నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల ముసుగులో జరుగుతున్న అవినీతి తుట్టె కదిలింది. కార్పొరేట్ సంస్థలకు రూ.కోట్లు ౖకైంకర్యం అవుతున్న తీరుపై పలువురు ప్రైవేటు వ్యక్తులు కేంద్ర విజిలెన్స్ కమిషన్(సీవీసీ)కు ఫిర్యాదులు చేశారు. స్పందించిన సీవీసీ తాజాగా వీటిపై విచారణకు ఆదేశించింది. రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిధిలో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలను కొద్ది నెలల కిందట ఏర్పాటు చేశారు. మొత్తం మూడు జోన్లుగా విభజించి అపోలో సంస్థకు రెండు జోన్లు, ధనుష్–ఈ వైద్య కన్సార్టియం సంస్థకు ఒక జోన్ కేటాయించారు.
ఒక్కో కేంద్రానికి సగటున నెలకు రూ. 4.08 లక్షలను జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి చెల్లిస్తున్నారు. కానీ వీటి సేవలు సక్రమంగా అందడం లేదు. టెండర్లలో కూడా పలు అవకతవకలు జరిగాయి. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అనుచరుడిగా చెప్పుకుంటున్న ఈ–వైద్య సంస్థ ప్రతినిధి కోసం ఏకంగా మూడు దఫాలు టెండర్లు రద్దు చేసి మళ్లీ నిర్వహించినట్టు అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై కొందరు వ్యక్తులు సీవీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీవీసీ విచారణకు ఆదేశించింది. నెలరోజుల్లోగా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలపై నివేదిక ఇవ్వాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖను ఆదేశించింది.
ఉపరాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆదేశాలు
కేంద్ర విజిలెన్స్ కమిషన్‌తో పాటు ఉప రాష్ట్రపతి కార్యాలయానికి కూడా ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలపై ఫిర్యాదులు వెళ్లాయి. వీటిపై స్పందించిన ఉపరాష్ట్రపతి కార్యాలయం.. ఫిర్యాదుదారులకు ప్రత్యుత్తర సమాచారం పంపింది. అంతేగాకుండా దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment