
వైద్యమో.. రామచంద్రా!
ఆరోగ్యం మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉంటేనే.. మనం ఏ పనైనా చేయగలం. ఎక్కడికైనా వెళ్లగలం. ప్రస్తుత పరిస్థితిలో చిన్నపాటి రోగమొచ్చినా.. రూ.వేలకు వేలు ఖర్చయిపోతున్నాయి. ప్రైవేట్ ఆస్పత్రులు అంటారా.. రోగం చిన్నదైనా... రోగి భయాన్ని ‘సొమ్ము’ చేసుకుని, ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు.
అంత మొత్తం భరించడం.. పేదలకు తలకు మించిన భారమే. మరి.. సర్కారు దవాఖానాలు లేవా? అంటే.. ఎందుకు లేవు.. మున్సిపాలిటీల పరిధిలో బోలెడు ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అయితే.. అందులో సేవలే అందనంటున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం.. వైద్య సిబ్బంది అలసత్వం వెరసి పేద రోగుల పాలిట శాపంగా మారుతోంది.
బొబ్బిలి, న్యూస్‌లైన్ : పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది.
బొబ్బిలిలోని సంఘవీధిలో ఒకటి, గొల్లపల్లి గ్రామంలో ఒకటి చొప్పున పట్టణ ఆరోగ్యకేంద్రాలున్నాయి. ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ ఇక్కడ రోగులకు పరీక్షలు జరిపి మందులను ఇస్తారు. ఆ తరువాత ఇక్కడ పనిచేసే ఉద్యోగుల విధులన్నీ క్షేత్ర స్థాయిలోనే.ఈ రెండింటి పరిధిలోని 21 వార్డుల్లో 40 మురికివాడల్లోని 36 వేల మంది ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
ఈ ఆరోగ్య కేంద్రాలన్నీ జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి పరిధిలో పనిచేస్తున్నాయి. ఒక్కొక్క ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారితో పాటు కమ్యూనిటీ ఆర్గనైజరు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, మెడికల్ అసిస్టెంటు, నైట్‌వాచ్‌మన్, స్వీపరులు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం వేళ రెండు గంటలు మాత్రమే వైద్య పరీక్షలు ఆస్పత్రుల్లో చేయడం వల్ల 20 మంది కంటే ఎక్కువ వచ్చిన పరిస్థితి లేదు. పది గంటల తరువాత ఏదైనా అత్యవసరమైతే ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లిపోవడమే.
బెలగాం, న్యూస్‌లైన్: మున్సిపాలిటీ పరిధిలో ఏరియా ఆస్పత్రి, అర్బన్ హెల్త్ సెంటర్ ఉన్నాయి.పార్వతీపురం ఏరియా ఆస్పత్రి అభివృద్ధి కలగానే మిగిలిపోయింది. ఇక్కడ ప్రతి రోజూ సుమారు 500 మంది వరకూ ఓపీ విభాగానికి వస్తారు. 100 నుంచి 150 మంది వరకూ ఇన్‌పేషెంట్స్ చికిత్స పొందుతారు. ఆస్పత్రిలో సౌకర్యాలు మాత్రం శూన్యమే. వంద పడకల నుంచి 200 పడకలకు ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్న హామీ నేటికీ అమలు కాలేదు. వెద్యులున్నా.. శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాల కొరత ఉంది. ఇక జగన్నాథపురంలో ఉన్న అర్బన్ హెల్త్‌సెంటర్‌లోనూ సౌకర్యాలు కరువే.
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: మున్సిపాలిటీ పరిధిలో నాలుగు పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. బీసీ కాలనీ, రాజీవ్‌నగర్ కాలనీ, పూల్‌బాగ్ కాలనీ, లంకాపట్నంలలో ఇవి ఉన్నాయి. వీటిలో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. సిబ్బంది కూడా అందుబాటులో ఉండరన్న ఆరోపణలు ఉన్నాయి. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు.ఒక్కో కేంద్రంలో ఎనిమిది మంది చొప్పన పని చేస్తున్నారు.
పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో వీటిని ఏర్పాటు చేశారు. అయితే వీటి బలోపేతానికి మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. వీటిలో మందులు కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో సరఫరా చేయడం లేదు దీంతో రోగులు ప్రైవేట్ మందులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఉదయం 9 గంటల నుంచి మధ్నాహ్నం 2 గంటల వరకూ ఓపీ నిర్వహించాలి. కాని మధ్యాహ్నం 12 గంటలకే ఓపీ మూసేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక కేంద్రాస్పత్రిలోనూ సేవలు అంతంత మాత్రమే...