National Urban Health Mission
-
ఇక స్మార్ట్ వైద్యం!
వేళకు తెరుచుకోని వైద్యకేంద్రాలు.. తెరుచుకున్నా కనిపించని వైద్యులు.. వైదులున్నా ఉండని మందులు.. ఇదీ స్మార్ట్‌సిటీ జాబితాలో పేరున్న గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి. కొన్ని ఆరోగ్యకేంద్రాలు శిథిలావస్థకుచేరుకొని వర్షానికి ఎప్పుడు కుప్పకూలుతాయో తెలియని దుస్థితి. వానొస్తే కారేవి కొన్ని.. విద్యుత్‌లేనివి మరెన్నో.. రోడ్డు ప్రమాదంలో గాయపడితే కనీసం కాలుకు కట్టుకట్టలేని దుస్థితిలో కొన్ని కేంద్రాలుంటే.. సూది మందిచ్చే నర్సుల్లేనివి మరికొన్ని. ఈ పరిస్థితిని చక్కదిద్ది వైద్యరంగంంలోనూ ప్రజలకు స్మార్ట్‌సేవలందించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమవుతోంది. - సాక్షి,సిటీబ్యూరో నేషనల్ అర్బన్ హెల్త్‌మిషన్ (ఎన్యూహెచ్ఎం) ఈ ఆర్థిక సంవత్సరానికి 145 అర్బన్ ప్రైమరీ హెల్త్సెంటర్లను (యూపీహెచ్‌సీలు) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో, వాటిల్లో స్మార్ట్ సేవలు అందించేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. తొలుత కొన్ని యూపీహెచ్సీల నిర్వహణను వైద్యరంగంలో నాణ్యమైన సేవలందించే ఏజెన్సీలకు ప్రయోగాత్మకంగా అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అంటే కార్పొరేట్ ఆస్పత్రుల వంటి వాటికే వీటి నిర్వహణను అప్పజె ప్పుతారు. దీంతోపాటు, స్మార్ట్‌సేవల్లో భాగంగా వైద్యసిబ్బందికి ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. వైద్యకేంద్రాల పనితీరు మెరుగుపరచేందుకు సిటీహెల్త్ సొసైటీని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం పనివేళల్ని రాత్రి వరకు పొడిగించనున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతమున్న 112 అర్బన్ యూపీహెచ్‌సీలు త్వరలో 145కు పెరగనున్నాయి. అంతేకాదు.. అవన్నీ ఇక జీహెచ్ఎంసీ అజమాయిషీలోకి రానున్నాయి. వైద్యసేవల్ని మరింత విస్తృతపరిచేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి ఎన్యూహెచ్ఎం మొత్తం 145 యూపీహెచ్‌సీలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో ఇప్పటికే 112 యూపీహెచ్‌సీలు ఉన్నందున మిగతా 33 కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ చైర్మన్‌గా ఉండే సిటీ హెల్త్ సొసైటీలో సంబంధిత శాఖల అధికారులు, వైద్యరంగంలోని ప్రముఖులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. యూపీహెచ్సీల పనితీరులో మార్పులు తెచ్చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు. ఒకే గొడుగు కిందకు.. వైద్యసదుపాయాల కల్పనకు సంబంధించి నగరంలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ, ఆరోగ్యశాఖ, డీఎంఓహెచ్, జిల్లా మలేరియా విభాగం.. తదితర విభాగాలు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. వీటిమధ్య సమన్వయం లేదు. దీంతో అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తేనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. నగరానికి అదనపు యూపీహెచ్‌సీలు మంజూరైన సందర్భాన్ని పురస్కరించుకొని, వాటిల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు బుధవారం జీహెచ్ఎంసీలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో నేషనల్ హెల్త్‌మిషన్ డెరైక్టర్ బుద్ధజ్యోతిప్రసాద్, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, వివిధ కన్సల్టెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఈ ఆర్థికసంవత్సరం 145 సెంటర్ల నిర్వహణకు రూ. రూ. 64.54కోట్లు అందజేయనుందని తెలిపారు. ఇంకా నగరంలోనూ 6 మొబైల్ వాహనాలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. వైద్యసిబ్బందికీ ట్యాబ్‌లు.. నగరంలోని 1149 మంది ఆశ వర్కర్లు, 699 మంది ఏఎన్ఎంల సేవల్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వారికి, ఇతర వైద్యసిబ్బందికి కూడా ప్రత్యేక ట్యాబ్‌లను అందజేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సర్వేలు, రోగుల వివరాలు, స్థానిక పరిస్థితులు, తదితర అంశాలను ట్యాబ్‌ల్లో పొందుపరుస్తారన్నారు. -
మున్సిపాలిటీల్లో మురికివాడలే అధికం
32.18 శాతం మందికి సురక్షిత మంచినీరూ లేదు సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో మురికివాడల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆయా ప్రాంతాల నుంచి పన్నులు సరిగా రావనే భావనతో వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కొన్ని మున్సిపాలిటీల్లో సాధారణ ప్రజలకంటే మురికివాడల్లో నివసిస్తున్న వారే ఎక్కువగా ఉండటం విశేషం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ పట్టణాభివృద్ధి పథకాలు నామమాత్రంగానైనా మురికివాడవాసులకు ఉపయోగపడడం లేదనే విషయం దీన్ని బట్టి స్పష్టమవుతోంది. వందలాది స్వచ్ఛంద సంస్థలు, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ వంటి కార్యక్రమాలు మురికివాడ వాసులకు కనీస వసతులు కల్పించలేకపోయాయి. దేశంలోనే రెండో స్థానం: దేశంలోని మురికివాడల జనాభాలో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంది. దేశంలోని మురికివాడల జనాభాలో 15.6 శాతం మంది జనాభా 13 జిల్లాల్లోనే ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. 111 మున్సిపాలిటీల్లో మురికివాడవాసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. వీధి దీపాలూ కరువే: పట్టణ స్థానిక సంస్థల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. మెజారిటీ మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు సకాలంలో నిధులు ఇవ్వకపోవడం, ఇచ్చినవాటిని సకాలంలో ఖర్చుచేయకపోవడం వంటి కారణంగా వీధి దీపాలు కూడా లేని పరిస్థితి కొనసాగుతోంది. కొన్ని చోట్ల వారానికోసారి కూడా మంచినీరు లభించ డం లేదు. పట్టణ స్థానిక సంస్థల్లో మురికివాడ వాసుల సంఖ్యే అధికంగా ఉంది. -
అర్బన్ హెల్త్‌సెంటర్లకు హంగులు
సాక్షి, కరీంనగర్ : పట్టణ ఆరోగ్యకేంద్రాలకు మహర్దశ పట్టనుంది. ఏళ్లనుంచి స్వచ్ఛంద సంస్థల చేతిలో కొనసాగుతూ లక్ష్యానికి ఆమడదూరంలో ఉన్న ఈ కేంద్రాలను జాతీయ పట్టణ ఆరోగ్యమిషన్ (ఎన్యూహెచ్ఎం) కిందకు చేర్చి మెరుగైన వైద్యం అందించనున్నారు. నిర్వహణను ఆయా మున్సిపాలిటీలకే అప్పగించనున్నారు.పట్టణ ప్రజలకు వైద్యసేవలందించేందుకు 2000లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పట్టణ ఆరోగ్య కేం ద్రాలు లక్ష్యం చేరలేదు. గోదావరిఖనిలో ఆరు, కరీంనగర్, జగిత్యాలలో మూడు, సిరిసిల్లలో రెండు, కోరుట్ల, మెట్పల్లిలో ఒక్కొక్కటి చొప్పున జిల్లాలో మొత్తం 16 అర్బన్ హెల్త్సెంటర్లు కొనసాగుతున్నాయి. వీటి నిర్వహణను ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. ఒక్కో కేంద్రంలో ఓ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, స్వీపర్, నైట్‌వాచ్‌మన్, ఇద్దరు ఏఎన్ఎంలను నియమించుకోవాలని సూచించింది. అవసరమయ్యే మందులు ప్రభుత్వమే సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి ఆయా కేంద్రాలకు సరఫరా చేస్తుంది. ఒక్కో కేంద్రం నిర్వహణ కోసం ప్రతినెల రూ.66,700 కేటాయిస్తుంది. ఎన్జీవోలు ఒక్కొక్కరికి ఒక్కోలా వేతనాలు చెల్లిస్తున్నారు. కొన్ని చోట్ల కనీసం సమయానికి కూడా తెరుచుకోవడం లేదు. ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో అర్బన్ హెల్త్ సెంటర్లు సాధించిన ప్రగతిని తెలుసుకుంటూ లక్ష్యాలు సాధించని నిర్వాహకుల నుంచి కేంద్రాలు స్వాధీనం చేసుకుని నిర్వహణను సమీప కేంద్రాలు, వైద్యారోగ్యశాఖకు అప్పగిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో మెట్పల్లి, గోదావరిఖని లోని అల్లూరు, జగిత్యాలలో ఓ కేంద్రాన్ని రద్దు చేసి.. వాటి నిర్వహణను వైద్యశాఖకు అప్పగించింది. మరోపక్క.. స్వీపర్లు, వాచ్మెన్లు, అవసరం మేరకు వైద్య సిబ్బందిని నియమించక ప్రభుత్వ నిధులు కాజేస్తున్న సంఘటనలు పలు కేంద్రాల్లో చోటు చేసుకున్నాయి. ఇవి అధికారుల దృష్టికి రావడంతో నిధులు ఆపేశారు. మెరుగైన వైద్యం పట్టణాలు, నగరాల్లోనూ మెరుగైన సేవల కోసం కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అర్బన్హెల్త్సెంటర్ల నిర్వహణను స్వచ్ఛంద సంస్థల నుంచి తప్పించి ఎన్యూహెచ్ం కిందను తీసుకువచ్చి మున్సిపాలటీలకే అప్పగించాలని నిర్ణయించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దీటుగా పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సేవలందించనున్నారు. ఇప్పటివరకు 15 వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం మంజూరు చేసిన ప్రభుత్వం త్వరలో 50 వేల జనాభాకు ఒక కేంద్రం కేటాయించనున్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అర్బన్‌హెల్త్ సెంటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కేంద్రానికి ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉండగా ఇకపై కనీసం ముగ్గురు వైద్యులుండేలా చర్యలు తీసుకుంటోంది. అదనంగా ముగ్గురు ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్, హెల్త్ సూపర్‌వైజర్‌తోపాటు జిల్లాకో నోడల్ అధికారిని నియమించాలని కేంద్రం నిర్ణయించింది. అద్దె భవనాల్లో కొనసాగుతోన్న కోరుట్ల, మెట్పల్లి, ఫైవింక్లయిన్కాలనీ, కట్టరాంపూర్ కేంద్రాలకు సొంత భవనాలు రానున్నాయి. ఇప్పటి కే రాష్ట్ర వైద్యాధికారులు మున్సిపల్ కమిషనర్లు, వైద్యాధికారులకు హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించారు. కావాల్సిన వసతులపై అధికారులు కసరత్తు పూర్తి చేసి తాజాగా ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు.