తప్పుల తడకగా మెరిట్ జాబితా
Published Mon, Oct 17 2016 11:51 PM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM
– వైద్య ఆరోగ్యశాఖలో నిర్లక్ష్యం
– పీహెచ్‌సీ అభ్యర్థుల ఆందోళన
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో కొత్తగా మంజూరైన నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసేందుకు పలు పోస్టులకు అధికారులు వెల్లడించిన మెరిట్ జాబితా తప్పుల తడకగా మారింది. ప్రతి పీహెచ్‌సీలో మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్టు, స్టాఫ్‌నర్సు, ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టులకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. 12 స్టాఫ్‌నర్సు పోస్టులకు 1,406 మంది, నాలుగు ఫార్మాసిస్టు పోస్టులకు 600 మంది, నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 600 మంది, 8 మెడికల్ ఆఫీసర్ పోస్టులకు 100 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థుల దరఖాస్తుల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారులు మెరిట్ జాబితాను తయారు చేసి ఈ నెల 13వ తేదీన వెబ్‌సైట్‌లో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రదర్శించారు. కాగా ఈ మెరిట్ జాబితాపై పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీఎంహెచ్‌వో కార్యాలయ ఏడీ కృష్ణప్రసాద్‌ను వివరణ కోరగా తక్కువ సమయంలో మెరిట్ జాబితాను తయారు చేయడం వల్ల కొన్ని తప్పులు దొర్లి ఉంటాయని, అందుకే మెరిట్ జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్నామన్నారు. అభ్యంతరాల ఆధారంగా జాబితాను మళ్లీ మారుస్తామని తెలిపారు.
తప్పుల తడకగా మెరిట్ జాబితా
1. కర్నూలు నగరానికి చెందిన పి.హుసేన్ కుమార్తె పి.షరీఫా వాస్తవంగా బీసీ–బి అయితే మెరిట్ జాబితాలో ఆమెను బీసీ–డీగా చూపారు. అంతేగాక ఆమెను అతడుగా మార్చేశారు.
2. సీరియల్ నెంబర్ 332లోని బి.బాలరాజు డీఎంఎల్‌టీ చదివి ల్యాబ్‌టెక్నీషియన్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. అతను 2009 జూన్‌లో కోర్సు పూర్తి చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏడేళ్లు పూర్తయ్యింది. కానీ అధికారులు మాత్రం ఆరేళ్లుగా చూపారు.
3. సీరియల్ నెంబర్ 356లోని పుల్లూరు సుధాకర్ ఒకేషనల్‌లో ఎంఎల్‌టీ పూర్తి చేశారు. అతని సరాసరి మార్కులు వెయ్యి కాగా 550కి చూపారు. అది కూడా 550 మార్కులకు అతనికి 560 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు.
4. సీరియల్ నెంబర్ 34 బీఎన్‌ఎస్ గౌరికుమారి బిఎస్సీ ఎంఎల్‌టీ పూర్తి చేశారు. ఆమె సరాసరి మార్కులు 1450 కాగా అధికారులు మాత్రం 1150గా చూపించారు.
Advertisement
Advertisement