విశాఖపట్నం : జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బకు 34మంది మృతి చెందారు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో పదకొం డు మంది చనిపోయారు. అంకుపాలెం గోవిం దమ్మ కాలనీకి చెందిన సమ్మంగి రాములమ్మ (59), చోడవరానికి చెందిన గొటివాడ అప్పలనర్సమ్మ(57), బుచ్చెయ్యపేట మండలం పెదమదీన గ్రామానికి చెందిన ముత్యాల అప్పారావు(50), ఎల్‌బి పురంలో తమనరాన అప్పన్న (53), విజయరామరాజుపేటలో మాజీ సర్పంచ్ బేటి సింహాచలం(65), కె.కోటపాడు మండలం సూర్రెడ్డిపాలెంకు చెందిన బండారు చినమల్లునాయుడు(76) మృతి చెందారు.
అలాగే రోలుగుంట మండలం కొమరవోలుకు చెందిన ఇటంశెట్టి రామ్మూర్తి(55) పొలానికి వెళ్లి వచ్చి ఇంటిలో స్పృహతప్పి పడిపోయాడు. కుటుంబీకులు ఆస్పత్రకి తరలించేందుకు సిద్ధమవుతుండగా ప్రాణాలు విడిచాడు. బుచ్చెయ్యపేట మండలం పొట్టిదొరపాలేనికి చెందిన కొల్లిమర్ల అర్జునరావు(52) పొలంలో పనిచేస్తూ అస్వస్థతకు గురయ్యాడు.
ఇంటికొచ్చికుప్పకూలి చనిపోయాడు. చీడికాడ మండలం తురువోలుకు చెందిన చొక్కాకుల ఎర్రునాయుడు (70) ఎండతీవ్రతకు తాళలేక గురువారం రాత్రి మృతిచెందాడు. పెదగోగాడకు చెందిన ఇమంది చిన్న (50) కూడా ఇలాగే శుక్రవారం ఉదయం చనిపోయినట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
చోడవరం మండలం బంగారమ్మపాలెంలో బర్ల సింహాచలమ్మ (50) పొలం నుంచి ఇంటికి వస్తూ స్పృహతప్పి పడిపోయింది. దీంతో స్థానికులు, కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది.
యలమంచిలి నియోజకవర్గంలో ఎనిమిది మంది చనిపోయారు. అచ్యుతాపురం మండలంలోని ఎస్‌ఈజెడ్‌కాలనీకి చెందిన నీరుకొండ గురయ్య(70),నీరుకొండ కాసులమ్మ (65), గురుజాపాలెంకి చెందిన రాజాన సింహాచలం (55),లాలం చిట్టెమ్మ(60), పిట్టలపాలెంకి చెందిన బత్తిన కనకారాం(70)లు ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయి మృతి చెందారు.
మునగపాకకు చెందిన ఆడారి వెంకన్న (80) వడగాడ్పులకు తట్టుకోలేక గురువారం రాత్రి మృతి చెందారు. ఇదే గ్రామానికి చెందిన బొడ్డేడ శ్రీరాములు (85) శుక్రవారం ఉదయం పొలంపనులు చూసుకొని ఇంటికి వచ్చాక మంచంపై విశ్రాంతి తీసుకుంటూనే మృత్యువు ఒడి చేరారు. అలాగే దొడ్డి త్రినాథరావు (65) మధ్యాహ్నం ఎండతీవ్రతకు తట్టుకోలేక మృతి చెందారు.
నర్సీపట్నం నియోజకవర్గంలో నలుగురు వడదెబ్బకు చనిపోయారు. మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లికి చెందిన వృద్ధుడు కాళ్ల నూకరాజు(65) శుక్రవారం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మాకవరపాలెం మండలం తాడపాలకు చెందిన పెంటకోట నారాయణమ్మ(55) వడగాడ్పులకు తాళలేక గురువారం రాత్రి ఇంటివద్దే మృతిచెంది. అలాగే కొండలఅగ్రహారం గ్రామానికి చెందిన బొబ్బిలి సన్నమ్మ(60) శుక్రవారం కాసిన భారీ ఎండకు ప్రాణాలు కోల్పోయింది.
నాతవరం మండలం ములగపూడిలో లాలం అప్పలనాయుడు రోజూ మాదిరి శుక్రవారం పొలానికి వెళ్లాడు. వడదెబ్బకు గురయి అక్కడే పాకలో విశ్రాంతి తీసుకుంటూ సాయంత్రానికి మృతి చెందారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో ఐదుగురు చనిపోయారు. నక్కపల్లి మండలం పెదతీనార్లకు చెందిన మేరిగి కోదండ(60), జి సూరమ్మలు(60) వేడి గాలులకు తట్టుకోలేక గురువారం రాత్రి చనిపోయినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఎస్.రాయవరం మండలం పేటసూదిపురంలో రైతు దాసరి రామునాయుడు (54) పొలానికి వెళ్లి వడదెబ్బకు గురయి చనిపోయాడు. తిమ్మాపురంలో బొండానారాయణమ్మ (66),ఉప్పరాపల్లిలో తుంపాల నూకాలమ్మ(61) మృతి చెందారు.
సబ్బవరం మండలం మొగలిపురంలో మాజీ సర్పంచ్ బంకపల్లి పైడయ్య(52) గురువారం మృతి చెందాడు. 1992లో ఇతను గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయి సేవలందించారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి, సర్పంచ్ గండి అరుణలు కుటుంబాన్ని పరామర్శించారు.
అనకాపల్లి మండలం సీతానగరం గ్రామానికి చెందిన కాకర లక్ష్మి (55), బండారు అప్పలనర్సమ్మ (75)లు శుక్రవారం వడదెబ్బకు మృతి చెందినట్టు కుటుంబీకులు తెలిపారు. భీమిలి మండలంలో మరో ముగ్గురు చనిపోయారు. విశాఖనగరం 62వ వార్డు దయాళ్‌నగర్‌లో పి. అప్పారావు(56) చనిపోయాడు.
వడదెబ్బకు 34 మంది మృతి
Published Sat, Jun 14 2014 12:46 AM | Last Updated on Fri, May 25 2018 2:14 PM
Advertisement