సాక్షి, కరీంనగర్ : పట్టణ ఆరోగ్యకేంద్రాలకు మహర్దశ పట్టనుంది. ఏళ్లనుంచి స్వచ్ఛంద సంస్థల చేతిలో కొనసాగుతూ లక్ష్యానికి ఆమడదూరంలో ఉన్న ఈ కేంద్రాలను జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ (ఎన్‌యూహెచ్‌ఎం) కిందకు చేర్చి మెరుగైన వైద్యం అందించనున్నారు. నిర్వహణను ఆయా మున్సిపాలిటీలకే అప్పగించనున్నారు.పట్టణ ప్రజలకు వైద్యసేవలందించేందుకు 2000లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేం ద్రాలు లక్ష్యం చేరలేదు. గోదావరిఖనిలో ఆరు, కరీంనగర్, జగిత్యాలలో మూడు, సిరిసిల్లలో రెండు, కోరుట్ల, మెట్‌పల్లిలో ఒక్కొక్కటి చొప్పున జిల్లాలో మొత్తం 16 అర్బన్ హెల్త్‌సెంటర్లు కొనసాగుతున్నాయి. వీటి నిర్వహణను ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది.
ఒక్కో కేంద్రంలో ఓ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, స్వీపర్, నైట్‌వాచ్‌మన్, ఇద్దరు ఏఎన్‌ఎంలను నియమించుకోవాలని సూచించింది. అవసరమయ్యే మందులు ప్రభుత్వమే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఆయా కేంద్రాలకు సరఫరా చేస్తుంది. ఒక్కో కేంద్రం నిర్వహణ కోసం ప్రతినెల రూ.66,700 కేటాయిస్తుంది. ఎన్జీవోలు ఒక్కొక్కరికి ఒక్కోలా వేతనాలు చెల్లిస్తున్నారు.
కొన్ని చోట్ల కనీసం సమయానికి కూడా తెరుచుకోవడం లేదు. ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అర్బన్ హెల్త్ సెంటర్లు సాధించిన ప్రగతిని తెలుసుకుంటూ లక్ష్యాలు సాధించని నిర్వాహకుల నుంచి కేంద్రాలు స్వాధీనం చేసుకుని నిర్వహణను సమీప కేంద్రాలు, వైద్యారోగ్యశాఖకు అప్పగిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో మెట్‌పల్లి, గోదావరిఖని లోని అల్లూరు, జగిత్యాలలో ఓ కేంద్రాన్ని రద్దు చేసి.. వాటి నిర్వహణను వైద్యశాఖకు అప్పగించింది. మరోపక్క.. స్వీపర్లు, వాచ్‌మెన్లు, అవసరం మేరకు వైద్య సిబ్బందిని నియమించక ప్రభుత్వ నిధులు కాజేస్తున్న సంఘటనలు పలు కేంద్రాల్లో చోటు చేసుకున్నాయి. ఇవి అధికారుల దృష్టికి రావడంతో నిధులు ఆపేశారు.
మెరుగైన వైద్యం
పట్టణాలు, నగరాల్లోనూ మెరుగైన సేవల కోసం కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అర్బన్‌హెల్త్‌సెంటర్ల నిర్వహణను స్వచ్ఛంద సంస్థల నుంచి తప్పించి ఎన్‌యూహెచ్‌ం కిందను తీసుకువచ్చి మున్సిపాలటీలకే అప్పగించాలని నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దీటుగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేవలందించనున్నారు. ఇప్పటివరకు 15 వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం మంజూరు చేసిన ప్రభుత్వం త్వరలో 50 వేల జనాభాకు ఒక కేంద్రం కేటాయించనున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అర్బన్‌హెల్త్ సెంటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటి వరకు కేంద్రానికి ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉండగా ఇకపై కనీసం ముగ్గురు వైద్యులుండేలా చర్యలు తీసుకుంటోంది. అదనంగా ముగ్గురు ఏఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ సూపర్‌వైజర్‌తోపాటు జిల్లాకో నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. అద్దె భవనాల్లో కొనసాగుతోన్న కోరుట్ల, మెట్‌పల్లి, ఫైవింక్లయిన్‌కాలనీ, కట్టరాంపూర్ కేంద్రాలకు సొంత భవనాలు రానున్నాయి. ఇప్పటి కే రాష్ట్ర వైద్యాధికారులు మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులకు హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. కావాల్సిన వసతులపై అధికారులు కసరత్తు పూర్తి చేసి తాజాగా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు.
అర్బన్ హెల్త్‌సెంటర్లకు హంగులు
Published Mon, Aug 4 2014 2:30 AM | Last Updated on Thu, May 24 2018 1:33 PM
Advertisement