా ఆసుపత్రిలో లేరు. ఆసుపత్రి పొలాల్లో ఉండటం, రోగులు ఎవరూ లేక ఇద్దరు మహిళలూ బిక్కుబిక్కుమంటూ కూర్చోవాల్సిన దుస్థితి.
► మాచర్ల, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల ఆసుపత్రుల్లో సైతం రాత్రి వేళల్లో వైద్యులు అందుబాటులో లేరు. గుంటూరు నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో రాత్రి వేళ రోగులు ఆసుపత్రులకు వెళ్ళడమే మానుకున్నారు. ఇంత అధ్వానంగా ఉన్నా వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు మాత్రం చూసీచూడనట్లు మిన్నకుంటున్నారు.
► గురజాల మండలం మాడుగులలోని ఆసుపత్రి రాత్రి 9 గంటలకు తాళాలు వేసి కనిపించింది.
వైద్యులు మాయం
Published Mon, Sep 14 2015 2:51 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement