ఇక స్మార్ట్ వైద్యం! | The Smart healing! | Sakshi
Sakshi News home page

ఇక స్మార్ట్ వైద్యం!

Published Thu, Sep 17 2015 3:29 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

ఇక స్మార్ట్ వైద్యం! - Sakshi

ఇక స్మార్ట్ వైద్యం!

వేళకు తెరుచుకోని వైద్యకేంద్రాలు.. తెరుచుకున్నా  కనిపించని వైద్యులు.. వైదులున్నా ఉండని మందులు.. ఇదీ స్మార్ట్‌సిటీ జాబితాలో పేరున్న గ్రేటర్ హైదరాబాద్ పరిస్థితి. కొన్ని  ఆరోగ్యకేంద్రాలు శిథిలావస్థకుచేరుకొని వర్షానికి ఎప్పుడు కుప్పకూలుతాయో తెలియని దుస్థితి. వానొస్తే కారేవి కొన్ని.. విద్యుత్‌లేనివి మరెన్నో.. రోడ్డు ప్రమాదంలో గాయపడితే కనీసం కాలుకు కట్టుకట్టలేని దుస్థితిలో కొన్ని కేంద్రాలుంటే..  సూది మందిచ్చే నర్సుల్లేనివి మరికొన్ని.  ఈ పరిస్థితిని చక్కదిద్ది  వైద్యరంగంంలోనూ ప్రజలకు స్మార్ట్‌సేవలందించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది.
- సాక్షి,సిటీబ్యూరో
 
 నేషనల్ అర్బన్ హెల్త్‌మిషన్ (ఎన్‌యూహెచ్‌ఎం)  ఈ ఆర్థిక సంవత్సరానికి 145 అర్బన్ ప్రైమరీ హెల్త్‌సెంటర్లను (యూపీహెచ్‌సీలు) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో, వాటిల్లో స్మార్ట్ సేవలు అందించేందుకు జీహెచ్‌ఎంసీ సిద్ధమైంది.  తొలుత కొన్ని యూపీహెచ్‌సీల నిర్వహణను  వైద్యరంగంలో నాణ్యమైన సేవలందించే ఏజెన్సీలకు ప్రయోగాత్మకంగా  అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అంటే కార్పొరేట్ ఆస్పత్రుల వంటి వాటికే వీటి నిర్వహణను అప్పజె ప్పుతారు. దీంతోపాటు, స్మార్ట్‌సేవల్లో భాగంగా వైద్యసిబ్బందికి ట్యాబ్‌లు ఇవ్వనున్నారు. వైద్యకేంద్రాల పనితీరు మెరుగుపరచేందుకు సిటీహెల్త్ సొసైటీని ఏర్పాటు చేయనున్నారు. కేంద్రం పనివేళల్ని రాత్రి వరకు పొడిగించనున్నారు.

 జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతమున్న 112 అర్బన్ యూపీహెచ్‌సీలు త్వరలో 145కు పెరగనున్నాయి. అంతేకాదు.. అవన్నీ ఇక జీహెచ్‌ఎంసీ అజమాయిషీలోకి రానున్నాయి.  వైద్యసేవల్ని మరింత విస్తృతపరిచేందుకు ఈ ఆర్థిక సంవత్సరానికి ఎన్‌యూహెచ్‌ఎం  మొత్తం 145 యూపీహెచ్‌సీలను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరంలో ఇప్పటికే 112 యూపీహెచ్‌సీలు  ఉన్నందున మిగతా 33 కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నారు.  జీహెచ్‌ఎంసీ కమిషనర్ చైర్మన్‌గా ఉండే  సిటీ హెల్త్ సొసైటీలో సంబంధిత శాఖల అధికారులు, వైద్యరంగంలోని ప్రముఖులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. యూపీహెచ్‌సీల పనితీరులో మార్పులు తెచ్చేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారు.

 ఒకే గొడుగు కిందకు..
 వైద్యసదుపాయాల కల్పనకు సంబంధించి నగరంలో ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ, ఆరోగ్యశాఖ, డీఎంఓహెచ్, జిల్లా మలేరియా విభాగం.. తదితర విభాగాలు వేర్వేరుగా పనిచేస్తున్నాయి. వీటిమధ్య సమన్వయం లేదు. దీంతో అన్ని విభాగాలను ఒకే గొడుగు కిందకు తేనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. నగరానికి అదనపు యూపీహెచ్‌సీలు మంజూరైన సందర్భాన్ని పురస్కరించుకొని, వాటిల్లో చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు బుధవారం జీహెచ్‌ఎంసీలో సమావేశం నిర్వహించారు.

సమావేశంలో నేషనల్ హెల్త్‌మిషన్ డెరైక్టర్ బుద్ధజ్యోతిప్రసాద్, జీహెచ్‌ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, వివిధ కన్సల్టెన్సీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఈ ఆర్థికసంవత్సరం 145 సెంటర్ల నిర్వహణకు రూ. రూ. 64.54కోట్లు అందజేయనుందని తెలిపారు. ఇంకా నగరంలోనూ 6 మొబైల్ వాహనాలను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.

 వైద్యసిబ్బందికీ ట్యాబ్‌లు..
 నగరంలోని 1149 మంది ఆశ వర్కర్లు, 699 మంది ఏఎన్‌ఎంల సేవల్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వారికి, ఇతర వైద్యసిబ్బందికి కూడా ప్రత్యేక ట్యాబ్‌లను అందజేస్తామన్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన సర్వేలు, రోగుల వివరాలు, స్థానిక పరిస్థితులు, తదితర అంశాలను ట్యాబ్‌ల్లో పొందుపరుస్తారన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement