సర్కారు ఆసుపత్రి.. ప్రైవేటు మందు!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దాసుపత్రుల్లో ప్రైవేట్ మందుల మాఫియా రాజ్యమేలుతోంది. పేద రోగులను పీల్చిపిప్పి చేస్తోంది. ఆసుపత్రిలోని ఉచిత ఫార్మసీలో లేని మందును, ఈ ప్రైవేట్ మెడికల్ షాపుల యజమానులు తెప్పిస్తారు. ఏ మందులు తెప్పించాలో డాక్టర్లు వీరికి చెప్తారు. అదే మందును స్టాక్ పెట్టి రోగులకు అమ్ముతారు. అందులో డాక్టర్ కమీషన్ కనీసం 10 నుంచి 20 శాతం ఉంటుందని అంటున్నారు. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆసుపత్రులైన గాందీ, ఉస్మానియా, పేట్ల బురుజు, అలాగే వరంగల్‌లోని ఎంజీఎం, కరీంనగర్‌లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మందుల షాపులు ఏటా రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి. ఉచిత మందులు ఇవ్వాల్సిన పెద్దాసుపత్రుల్లో బహిరంగంగా ప్రైవేట్ మందుల మాఫియా దోపిడీ కొనసాగుతున్నా, దాన్ని అడ్డుకునే నాథుడే లేకుండా పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి అడ్డుకట్ట వేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. ఆ మందుల దుకాణాలెందుకు? రాష్ట్రంలో కీలకమైన ఈ ఆసుపత్రుల్లో సాధారణ జ్వరం మొదలు... అత్యంత కీలకమైన అవయవ మారి్పడి చికిత్సల వరకు జరుగుతుంటాయి. వీటిల్లో పేదలకు ఉచిత వైద్యం, ఉచిత మందులు ఇవ్వాలనేది లక్ష్యం. అయినా అక్కడ ఉచిత మందుల దుకాణాలున్నా, ప్రైవేట్ మందుల దుకాణాలు ఎందుకు పెట్టారన్నది అంతుబట్టని ప్రశ్న. గాంధీ ఆసుపత్రిలో ఓపీ బ్లాక్‌కు సరిగ్గా ఎదురుగా వరుసగా నాలుగు ప్రైవేట్ మెడికల్ షాపులున్నాయి. ఉస్మానియా ఆసుపత్రిలో ఐదు, నిలోఫర్‌లో రెండు, పేట్లబుర్జు మెటర్నిటీ ఆసుపత్రిలో ఒకటి, కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రెండు ప్రైవేట్ మందుల దుకాణాలు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ మందుల దుకాణాలు ఉండవు.. కానీ దానికి అత్యంత సమీపంలోని మూడు మెడికల్ షాపులు కేన్సర్ మందులను అందుబాటులో ఉంచుతాయి. కొందరు ఆంకాలజిస్టులకైతే నెలకు ఐదారు లక్షల రూపాయల వరకు ఆ దుకాణాల నుంచి కమీషన్ తీసుకుంటున్నారన్న ప్రచారం ఉంది. కొన్ని ఫ్రీగా... కొన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ మెడికల్ దుకాణాలకు డాక్టర్లు, సూపరింటెండెంట్లు, రాష్ట్రస్థాయిలో కీలకమైన అధికారుల అండదండలు పుష్కలంగా ఉంటాయి. వారి అండతోనే ప్రైవేట్ మందుల దుకాణాదారులు రెచ్చిపోతుంటారు. రోగికి వైద్యుడు నాలుగు రకాల మందులు రాస్తే, అందులో ప్రభుత్వ దుకాణంలో రెండే ఉంటాయి. మిగిలిన రెండింటిని ప్రైవేట్ దుకాణంలో కొనాల్సిందే. ఒక్కోసారి మందులున్నా కూడా లేవని ప్రభుత్వ ఫార్మసీ వారు చెబుతారు. అప్పుడు ప్రైవేట్‌లో కొనాల్సిందే. ఇక ఎంఎన్‌జే కేన్సర్ ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందులన్నీ దాదాపు బేసిక్‌వే. అడ్వాన్స్ ట్రీట్మెంట్కు అవసరమైన మందులు ఇవ్వాలంటే ఎంఎన్‌జే ఆసుపత్రిలో దొరకవు. పైగా అవి అత్యంత ఖరీదైనవిగా ఉంటాయి. కొన్ని డోసులైతే రూ.లక్షల్లో ఉంటాయి. సీఎంఆర్ఎఫ్ కింద బిల్లులు పెట్టి ప్రైవేట్ దుకాణాల్లో కొని వాడుతుంటారు. ఎంఎన్‌జే మినహా మిగిలిన ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చే మందులను తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) సరఫరా చేస్తుంది. అయితే చాలామందులు అత్యాధునికమైనవి కాకుండా బేసిక్ మందులనే సరఫరా చేస్తుందన్న ఆరోపణలున్నాయి. ఆయా ప్రైవేట్ దుకాణాలను ఎత్తి వేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగకపోవడంతో రోగులు నష్టపోతున్నారు. కాగా, ప్రైవేట్ దుకాణాలు కోర్టుల్లో స్టేలు తెచ్చుకొని చలామణిలో ఉంటున్నాయని చెబుతున్నారు. రోజుకు జరిగే వ్యాపారం » గాంధీ ఆసుపత్రిలోని ప్రైవేట్ మందుల దుకాణాల్లో రూ. 10 లక్షలు » ఉస్మానియాలో రూ. 12 లక్షలు » ఎంఎన్‌జేపై ఆధారపడిన మూడు ప్రైవేట్ దుకాణాల్లో రూ.15 లక్షలు » ఎంజీఎంలో రూ. 5 లక్షలు