సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు సరికొత్తగా హెల్త్–వెల్‌నెస్ కేంద్రాలు (హెచ్‌డబ్ల్యూసీలు) అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలను హెల్త్–వెల్‌నెస్ సెంటర్లుగా మార్చనున్నారు.
ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్య లు చేపట్టింది. ఈ కేంద్రాల్లో గ్రామీణ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలతోపాటు రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ కూడా ఉచితంగా అందించనున్నారు. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాల ఆధారంగా.. మెరుగైన వైద్యం అవసరమైన వారిని సమీపంలోని ఏరియా, జిల్లా ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యసేవలు అందిస్తారు.
దశలవారీగా 4,797 కేంద్రాలు..
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు, ఉచితంగా రోగ నిర్ధారణ పరీక్షలు, మందుల పంపిణీ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం హెల్త్–వెల్‌నెస్ కేంద్రాల పథకాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 1.40 లక్షల హెల్త్–వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి హెల్త్–వెల్‌నెస్ సెంటర్ అభివృద్ధికి రూ.ఐదు లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని ఆరోగ్య ఉప కేంద్రాలను హెచ్‌డబ్ల్యూసీలుగా మార్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
రాష్ట్రవ్యాప్తంగా 683 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) ఉండగా.. వాటి పరిధిలో 4,797 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిని దశల వారీగా హెల్త్–వెల్‌నెస్ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నారు. మొదటి దశలో 90 హెల్త్–వెల్‌నెస్ సెంటర్లను ప్రారంభించేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రెండోదశ కింద మరో 500 హెల్త్–వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
స్టాఫ్ నర్సుల ఆధ్వర్యంలో..
హెల్త్–వెల్‌నెస్ కేంద్రాలు ‘మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ ఇన్‌చార్జి (మధ్యస్థాయి ఆరోగ్య సేవల ఇన్‌చార్జి)’గా పనిచేస్తాయి. ప్రస్తుతం స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న వారికి బ్రిడ్జి కోర్సు శిక్షణ ఇప్పించి.. మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్‌గా పదోన్నతి కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం, సంగారెడ్డి జిల్లా ఆస్పత్రులలో బ్రిడ్జి కోర్సు నిర్వహిస్తున్నారు. ఆరు నెలలకు ఒక బ్యాచ్ చొప్పున శిక్షణ పూర్తవుతుంది. మొదటి బ్యాచ్‌లో శిక్షణ పూర్తి చేసిన 26 మందిని కొత్త హెల్త్–వెల్‌నెస్ కేంద్రాల్లో నియమిస్తున్నారు.
ఇక ఈ కేంద్రాల్లో ఏఎన్‌ఎంతోపాటు ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరు చొప్పున ఆశ కార్యకర్త ఉంటారు. వారు ఆయా కేంద్రాల పరిధిలోని ప్రజలు వైద్యసేవల కోసం వచ్చేలా కృషి చేస్తారు. ఈ కేంద్రాల్లో రక్తపోటు, మధుమేహం తదితర ఏడు రకాల సాధారణ వైద్య పరీక్షలను చేస్తారు. వాటి ఫలితాల ఆధారంగా ఉచితంగా మందులు ఇస్తారు. దాంతో పాటు ఈ కేంద్రాలకు వచ్చే రోగుల వివరాలను సేకరించి.. అందరి ఆరోగ్య వివరాల (హెల్త్ ప్రొఫైల్) జాబితాను సిద్ధం చేస్తారు.
ఏ జిల్లాలో ఎన్ని కేంద్రాలు
మొదటిదశలో హైదరాబాద్‌లో 40 కేంద్రాలతోపాటు ఆదిలాబాద్ 6, సిద్దిపేట 5, సిరిసిల్ల 8, వరంగల్ రూరల్ 8, భూపాలపల్లి 8, మహబూబ్‌నగర్ 6, జనగామలో 9 కేంద్రాలు సిద్ధమయ్యాయి.
రెండోదశ హెచ్‌డబ్ల్యూసీలు: మహబూబ్‌నగర్‌లో 10, గద్వాల 9, నాగర్ కర్నూలు 31, వనపర్తి 6, రంగారెడ్డి 6, వికారాబాద్ 8, మేడ్చల్ 8, హైదరాబాద్ 100, మెదక్ 8, సంగారెడ్డి 8, సిద్దిపేట 7, నిజామాబాద్ 32, కామారెడ్డి 12, ఆదిలాబాద్ 26, ఆసిఫాబాద్ 32, మంచిర్యాల 12, నిర్మల్ 10, కరీంనగర్ 16, జగిత్యాల 9, పెద్దపల్లి 10, సిరిసిల్ల 8, వరంగల్ అర్బన్ 9, వరంగల్ రూరల్ 9, భూపాలపల్లి 27, మహబూబాబాద్ 8, జనగామ 11, కొత్తగూడెం 30, ఖమ్మం 12, యాదాద్రి 9, నల్లగొండ 7, సూర్యాపేటలో 10 హెచ్‌డబ్ల్యూసీలు ఏర్పాటు చేస్తారు.
రాజధానిలో ‘బస్తీ దవాఖానా’లు
తొలిదశలో 90 హెల్త్–వెల్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా.. అందులో 40 కేంద్రాలను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఏర్పాటు చేశారు. ‘బస్తీ దవాఖానా’లు అని వీటికి నామకరణం చేశారు. ఇందులో గడ్డి అన్నారం, హష్మా బాద్, బీజేఆర్ నగర్ బస్తీ దవాఖానాలను మంత్రులు కె.తారకరామారావు, సి.లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు శుక్రవారం ప్రారంభించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment