దూరంగా... భారంగా...
⇒ పల్స్‌పోలియోపై వైద్యుల నిరాసక్తత
⇒ ఆరు నెలలుగా అంధకారంలో ఆరోగ్య కేంద్రాలు
⇒ పని చేయని ఫ్రిజ్‌లు
⇒ వ్యాక్సిన్ నిల్వకు ఇబ్బందులు
సాక్షి, హైదరాబాద్: జాతీయ పల్స్‌పోలియో కార్యక్ర మంపై వివిధ ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆసక్తి చూపడం లేదు. ఇది తమకు భారమవుతుందని భావిస్తూ...దూరంగా ఉంటున్నారు. ఆస్పత్రుల్లో విద్యుత్ లేకపోవడంతో వ్యాక్సిన్ నిల్వ చేసే ఫ్రిజ్‌లు పని చేయడం లేదు. వారం రోజుల ముందు సరఫరా చేసే వ్యాక్సిన్‌ను బయట పెడితే పాడైపోయే ప్రమాదం ఉంది. దీంతో వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆరు నెలలవుతున్నా... ఇంతవరకూ పునరుద్ధరించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆరు నెలలుగా అంతే...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 96 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఒక్క హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి పరిధిలోనే 85 ఉన్నా యి. ఇందులో 40కి పైగా ఆరోగ్య కేంద్రాల భవనాలు జీహెచ్‌ఎంసీకి చెందినవి. వీటిలో మాదన్నపేట్, గగన్‌మహల్, డీబీఆర్ మిల్స్, చింతల్‌బస్తీ, అఫ్జల్‌సాగర్, శాంతినగర్, ఆగపురా, కార్వాన్ -2, పానిపురా, పురాణాపూల్-2, మహరాజ్‌గంజ్, దూద్‌బౌలి, భోలక్‌పూర్, మెట్టుగూడ, బోయగూడ, శ్రీరాంనగర్, వినాయక్‌నగర్, తారా మైదాన్ (జూపార్క్ ఎదురుగా), కుమ్మరివాడి, తీగల్‌కుంట, చందలాల్ బారాదరి ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు 2013 మార్చి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ బిల్లు చెల్లించలేదు. దీంతో డిస్కం అధికారులు ఇటీవల ఈ ఆస్పత్రులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.
వైద్యులు లేకపోవడంతో...
ఇదిలా ఉంటే నగరంలోని పంజాషా-1, యాకుత్‌పుర-2, మెట్టుగూడ, మలక్‌పేట్, ఆగపురా, గగన్‌మహల్, నిలోఫర్ యూనిట్ ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు లేకపోవడంతో రోగులకు నర్సులే పెద్ద దిక్కవుతున్నారు. ఈ నెల 18న ప్రారంభం కానున్న పల్స్‌పోలియోలో పాల్గొనేందుకు జిల్లాలో సరిపడే స్థాయిలో వైద్యాధికారులు లేకపోవడమే కాక... ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వ్యాక్సిన్ నిల్వకు ఆస్పత్రుల్లో వసతులూ కరువవుతున్నాయి. దీంతో నిర్వహణ బాధ్యతలకు ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బంది జంకుతున్నారు.