న్యూయార్క్/ముంబై: మహమ్మారి కోవిడ్-19ను నిలువరించడంలో సత్ఫలితాలు సాధించామంటున్న అమెరికన్ దిగ్గజం ఫైజర్ ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్ అందుబాటుపై పరిశ్రమవర్గాలు పెదవి విరుస్తున్నాయి. నిజానికి క్లినికల్ పరీక్షలలో 90 శాతానికిపైగా విజయవంతమైనట్లు ఫైజర్ ఇంక్ పేర్కొన్నప్పటికీ.. వ్యాక్సిన్ భద్రత, పనితీరుపై అప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో ఫైజర్ సైతం భద్రతకు సంబంధించి డేటాను మరింత విశ్లేషించవలసి ఉన్నట్లు ఇప్పటికే పేర్కొంది. కాగా.. వ్యాక్సిన్ కు ఏడాది చివరికల్లా అనుమతులు వచ్చినప్పటికీ భారత్ వంటి వర్ధమాన దేశాలకు చేరేందుకు ఆలస్యంకావచ్చని తెలుస్తోంది. దీనికితోడు వ్యాక్సిన్ ను నిల్వ చేయడం, రవాణా, పంపిణీ వంటి అంశాలు సవాళ్లు విసరవచ్చని వివరిస్తున్నారు. వివరాలు చూద్దాం
మైనస్ 70 డిగ్రీలు
మెసంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఫైజర్ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీలలో స్టోర్ చేయవలసి ఉంటుందని ఫార్మా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అమెరికా వంటి దేశాలకూ సమస్యేనని చెబుతున్నారు. దీంతో వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీ వంటివి సవాళ్లు విసరగలవని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలమేరకు ఫైజర్ తొలుత 10 కోట్ల డోసేజీలను అమెరికా మార్కెట్లకు సరఫరా చేయవలసి ఉంది. తదుపరి జపాన్, కెనడా, యూకేలకూ అందించవలసి ఉన్నట్లు తెలుస్తోంది.
భాగస్వామ్యాలు
వ్యాక్సిన్ తయారీ, పంపిణీలకు జర్మన్ కంపెనీ బయో ఎన్టెక్ తోపాటు, చైనీస్ కంపెనీ ఫోజన్ తోనూ ఫైజర్ ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా యూరోపియన్ దేశాలు, ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేయనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. మధ్య, తక్కువస్థాయి ఆదాయాలుగల దేశాలకు అందించేందుకు వీలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ ఫైజర్ ఎలాంటి ఒప్పందాలనూ కుదుర్చుకోలేదని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా.. ఫైజర్ వ్యాక్సిన్ ఖరీదును 39 డాలర్లుగా అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల ఏర్పడే రోగనిరోధక శక్తి కనీసం ఏడాదిపాటు పనిచేసే వీలున్నట్లు బయో ఎన్టెక్ తాజాగా అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment