Vaccine storage
-
కరోనాకు మరో వ్యాక్సిన్, ఇది అన్నిటికంటే స్పెషల్!
బెంగళూరు: గది ఉష్ణోగ్రత వద్ద పని చేసే తొలి కరోనా వ్యాక్సిన్ ఇండియాలో రూపు దిద్దుకుంటోంది. ఇండియన్ ఇన్స్‌స్టిట్యూ్‌ట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) ఈ వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది. బెంగళూరు వేదికగా ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు చేసిన ప్రయోగ ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని ఐఐఎస్ చెబుతోంది. ఎలుకల్లో ప్రయోగాలు ఐఐఎస్ బెంగళూరులో మాలిక్యూలర్ బయో ఫిజిక్స్ విభాగానికి చెందిన శాస్త్రవేత్తలు కరోనాకు విరుగుడుగా పని చేసే మాలిక్యూల్‌ని కనుగొన్నారు. ఈ మాలిక్యూల్‌తో ఎలుకల్లో ప్రయోగాలు జరపగా యాంటీబాడీస్ పెరిగినట్టు గుర్తించారు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి కంటే ఎనిమిదిరెట్లు అధికంగా యాంటీబాడీలు ఎలుకల్లో తయారయ్యాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎలుకల్లో చేపట్టిన ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడంతో మనుషుల్లో త్వరలోనే ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. గది ఉష్ణోగ్రత వద్ద ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు అన్నీ శీతల ఉష్ణోగ్రతల్లోనే పని చేసేవిగా తయారయ్యాయి. కరోనాకు తొలి వ్యాక్సిన్‌గా వచ్చిన ఫైజర్ అయితే ఏకంగా మైనస్ 71 సెల్సియస్ డిగ్రీల దగ్గర నిల్వ చేయాల్సి ఉంది. ఇక కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వీలు 8 సెల్సియస్ డిగ్రీలు ఉష్ణోగ్రతలో నిల్వ చేయాలి. దీంతో వ్యాక్సిన్ల నిల్వ, సరఫరా ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారుతోంది. కానీ ఐఐఎస్ బెంగళూరు రూపొందించిన వ్యాక్సిన్‌ను గది ఉష్ణోగ్రత వద్ద కూడా బాగా పని చేస్తోందంటున్నారు శాస్త్రవేత్తలు. దీంతో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ సులువు అవుతుందంటున్నారు సైంటిస్టులు. -
మహారాష్ట్రలో వ్యాక్సిన్ కొరత
ముంబై: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యతోపాటుటీకాల కొరత పెరిగిపోతోందని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ టోపే ఆందోళన వెలిబుచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 14 లక్షల డోసుల టీకాలు మాత్రమే ఉన్నాయని, అవి మూడు రోజులకు మాత్రమే సరిపోతాయన్నారు. వ్యాక్సిన్లు అందుబాటులో లేక చాలా చోట్ల టీకా కేంద్రాలను మూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘గతంలో రోజుకి 4 లక్షల మందికి టీకా ఇచ్చేవాళ్లం. రోజుకి ఆరు లక్షల డోసులు ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం రోజుకి 5 లక్షల మందికి టీకా ఇస్తున్నాం. కానీ టీకాల నిల్వ రోజుకీ తగ్గుతోంది’ అని వివరించారు. మహారాష్ట్రలో కరోనా విస్తృతి దారుణంగా ఉందని, మరణాల సంఖ్య కూడా 50 వేలు దాటిందని తెలిపారు. అందువల్ల, మహారాష్ట్రకు అధిక మొత్తంలో టీకాలను పంపించేందుకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. కరోనా సోకుతున్న వారిలో 20–40 ఏళ్లవారే ఎక్కువగా ఉన్నందున, వారికి కూడా టీకా అందించేలా ఏర్పాట్లు ప్రారంభించాలని కేంద్రాన్ని కోరారు. టీకాల కొరత విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువచ్చామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదీప్ వెల్లడించారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి 1.06 కోట్ల డోసుల వ్యాక్సిన్ రాగా, 88 లక్షల డోసులను పౌరులకు ఇచ్చామని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే.. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమైన మహారాష్ట్ర ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు టీకాల కొరత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చిందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నారు. సరిపోను టీకాలు లేవంటూ ప్రజల్లో భయాందోళనలను సృష్టిస్తోందని మహారాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ల కొరత వాదన అర్థం లేనిదన్నారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్, క్వారంటైన్‌పై రాష్ట్ర ప్రభుత్వం అసలు దృష్టి పెట్టడం లేదని హర్షవర్ధన్ పేర్కొన్నారు -
ఫైజర్ వ్యాక్సిన్ అందని ద్రాక్షేనా?
న్యూయార్క్/ముంబై: మహమ్మారి కోవిడ్-19ను నిలువరించడంలో సత్ఫలితాలు సాధించామంటున్న అమెరికన్ దిగ్గజం ఫైజర్ ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్ అందుబాటుపై పరిశ్రమవర్గాలు పెదవి విరుస్తున్నాయి. నిజానికి క్లినికల్ పరీక్షలలో 90 శాతానికిపైగా విజయవంతమైనట్లు ఫైజర్ ఇంక్ పేర్కొన్నప్పటికీ.. వ్యాక్సిన్ భద్రత, పనితీరుపై అప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో ఫైజర్ సైతం భద్రతకు సంబంధించి డేటాను మరింత విశ్లేషించవలసి ఉన్నట్లు ఇప్పటికే పేర్కొంది. కాగా.. వ్యాక్సిన్ కు ఏడాది చివరికల్లా అనుమతులు వచ్చినప్పటికీ భారత్ వంటి వర్ధమాన దేశాలకు చేరేందుకు ఆలస్యంకావచ్చని తెలుస్తోంది. దీనికితోడు వ్యాక్సిన్ ను నిల్వ చేయడం, రవాణా, పంపిణీ వంటి అంశాలు సవాళ్లు విసరవచ్చని వివరిస్తున్నారు. వివరాలు చూద్దాం మైనస్ 70 డిగ్రీలు మెసంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఫైజర్ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీలలో స్టోర్ చేయవలసి ఉంటుందని ఫార్మా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అమెరికా వంటి దేశాలకూ సమస్యేనని చెబుతున్నారు. దీంతో వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీ వంటివి సవాళ్లు విసరగలవని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలమేరకు ఫైజర్ తొలుత 10 కోట్ల డోసేజీలను అమెరికా మార్కెట్లకు సరఫరా చేయవలసి ఉంది. తదుపరి జపాన్, కెనడా, యూకేలకూ అందించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. భాగస్వామ్యాలు వ్యాక్సిన్ తయారీ, పంపిణీలకు జర్మన్ కంపెనీ బయో ఎన్‌టెక్ తోపాటు, చైనీస్ కంపెనీ ఫోజన్ తోనూ ఫైజర్ ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా యూరోపియన్ దేశాలు, ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేయనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. మధ్య, తక్కువస్థాయి ఆదాయాలుగల దేశాలకు అందించేందుకు వీలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ ఫైజర్ ఎలాంటి ఒప్పందాలనూ కుదుర్చుకోలేదని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా.. ఫైజర్ వ్యాక్సిన్ ఖరీదును 39 డాలర్లుగా అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల ఏర్పడే రోగనిరోధక శక్తి కనీసం ఏడాదిపాటు పనిచేసే వీలున్నట్లు బయో ఎన్‌టెక్ తాజాగా అభిప్రాయపడింది. -
దూరంగా... భారంగా...
⇒ పల్స్‌పోలియోపై వైద్యుల నిరాసక్తత ⇒ ఆరు నెలలుగా అంధకారంలో ఆరోగ్య కేంద్రాలు ⇒ పని చేయని ఫ్రిజ్‌లు ⇒ వ్యాక్సిన్ నిల్వకు ఇబ్బందులు సాక్షి, హైదరాబాద్: జాతీయ పల్స్‌పోలియో కార్యక్ర మంపై వివిధ ఆరోగ్య కేంద్రాల వైద్యులు ఆసక్తి చూపడం లేదు. ఇది తమకు భారమవుతుందని భావిస్తూ...దూరంగా ఉంటున్నారు. ఆస్పత్రుల్లో విద్యుత్ లేకపోవడంతో వ్యాక్సిన్ నిల్వ చేసే ఫ్రిజ్‌లు పని చేయడం లేదు. వారం రోజుల ముందు సరఫరా చేసే వ్యాక్సిన్‌ను బయట పెడితే పాడైపోయే ప్రమాదం ఉంది. దీంతో వీటి నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు వెనుకాడుతున్నారు. ఆరోగ్య కేంద్రాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆరు నెలలవుతున్నా... ఇంతవరకూ పునరుద్ధరించకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆరు నెలలుగా అంతే... గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 96 ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటిలో ఒక్క హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి పరిధిలోనే 85 ఉన్నా యి. ఇందులో 40కి పైగా ఆరోగ్య కేంద్రాల భవనాలు జీహెచ్ఎంసీకి చెందినవి. వీటిలో మాదన్నపేట్, గగన్‌మహల్, డీబీఆర్ మిల్స్, చింతల్‌బస్తీ, అఫ్జల్‌సాగర్, శాంతినగర్, ఆగపురా, కార్వాన్ -2, పానిపురా, పురాణాపూల్-2, మహరాజ్‌గంజ్, దూద్‌బౌలి, భోలక్‌పూర్, మెట్టుగూడ, బోయగూడ, శ్రీరాంనగర్, వినాయక్‌నగర్, తారా మైదాన్ (జూపార్క్ ఎదురుగా), కుమ్మరివాడి, తీగల్కుంట, చందలాల్ బారాదరి ప్రభుత్వ పట్టణ ఆరోగ్య కేంద్రాలకు 2013 మార్చి నుంచి ఇప్పటి వరకు విద్యుత్ బిల్లు చెల్లించలేదు. దీంతో డిస్కం అధికారులు ఇటీవల ఈ ఆస్పత్రులకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వైద్యులు లేకపోవడంతో... ఇదిలా ఉంటే నగరంలోని పంజాషా-1, యాకుత్‌పుర-2, మెట్టుగూడ, మలక్‌పేట్, ఆగపురా, గగన్‌మహల్, నిలోఫర్ యూనిట్ ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లు లేకపోవడంతో రోగులకు నర్సులే పెద్ద దిక్కవుతున్నారు. ఈ నెల 18న ప్రారంభం కానున్న పల్స్‌పోలియోలో పాల్గొనేందుకు జిల్లాలో సరిపడే స్థాయిలో వైద్యాధికారులు లేకపోవడమే కాక... ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన వ్యాక్సిన్ నిల్వకు ఆస్పత్రుల్లో వసతులూ కరువవుతున్నాయి. దీంతో నిర్వహణ బాధ్యతలకు ఆరోగ్య కేంద్రాల్లోని వైద్య సిబ్బంది జంకుతున్నారు.