ఆస్పత్రుల్లో కానరాని వైద్య సదుపాయాలు
అవస్థలు పడుతున్న పట్టణ, పల్లె ప్రజలు ..భర్తీకి నోచుకోని వైద్య పోస్టులు.. ఆస్పత్రుల్లో ఉండని వైద్యులు.. వెరసి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం మిథ్యే అవుతోంది. ఏటా ప్రభుత్వాలు లక్షలాది రూపాయలు విడుదల చేస్తున్నా.. పదుల సంఖ్యలో ప్రాణాలు పోతూనే ఉన్నాయి. పీహెచ్‌సీలు.. యూహెచ్‌సీలు.. రౌండ్ ది క్లాక్ ఆస్పత్రులు ఉన్నా ప్రాణాలను నిలబెట్టలేక పోతున్నాయి. వైద్యులు స్థానికంగా అందు బాటులో ఉండి వైద్యం అందించాల్సింది పోయి.. తమకు అనుకూల ప్రదేశాల్లో ఉంటూ రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో రాత్రుల్లో వైద్యం అందని ద్రాక్షలా మారింది. ఫలితంగా రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. జిల్లా ఆస్పత్రులపై ‘సాక్షి’ విజిట్..
ఆరోగ్య కేంద్రాలు అనారోగ్య కేంద్రాలుగా మారుతున్నాయి. రకరకాల శారీరక అవస్థలు, అనారోగ్యాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యం అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉండడం లేదు. చాలా చోట్ల అవసరానికి తగ్గట్టు వైద్యులు లేరు. ఉన్న అరకొర మంది వైద్యులతో అందీ అందని వైద్యమే ప్రజలకు దిక్కవుతోంది. అది కూడా అతి కష్టంమీద. వైద్యులతో పాటు ఇతర సిబ్బంది కొరత కూడా తీవ్రంగా ఉంది. ఏళ్లుగా చాలా పోస్టులు ఖాళీగానే ఉంటున్నాయి. ఇక.. ఆస్పత్రుల్లో సమస్యలు సరే సరి. చాలా చోట్ల కనీస సౌకర్యాలూ కరువై పోతున్నాయి. బెడ్లున్నా పరుపులుండవు. నల్లాలున్నా నీటి సౌకర్యం ఉండదు. మినరల్ వాటర్ ప్లాంట్లు మరమ్మతులకు నోచడంలేదు. ఇతర విలువైన వైద్య పరికరాలు వినియోగంలోకి రాక నిరుపయోగంగా ఉంటున్నాయి. పలుచోట్ల ఆస్పత్రులు శిథిలావస్థలో ఉన్నాయి.మంగళవారం ‘సాక్షి’ జిల్లావ్యాప్తంగా ఆస్పత్రులను విజిట్ చేయగా ఈ విషయాలు వెలుగుచూశాయి.
బేల : ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేల, జైనథ్, అం కోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ‘సాక్షి’ విజిట్ చేయగా రోగులు అంతంతగానే కనిపించారు. బేల(రౌండ్ ది క్లాక్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9 గం టలకు సిబ్బంది ఎవరూ లేరు. 9 గంటల 20 నిమిషాలకు ఓపీ స్టాఫ్‌నర్సు, 10 గంటలకు ఒక మెడికల్ సూపర్‌వైజర్, మరో అరగంట తర్వాత వైద్యాధికారి తో పాటు మిగతా సిబ్బంది ఒక్కొక్కరుగా వచ్చారు. రోగులు సైతం వైద్యం కోసం ఉదయం 10:30 గంటల తర్వాతే వచ్చారు. ఈ ఆరోగ్య కేంద్రంలో నాలుగైదు నెలలుగా చెవిపోటు వైద్యం అందుబాటులో లేదని తెలిసింది. జైనథ్ ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో ఆశ వర్కర్ల సమావేశం ఉండడంతో వైద్యాధికారి, సిబ్బంది సమయానికే వచ్చారు. వచ్చిన రోగులకు, చికిత్సలు నిర్వహిస్తూ కనిపించారు. ఇక్కడ ఏళ్లుగా ఓపీ స్టాఫ్‌నర్సు పోస్టు ఖాళీగా ఉండడంతో, ఈ విధులను ఓపీ ఏఎన్‌ఏం నిర్వహిస్తున్నారు. ఈ పీహెచ్‌సీని రౌండ్ ది క్లాక్‌గా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. అంకోలి(ఆదిలాబాద్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 9.45 గంటలకు వైద్యాధికారి, సిబ్బంది అందుబాటులో ఉన్నారు.
నేరడిగొండ : మండలంలోని 14 గ్రామ పంచాయతీలకు నేరడిగొండలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమే దిక్కు. ఇక్కడ ప్రజలకు వైద్యం అందిస్తున్నా అందులో పనిచేస్తున్న ఇద్దరు వైద్యాధికారుల్లో ఒకరు డిప్యుటేషన్‌పై దిలావర్‌పూర్ మండలం నర్సాపూర్‌కి వెళ్లగా కేంద్రానికి ఒకే వైద్యాధికారి ఉండడంతో ఆయన సెలవుపై వెళ్లినా, గ్రామాల్లో పర్యటించినా ఆ సమయంలో ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. దీంతో రోగులు దిక్కుతోచక ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. రాత్రి సమయాల్లో గర్భిణుల సేవలకు స్థానిక సిబ్బంది మాత్రమే ఉండడంతో వారికి పూర్తిస్థాయిలో వైద్యం అందకుండా పోతోంది. అయితే గర్భిణుల పరిస్థితి కొన్ని సందర్భాల్లో ఆందోళనకరంగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. మండల ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్యం అందాలంటే ఆరోగ్యకేంద్రంలో 24 గంటలు సేవలు అందించాలని స్ధానికులు కోరుతున్నారు. ఉన్న ఇద్దరు వైద్యుల్లో ఒకరు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో పూర్తిస్థాయిలో వైద్యం అందడంలేదు. ఉన్నతాధికారులు స్పందించి ఆరోగ్య కేంద్రంలో నిరంతర వైద్యసేవలు అందించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
నిర్మల్ రూరల్ : పట్టణంలోని ప్రసూతి ఆస్పత్రిలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ కొన్ని నెలలుగా నిరుపయోగంగా ఉంటున్నా కనీస మరమ్మతులకు నోచుకోవడంలేదు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులకు మంచినీరు కరువైంది. దీంతో రోగులు ఇంటి నుంచి లేదా స్థానిక దుకాణాల నుంచి మినరల్ వాటర్‌ను కొనుక్కుని తాగాల్సిన పరిస్థితి నెలకొంది. లేదంటే పక్కనే ఉన్న బోరింగ్ నీటినే తాగాల్సిన దుస్థితి ఉందని రోగులు వాపోతున్నారు. కొన్నేళ్ల క్రితం 50 పడకలతో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. నిర్మల్ పరిసర ప్రాంతాలతో పాటు ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల ప్రజలు, నేరడిగొండ మండలం, నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాల నుంచి కూడా ప్రసూతి ఆస్పత్రికి వైద్యం కోసం వస్తుంటారు. రోజుకు సుమారు 200ల మంది వరకు ఔట్ పేషెంట్లు, అధిక సంఖ్యలో ఇన్‌పేషెంట్లు వైద్య సేవల కోసం ఆస్పత్రికి వస్తారు. దీంతో ఆస్పత్రి ఎప్పుడు కిటకిటలాడుతూనే ఉంటుంది. ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉన్నా సౌకర్యాల కల్పనలో మాత్రం సంబంధిత పాలకులు విఫలమవుతున్నారన్న విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. అయినా పాలకుల్లో చలనం కనిపించడం లేదు.
కాగజ్‌నగర్ టౌన్ : కాగజ్‌నగర్ పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సామాన్య, పేద ప్రజలకు సరైన రీతిలో సౌకర్యాలు అందడం లేదు. పీహెచ్‌సీ బిల్డింగ్ శిథిలావస్థకు చేరుకోగా, పీహెచ్‌సీ ఆవరణలో నిర్మించిన సీమాంక్ సెంటర్‌లోనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నడిపించాల్సిన దుస్థితి ఏర్పడింది. మందుల కొరత తీవ్రంగా ఉండటంతో రోగులు అవసరమైన మందులు దొరకక లబోదిబోమంటున్నారు. సీమాంక్ సెంటర్ నిర్వహణకు 11 స్టాఫ్ నర్సుల సేవలు అవసరం కాగా, ఈ సెంటర్‌లో ఒక్క పోస్ట్ కూడా భర్తీకి నోచుకోలేదు. సిబ్బంది, పరికరాలు లేక సీమాంక్ సెంటర్ గర్భిణుల పాలిట శాపంగా మారిందని ఫిర్యాదులున్నాయి. అవసరమైన మందులు లభించక ప్రజలు ప్రైవేట్ మెడికల్స్‌లో మందులు కొనుగోలు చేస్తున్నారు. 10 పడకల ఈ ఆస్పత్రిలో ఎప్పుడూ చూసిన రోగులు లేక బెడ్లు వెలవెలబోతున్నాయి. కిందిస్థాయి సిబ్బంది రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు.