వైద్యం... చోద్యం!
గుంటూరు మెడికల్ : జిల్లావ్యాప్తంగా 77 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), 680 ఉప ఆరోగ్య కేంద్రాలు, 17 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటలు వైద్యసేవలు అందించే ఆరోగ్య కేంద్రాలు 32 ఉన్నాయి. ప్రభుత్వం ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు 177 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను మంజూరు చేయగా 43 ఖాళీలు ఉన్నాయి. పుష్కరకాలంగా వైద్యుల పోస్టులు భర్తీ కాక, ఉన్న వైద్యులు పని భారంతో అల్లాడిపోతున్నారు. స్పెషాలిటీ వైద్యుల పోస్టులను ఆరు కేటాయించగా కేవలం ఒక్క వైద్యుడు మాత్రమే పనిచేస్తున్నారు.
కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులు 21 ఖాళీగా ఉన్నాయి. ఆస్పత్రికి వచ్చే రోగులకు మందులు ఇచ్చేందుకు ఫార్మసిస్టులు కూడా లేని ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయంటే ఎలాంటి దుస్థితి నెలకొని ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫార్మసిస్టులు 88 పోస్టులకు 52 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. రక్తపరీక్షలు చేసి జ్వరం ఉందా లేదా అని నిర్ధారించి చెప్పేందుకు ల్యాబ్ టెక్నిషియన్‌లు కూడా లేకపోవటంతో గ్రామీణు రోగులకు కష్టాలు తప్పటం లేదు. 35 ల్యాబ్ టె క్నిషియన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఖాళీగా ఏఎన్‌ఎం పోస్టులు ...
గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఆరోగ్య కార్యక్రమాల గురించి వివరించి రోగాల బారిన పడకుండా అవగాహన కల్పించటంలో కీలకమైన ఏఎన్‌ఎం పోస్టులు కూడా అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం 679 పోస్టులు కేటాయించగా 126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన 553 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఏళ్లతరబడి చాలీచాలని జీతంతో నెట్టుకొస్తున్నారు. మల్టీపర్పస్‌హెల్త్ వర్కర్ పోస్టులు 447 ఖాళీగా ఉండగా, 200 మంది కాంట్రాక్ట్ పద్ధతిన పని చేస్తున్నారు. నాల్గవ తరగతి ఉద్యోగుల పోస్టులు 133, డ్రైవర్ పోస్టులు 18, అసిస్టెంట్ పారామెడికల్ ఆఫీసర్ పోస్టులు 39 ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా వివిధ కేడర్లకు చెందిన 3,677 పోస్టులను ప్రభుత్వం కేటాయించగా 947 ఖాళీగా ఉన్నాయి.
సమయపాలన పాటించరు...
పని చేసే చోటే నివాసం ఉండాలనే నిబంధనను ఏ ఒక్కరూ పాటించడం లేదు. ఉదయం 10 గంటలకు రావాల్సిన వైద్యులు, సిబ్బంది మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఆసుపత్రులకు చేరుకోవడం లేదు. తిరిగి 2 గంటలకు ఇళ్లకు పయనమవుతు న్నారు. దీంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు నర్సులు, ఆయాలే వైద్య చికిత్సలు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండటం లేదు. 24 గంటలు వైద్యసేవలు అందించే ఆరోగ్య కేంద్రాల్లో రాత్రి వేళల్లో వైద్యం అంతంత మాత్రంగానే ఉంది. పారిశుద్ధ్యం చెప్పకోతగిన రీతిలో ఉండటం లేదు. మూత్రశాలలు రోగులు వినియోగించేందుకు ఏ మాత్రం అనుకూలంగా లేవు. ఇప్పటికైనా జిల్లా అధికారులు సమ స్యలపై స్పందించి నాణ్యమైన వైద్యసేవలు అందించేలా కృషి చేయాలని రోగులు కోరుతున్నారు.