నడిరాత్రిలో నరకమే
{పభుత్వాస్పత్రుల్లో రాత్రి వేళ వైద్య సేవలు నిల్
డ్యూటీలకు రాని వైద్యులు
చాలా చోట్ల నర్సులే డాక్టర్లు
శిథిలావస్థలో భవనాలు, సిబ్బంది క్వార్టర్స్
ప్రభుత్వాస్పత్రుల్లో రాత్రి వేళ రోగులకు కనీస వైద్య సేవలు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా చాలాచోట్ల డాక్టర్లు విధులకు హాజరు కావడం లేదు. కాంట్రాక్టు నర్సులు మాత్రమే నైట్‌డ్యూటీలు నిర్వహిస్తున్నారు. వీరు నామమాత్రంగా ప్రథమ చికిత్స నిర్వహించి పెద్దాస్పత్రులకు కేసులను రెఫర్ చేస్తున్నారు. ఆ సమయంలో అంబులెన్సులు, రవాణా వాహనాలు దొరక్క, దొరికినా వారికి పెద్దమొత్తంలో డబ్బులు చెల్లించలేక రోగులు నరకం అనుభవిస్తున్నారు. జిల్లాలో 24 గంటల ఆస్పత్రుల్లో ఈ పరిస్థితి దాపురించిందని సాక్షి నెట్‌వర్క్ పరిశీలనలో వెల్లడయింది.
తిరుపతి సిటీ:‘‘ సత్యవేడు నియోజక వర్గంలోని పెద్దపాండూరుకు చెందిన చంద్రయ్యతన చెల్లెలికి కాలిపై ఏదో విషపురుగు కుట్టిందని వైద్యం కోసం ఆరోగ్య కేంద్రానికి వచ్చారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్ అందుబాటులో లేరు. చేసేది లేక అక్కడున్న నర్సే టీటీ ఇంజెక్షన్ వేసి, మందులు ఇచ్చి పంపారు. అక్కడ ముగ్గురు డాక్టర్లు వైద్య సేవలు అందిస్తున్న ప్రజలకు మాత్రం కనీస సేవలు దక్కడం లేదు.’’ ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటి పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. ప్రభుత్వాసుపత్రుల్లో 24 గంటలూ రోగులకు మెరుగైన వైద్య సేవలను అందించాల్సిన వైద్యులు, సిబ్బంది రాత్రివేళల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడంలేదు. ఉన్న అరకొర వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించడం లేదు. చాలా ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్సులే రాత్రిళ్లు రోగులకు నామమాత్రంగా సేవలందిస్తున్నారు.
అరకొర సేవలూ గగనమే..
మదనపల్లె నియోజక వర్గంలోని నిమ్మనపల్లి, రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రాత్రి పూట వైద్యులు సేవలందించిన దాఖాలాలే లేవు. పేరుకెమో 24 గంటల పాటు వైద్య సేవలు అని వైద్య ఆరోగ్య శాఖ రికార్డుల్లో వున్నా ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. }M>-âహస్తిలో 24 గంటల పాటు రోగులకు వైద్య సేవలందించాల్సిన, కేవలం వైద్యులు, సిబ్బంది ఎనిమిది గంటలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఏరియా ఆసుపత్రికి వెళ్లే దారిలో వీధిలైట్లు వెలగం లేదు. ఏర్పేడులో 24 గంటల వైద్యసేవలు పూర్తిగా కనుమరుగయ్యాయి. అక్కడ పనిచేసే వైద్యునితోపాటు ఒక నర్సు ఉదయం 10 గంటల కొచ్చి సాయంత్రానికి ఇంటి దారి పడుతున్నారు. పాపానాయుడుపేట, ఏర్పేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది విధులకు రావడంలేదని స్థానికులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రయివేటు ఆస్పత్రులే దిక్కు..
రాత్రిపూట వైద్యం కోసం వచ్చిన రోగులకు వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ప్రయివేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. వరదయ్యపాళెం పాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రి పూట నర్సే ఒక్కరే వైద్య సేవలను అందిస్తున్నారు. డ్యూటీకి రావాల్సిన డాక్టర్ రాత్రిపూట వచ్చిన దాఖలాలైతే ఇంతవరకు లేదని తెలుస్తోంది. పలమనేరు నియోజకవర్గ పరధిలోని బెరైడ్డిపల్లి ప్రభుత్వాసుపత్రిలో రాత్రివేళల్లో నర్సులే డాక్టర్లుగా మారి వైద్య సేవలు అందిస్తున్నారు.
అలవిమాలిన నిర్లక్ష్యం..
పీలేరుతోపాటు ఇతర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రాత్రి పూట వైద్యుల సేవలు పూర్తిగా నిల్. ఏవైనా అత్యవసర కేసులు వస్తే ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేస్తారు. గుర్రంకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రి నుంచి ఉదయం వరకు స్టాఫ్ నర్సు ఒక్కరే విధులను నిర్వహించారు. కేవీ పల్లిలో రాత్రి డాక్టర్ విధులకు రాలేదు. కలకడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రతి రోజు సాయంత్రం 5గంటలకు తాళాలు వేసేస్తే తిరిగి మరుసటి రోజు ఉదయం 10గంటలకే తెరిచేది. పి.కొత్తకోట ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ లేరు. నర్సు మాత్రమే విధులు నిర్వర్తించారు. కార్వేటినగరంలో వుండే ఆసుపత్రిలో రోజుకు మూడు గంటలు కూడా అక్కడున్న డాక్టర్లు, సిబ్బంది వచ్చే రోగులకు సేవలను అందిచండంలేదు. అక్కడున్న క్వార్టర్స్ కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాఫ్ నర్సే డాక్టర్ విధులు నిర్వహించారు. పుంగనూరులో వున్న ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు రాత్రి పూట ఏవరైనా రోగులు వైద్యంకోసం వచ్చి ఫోన్ చేస్తే వచ్చి సేవలందిస్తారు. చౌడేపల్లిలో రాత్రి పూట స్టాఫ్‌నర్సు ఒక్కరే విధులకు వచ్చారు. అమెకు తోడుగా వాచ్‌మెన్ కాపాల డ్యూటీకి వచ్చాడు. పులిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాత్రిళ్లు హెడ్‌నర్సు వైద్య సేవలను అందిస్తున్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గంలోని ఆసుపత్రుల్లో వైద్యులు పూర్తిగా కానరావడంలేదు. అక్కడ పనిచేసే నర్సులు, ఆయాలే రోగులకు దిక్కుగా మారి సేవలను అందిస్తున్నారు.