పేరులోనే దవాఖానా!
► ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉండని మందులు
► గత్యంతరం లేక ప్రైవేటు మెడికల్ షాపుల్లో కొంటున్న రోగులు
రాష్ట్రంలో ఆరోగ్య ఉప కేంద్రాలు 4,797
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 683
కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు 119
జిల్లా ఆసుపత్రులు 7
సాక్షి, హైదరాబాద్: అరకొర వైద్యం, అలసత్వాన్ని వీడని సిబ్బంది, అందుబాటులో ఉండని మందులు... వీటన్నింటికీ చిరునామా మన ప్రభుత్వాసుపత్రులు. రాష్ట్రంలో దాదాపు ఎక్కువ శాతం వైద్యశాలల పరిస్థితి ఇదే. రోగం వచ్చి ఆసుపత్రికి వెళితే.. సిబ్బంది ఉండరు. ఉన్నా.. వైద్యుడు రాసిన మందు గోలీలు అక్కడ ఉండవు. ఇదేంటని అడిగితే బయట తెచ్చుకోండి.. ఇక్కడలేవు అంటూ సమాధానమే వస్తోంది. వేల రూపాయలు పోసి మెడికల్ దుకాణాల్లో కొనలేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కారణంగానే వర్షాకాలంలో మందులను అందుబాటులో ఉంచాల్సిన టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ వాటిని సరిగా పంపిణీ చేయడం లేదనే ఆరోపణలున్నాయి.
మందుల సరఫరా ఏదీ...
వర్షాకాలం మొదలవడంతో దోమల వ్యాప్తి వల్ల ఎక్కువ మంది ప్రజలు మలేరియా జ్వరం బారినపడి ప్రభుత్వాస్పత్రులకు క్యూ కడుతున్నారు. కానీ అక్కడ సరిపడా మందులు దొరకకపోవడంతో బయట కొనుగోలు చేస్తున్నారు. అలాగే కలుషిత నీరు తాగడం వల్ల వాంతులు, వీరేచనాల బారినపడే వారికి అవసరమయ్యే మందులకూ కొరత నెలకొనడంతో రోగులు ప్రైవేటు దుకాణాల్లో మందులు కొనలేక అవస్థలు పడుతున్నారు. ఎప్పటికప్పుడు ఆస్పత్రులవారీగా కొరత ఉన్న సూది మందులు, మాత్రల పంపిణీ కోసం క్షేత్రస్థాయి సిబ్బంది కోరుతున్నా సరఫరా చేసే యంత్రాంగం పట్టించుకోవడంలేదు.
కొరత ఉన్న మందులివీ..
♦ మలేరియా నివారణ, చికిత్సకు ఇచ్చే ప్రిమాక్విన్ (7.5/2.5) ట్యాబ్లెట్లు.
♦ చిన్నారుల్లో జ్వరాన్ని తగ్గించే పారాసిటమాల్ డ్రాప్స్. విరేచనాలతో వచ్చే జ్వరాన్ని తగించే డెక్స్‌ట్రోస్ ఇంజెక్షన్‌కూ ఇదే పరిస్థితి.
♦ పురిటి నొప్పులు అయ్యేందుకు వీలుగా గర్భిణులకు ఇచ్చే ఆక్సిటోసిన్ సూది మందు.
♦ శిశువులకు నెలన్నర, మూడున్నర నెలల వయసులో కచ్చితంగా ఇవ్వాల్సిన పోలియో నివారణ సూది మందు (ఇనాక్టివ్ పోలియో వ్యాక్సిన్). ప్రైవేటు ఆస్పత్రుల్లో దీని ధర రూ. 3 వేలు.
♦ విరేచనాలు తగ్గేందుకు ఇచ్చే జెంటామైసిన్, మెట్రోనిండజోల్ సూది మందులు.
♦ వాంతులను తగ్గించేందుకు సరఫరా చేసే ఒండన్ సెట్రోన్, ప్రొమెతజైన్ సూది మందులు.
♦ కడుపు నొప్పి తీవ్రతను తగ్గించేందుకు ఇచ్చే డైసైక్లోమైన్ హెచ్‌సీఎల్ సూది మందు.
♦ కాలిన గాయాలకు చేసే చికిత్సలో ఉపయోగించే సిల్వర్ సఫ్లాడైజిన్.
సూది మందు లేదట...
ఆత్మహత్య చేసుకునేందుకు నా కొడుకు గడ్డి మందు మింగడంతో ఆస్పత్రికి తీసుకొచ్చినం. కానీ ఆస్పత్రిలో మందులు లేవట. బయట కొంటే ఒక్కో ఇంజెక్షన్‌కు రూ. 200 అయింది. – రాతిపెల్లి సాంబయ్య, బోరు నర్సాపురం, మంగపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా
బయట తెచ్చుకోమన్నారు..
జ్వరం మందులు ఆస్పత్రిలో లేవంటున్నారు. ఇదేంటని అడిగితే బయట తెచ్చుకోవాలని అంటున్నారు. – సిలువేరు మధు, చిప్పాయిగూడ, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా