Pfizer company
-
రష్యాతో బిజినెస్ చేస్తాం.. లాభం ఉక్రెయిన్‌కు ఇస్తాం!
రష్యాలో పెట్టుబడులు, వ్యాపారాలు నిలిపేస్తాం అంటూ కొన్నాళ్ల కిందట అమెరికా ఫార్మా దిగ్గజం ‘ఫైజర్’ సీఈవో అల్బర్ట బౌర్లా స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. మిగతా కంపెనీల్లాగే.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ నిర్ణయంలో పెద్ద మార్పే వచ్చింది ఇప్పుడు. ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలెట్టిన రష్యాకు పారిశ్రామిక దిగ్గజాలు వరుస షాకులు ఇస్తున్నాయి. మెజారిటీ కంపెనీలు తమ కార్యకలాపాలను రష్యాలో నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించగా.. అందుకు విరుద్ధంగా రష్యాలో తమ కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించిన ఔషధ తయారీ దిగ్గజం ఫైజర్ ఆపై ఓ కీలక ప్రకటన చేసింది. మానవతా దృక్పథంతో ఆలోచించి.. ఇప్పుడు వ్యాపారం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఫైజర్ సీఈవో వెల్లడించారు. ‘‘రష్యాలో మందుల కొరత ఏర్పడింది. ఈ తరుణంలో మేం మానవతా కోణంలో ఆలోచించాలి. అందుకే వ్యాపారం కొనసాగించాలనుకుంటున్నాం. మందులు పంపిస్తాం. అయితే.. రష్యాలో వచ్చే మొత్తం లాభాలను మాత్రం ఉక్రెయిన్‌కే సాయంగా అందిస్తాం. అంతేకాదు... రష్యాకు మందుల వరకు సరఫరా చేసినప్పటికీ.. అక్కడ నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ మాత్రం నిలిపివేస్తాం. ఇకపై రష్యాతో కొత్త ఒప్పందాలుండబోవ్’’ అని ఫైజర్ స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని పాశ్చాత్య దేశాలతో పాటుగా మెజారిటీ సంస్థలు తప్పుబడుతున్నాయి. అందుకు నిరసనగా రష్యాతో సంబంధాలు తెంచుకుంటున్నట్లుగా కూడా మెజారిటీ దేశాలు, సంస్థలు ప్రకటించాయి. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్ మాత్రం రష్యాతో సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే.. రష్యాలో వచ్చే లాభాలను ఉక్రెయిన్‌కు సాయంగా ప్రకటిస్తామని కొత్త తరహాలో ప్రకటన చేయడం రష్యాకు షాక్ అనే చెప్పొచ్చు. దీనిపై రష్యా రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి. -
హే!... రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్!!
Children Pfizer Covid Vaccine: యూరోపియన్ యూనియన్‌లో కోవిడ్ వ్యాక్సిన్‌ని ఉత్పత్తి చేసే ప్రధాన కంపెనీలైన బయో ఎన్‌టెక్/ఫైజర్లు మరో రెండు వారాల్లో పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానుందని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు. ఈ మేరకు ఆమె కరోనా మహమ్మారి సమస్య గురించి జర్మన్-యుఎస్ జాయింట్ వెంచర్‌తో మాట్లాడానని పైగా వారు తమ పరిశోధనలు మరింత వేగవంతం చేస్తున్నారని చెప్పారు. (చదవండి: ఆ తప్పుడు ఆరోపణే ఆమెను కోట్లాధికారిని చేసింది!!) అంతేకాదు ఆమె ఈయూలోని పిల్లలకు డిసెంబర్ 13 నాటికల్లా ఫైజర్ వ్యాక్సిన్లు అందుబాటులో వస్తాయని అన్నారు. అయితే సౌతాఫ్రికాలోని బోట్స్వానాలో గురించిన ఒమిక్రాన్ కొత్త కరోనా వేరియంట్‌తో హడలిపోతూ భయం గుప్పెట్లో బతుకుతున్న ప్రపంచదేశాలన్నించి ఈ విషయం కాస్త ఊరటనిచ్చే అంశం అనే చెప్పాలి. (చదవండి: వామ్మో! అప్పుడే ఈ ఒమ్రికాన్ వైరస్ 12 దేశాలను చుట్టేసింది!!) -
కోవిడ్ మాత్రలు వేరే సంస్థలూ తయారుచేయొచ్చు
జెనీవా: కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి తాము ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ మాత్రల్ని ఇతర కంపెనీలూ తయారు చేయడానికి అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ అంగీకరించింది. ఐక్యరాజ్య సమితి మద్దతు కలిగిన జెనీవాకి చెందిన మెడిసన్స్ పేటెంట్ పూల్(ఎంపీపీ) బృందంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. యాంటీవైరల్ పాక్స్లోవిడ్ మాత్రలు తయారు చేయడానికి ఆ బృందానికి లైసెన్స్‌లు మంజూరు చేసినట్టుగా ఫైజర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎంపీపీ సంస్థ నిరుపేద దేశాలకు తక్కువ ధరలకే మందుల్ని పంపిణీ చేస్తోంది. ఫైజర్ చేసుకున్న ఒప్పందం ద్వారా ప్రపంచ జనాభాలో 53% మందికి కోవిడ్ మాత్రలు అందుబాటులోకి వస్తాయి. ఫైజర్ కంపెనీ రాయల్టీలను వదులుకోవడంతో 95 దేశాల్లో ఈ మాత్రల్ని అత్యంత చౌక ధరలకే పంపిణీ చేయవచ్చు. మరికొద్ది నెలల్లోనే ఈ మాత్రల్ని మార్కెట్లోకి తెస్తామని ఎంపీపీ పాలసీ చీఫ్ ఎస్టెబన్ బరోన్ చెప్పారు. ఫైజర్ చేసుకున్న ఈ ఒప్పందంతో కరోనాను త్వరితంగా అంతమొందించవచ్చునని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
Tokyo Olympics: వారికి ఫైజర్, బయోఎన్‌టెక్ వ్యాక్సిన్లు
టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారుల కోసం ఫైజర్, బయో టెక్నాలజీ (జర్మనీ) కంపెనీలు భారీ సంఖ్యలో వ్యాక్సిన్లను విరాళంగా అందజేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వెల్లడించింది. ఈ వ్యాక్సిన్లను టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులతోపాటు అందులో పనిచేసే ఇతర సిబ్బందికి కూడా ఇవ్వనున్నారు. గేమ్స్ ఆరంభమయ్యే నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ తెలిపారు. చదవండి: Shikhar Dhawan: కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న ధావన్ -
ఈ ఏడాది చివరికల్లా సాధారణ స్థితి
వాషింగ్టన్: లక్షలాది మంది అమెరికన్లకు కోవిడ్ వ్యాక్సిన్‌ని అందించడంలో అమెరికా తీవ్రంగా కృషి చేస్తుండడంతో ఈ యేడాది చివరికల్లా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. మిచిగావ్, కలాంజూలోని ఫైజర్ వ్యాక్సిన్ తయారీ కేంద్రంలో ఆయన పర్యటించారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలన్న బైడెన్, తమ ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా పెంచేందుకూ, పంపిణీని క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ క్రిస్మస్ గత ఏడాది క్రిస్మస్కన్నా భిన్నంగా ఉండబోతోందన్న ఆశాభావాన్ని బైడెన్ వ్యక్తం చేశారు. వైరస్‌లో చాలా రకాలున్నాయని, పరిస్థితులు మారవచ్చునని బైడెన్ అన్నారు. వ్యాక్సిన్ రావడానికీ, దాన్ని అందరూ తీసుకోవడానికీ తేడా ఉందన్నారు. అది అందరికీ చేరే వరకు కృషి చేయాలని చెప్పారు. జూలై చివరి నాటికి 600 మిలియన్ మోతాదులకు మించి పంపిణీ చేస్తాం అన్నారు. అయితే ఇది మారవచ్చునని బైడెన్ అన్నారు. ప్రస్తుతం తీవ్రమైన శీతల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ఆలస్యం అవుతోందని, అలాగే ఏం జరుగుతుందో వేచి చూడాలని ఆయన అన్నారు. మంచు తుపాన్లు, అతిశీతల వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు 60 లక్షల వ్యాక్సిన్ డోసుల పంపిణీ ఆలస్యం అయ్యిందన్నారు. ‘ఎప్పటికి ఈ సంక్షోభం ముగుస్తుందో నేను తేదీలు ప్రకటించలేను కానీ, సాధ్యమైనంత త్వరలో ఆరోజుని చూసేందుకు ప్రయత్నిస్తున్నాం’అని బైడెన్ చెప్పారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు, ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు ఈ ప్రభుత్వం సైన్స్‌ను అనుసరిస్తుందని బైడెన్ అన్నారు. -
ఫైజర్ వ్యాక్సిన్‌కు WHO గుర్తింపు
వాషింగ్టన్: కరోనా వైరస్ కట్టడికి యూఎస్ ఫార్మా దిగ్గజం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) గుర్తింపునిచ్చింది. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో సహకారంతో ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్‌ను అత్యవసర ప్రాతిపదికన వినియోగించవచ్చునంటూ డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. వెరసి ప్రపంచంలోనే కోవిడ్-19 కట్టడికి డబ్ల్యూహెచ్‌వో గుర్తింపును పొందిన తొలి వ్యాక్సిన్‌ను రూపొందించిన దిగ్గజంగా ఫైజర్ నిలిచింది.ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌ను యూకే, యూఎస్, కెనడా, బెహ్రయిన్ తదితర దేశాలలో ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగిస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌కు తోడు యూఎస్‌లో హెల్త్‌కేర్ దిగ్గజం మోడర్నా ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్‌కు సైతం యూఎస్ఎఫ్డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కాగా.. మరోపక్క యూకే ప్రభుత్వం సైతం ఫైజర్ వ్యాక్సిన్‌కు జతగా బ్రిటిష్, స్వీడిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్‌ను అనుమతించింది. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీతో కలసి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కట్టడికి ఇప్పటికి మూడు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినట్లయ్యింది. చదవండి: (కోవిడ్-19కు చెక్: మరో వ్యాక్సిన్ రెడీ) మరిన్ని దేశాలు ఫైజర్ వ్యాక్సిన్‌కు తాజాగా డబ్ల్యూహెచ్‌వో గుర్తింపునివ్వడంతో మరిన్ని దేశాలు ఈ బాటలో నడిచే వీలున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో గుర్తింపును ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా వ్యాక్సిన్ వినియోగానికి పలు దేశాలు అనుమతించే అవకాశమున్నట్లు తెలియజేశాయి. ఫైజర్ వ్యాక్సిన్‌ను డబ్ల్యూహెచ్‌వో అనుమతించడంతో ప్రపంచ దేశాలకు అందించేందుకు యునిసెఫ్ సన్నాహాలు చేసే వీలున్నట్లు తెలియజేశాయి. కాగా.. ఈ వార్తల నేపథ్యంలో దేశీయంగా ఫైజర్ ఇంక్‌కు దేశీ అనుబంధ సంస్థ అయిన ఫైజర్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. ఎన్ఎస్ఈలో ఈ షేరు తొలుత 7 శాతం దూసుకెళ్లింది. రూ. 5,450ను తాకింది. ప్రస్తుతం 4 శాతం జంప్‌చేసి రూ. 5,294 వద్ద ట్రేడవుతోంది. -
10 రోజుల్లో 10 లక్షల మందికి వ్యాక్సిన్లు
వాషింగ్టన్: ప్రపంచంలోనే కోవిడ్-19 కారణంగా అత్యధిక సంఖ్యలో బాధితులున్న అమెరికాలో వ్యాక్సినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. వెరసి ప్రభుత్వం గత 10 రోజుల్లోనే 10 లక్షల మందికిపైగా వ్యాక్సిన్లను అందించింది. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్ సహకారంతో యూఎస్ దిగ్గజం ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ఈ నెల 14న యూఎస్ఎఫ్డీఏ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే. దీంతో కరోనా కట్టడికి 10 రోజుల క్రితం ప్రారంభించిన వ్యాక్సిన్ల పంపిణీలో భాగంగా బుధవారానికల్లా 10 లక్షల మందికిపైగా తొలి డోసేజీని ఇచ్చినట్లు వ్యాధుల నియంత్రణ, నిరోధక కేంద్రం(సీడీసీ) డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ పేర్కొన్నారు. (వచ్చే వారం నుంచీ మనకూ వ్యాక్సిన్! ) తొలి క్వార్టర్‌కల్లా వ్యాక్సినేషన్ ప్రారంభమైనప్పటికీ ఈ నెలాఖరుకల్లా 2 కోట్ల మందికి వ్యాక్సిన్లు అందించాలన్న లక్ష్యం నెరవేరే అవకాశంలేదని వ్యాక్సిన్ ఆపరేషన్ విభాగ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మోన్సెఫ్ స్లావ్ పేర్కొన్నారు. అయితే 2021 మార్చికల్లా 10 కోట్ల మందికి వ్యాక్సిన్లను అందించే లక్ష్యంవైపు సాగుతున్నట్లు చెప్పారు. ఈ బాటలో రెండో త్రైమాసికానికల్లా(ఏప్రిల్-జూన్) మరో 10 కోట్ల మందికి వ్యాక్సిన్లను పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా గత వారం 30 లక్షల డోసేజీలను సరఫరా చేసినట్లు వెల్లడించారు. కాగా.. ఈ వారం ఫార్మా దిగ్గజం మోడర్నా రూపొందించిన వ్యాక్సిన్ 60 లక్షల డోసేజీలను సరఫరా చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే విధంగా ఫైజన్ తయారీ వ్యాక్సిన్లను మరో 20 లక్షలు అందించే సన్నాహాల్లో ఉన్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి. -
వారాంతానికల్లా మరో వ్యాక్సిన్ రెడీ!
న్యూఢిల్లీ, సాక్షి: కోవిడ్-19 కట్టడికి ఈ వారంలోనే మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. యూఎస్ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్ ఇందుకు అర్హత సాధించింది. క్లినికల్ పరీక్షల డేటాను విశ్లేషించిన యూఎస్ఎఫ్డీఏ మంగళవారం సంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మోడర్నా వ్యాక్సిన్ వినియోగంపై గురువారం నిపుణుల సలహా కమిటీ సమావేశంకానుంది. కమిటీ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాక ఈ వ్యాక్సిన్‌ను సైతం అత్యవసర ప్రాతిపదికన వినియోగించేందుకు యూఎస్ఎఫ్డీఏ అధికారికంగా అనుమతించనున్నట్లు ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. వెరసి వారాంతానికల్లా కరోనా వైరస్ కట్టడికి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు తెలియజేశాయి. ఫైజర్ వ్యాక్సిన్‌కు సైతం ఇదే తరహాలో అనుమతులు లభించడంతో సోమవారం నుంచి పంపిణీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పటికే మోడర్నా వ్యాక్సిన్ 94 శాతం సమర్థతను చూపినట్లు క్లినికల్ పరీక్షల డేటా వెల్లడించడంతో వారాంతానికల్లా అందుబాటులోకి రానున్నట్లు హెల్త్‌కేర్ రంగ నిపుణులు భావిస్తున్నారు. (ఇక యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్!) రెండేళ్లపాటు రక్షణ రష్యన్ సంస్థ గమలేయా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ రెండేళ్లపాటు రక్షణ నిస్తుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ కనీసం రెండేళ్లపాటు రక్షణను కల్పించగలదని గమలేయా హెడ్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ తాజాగా పేర్కొన్నారు. బయోఎన్‌టెక్ సహకారంతో ఫైజర్ రూపొందించిన వ్యాక్సిన్ 4-5 నెలలపాటు రోగనిరోధక శక్తిని ఇవ్వగలదని ఈ సందర్భంగా ఫార్మా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. గమలేయా అంచనాలు నిజమైతే భారత్‌కు ఇది అత్యంత శుభవార్త కాగలదని వ్యాఖ్యానించారు. కాగా.. తమ పరీక్షలలో స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ 91.4 శాతం సత్ఫలితాలు ఇచ్చినట్లు గమలేయా ఇన్స్టిట్యూట్ ఇటీవల వెల్లడించడం గమనార్హం! (తొలి ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్- పరీక్షలకు రెడీ) డాక్టర్ రెడ్డీస్ ద్వారా దేశీయంగా స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌పై క్లినికల్ పరీక్షలను హెల్త్‌కేర్ దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ చేపట్టింది. పరీక్షలు విజయవంతమైతే వ్యాక్సిన్‌కు నియంత్రణ సంస్థల నుంచి అనుమతులను కోరనుంది. తద్వారా దేశీయంగా 10 కోట్ల డోసేజీల సరఫరాకు వీలు కలగనున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. నిజానికి దేశీ వినియోగానికి అనువైన వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం ఎదురుచూస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. వ్యాక్సిన్ నిల్వ, పంపిణికి అనువైన పరిస్థితులు, అధిక జనాభాకు అందించే వెసులుబాటు, ఆర్థిక భారం తదితర పలు అంశాలను సమీక్షించాక ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలియజేశారు. -
ఫైజర్ వ్యాక్సిన్‌కు కేంద్రం నో!
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తాజాగా అమెరికాలో సైతం వినియోగించనున్న ఫైజర్ వ్యాక్సిన్‌కు దేశీయంగా చుక్కెదురుకానుంది. ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ధర 37 డాలర్లు(సుమారు రూ. 2720) కావడం దీనికి కారణమని ఫార్మా వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందించిన వ్యాక్సిన్ 10 డాలర్ల(రూ. 737)కే అందుబాటులోకి రానుండటంతో కేంద్ర ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ కొనుగోలుకి ముందుకెళ్లకపోవచ్చని తెలియజేశాయి. అధిక ధరకుతోడు.. ఫైజర్ తయారీ వ్యాక్సిన్‌ను మైనస్ 70-90 సెల్షియస్‌లో నిల్వ చేయవలసి రావడం సైతం ప్రతికూలంగా పరిణమించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వెరసి ఫైజర్ వ్యాక్సిన్ ధర, నిల్వ సమస్యలు, పంపిణీ వ్యయాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలుకి విముఖత చూపనున్నట్లు ఫార్మా వర్గాలు అభిప్రాయపడ్డాయి. (అలర్జీలు ఉన్న వారికి వ్యాక్సిన్లు వాడొద్దు) నాలుగో దేశం ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్‌ను యూకే, బెహ్రయిన్, కెనడా అత్యవసర ప్రాతిపదికన వినియోగించేందుకు అనుమతులు మంజూరు చేశాయి. ఈ బాటలో వారాంతాన యూఎస్ఎఫ్ఎడీఏ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో నేటి నుంచి యూఎస్‌లోనూ ఫైజర్ వ్యాక్సిన్‌ను ఎమర్జెన్సీ ప్రాతిపదికన వినియోగించనున్నారు. ఫైజర్ స్వయంగా రూపొందించిన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాల ద్వారా యూఎస్‌లో వ్యాక్సిన్ల పంపిణీని ఆదివారం ప్రారంభించింది. వీటిని తొలుత హెల్త్ వర్కర్లు, నర్సింగ్ హోమ్ సిబ్బంది తదితరులకు వినియోగించనున్నారు. -
మార్గరెట్- షేక్స్పియర్.. వీళ్లెవరో తెలుసా?
లండన్: కోవిడ్-19 కట్టడికి జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో కలసి ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ పంపిణీ యూకేలో ప్రారంభమైంది. గత వారం ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల నియంత్రణ సంస్థ(ఎంహెచ్ఆర్ఏ) ఇందుకు అనుమతించడంతో యూకే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి ప్రపంచంలోనే తొలిసారిగా 90 ఏళ్ల మహిళ మార్గరెట్ కీనన్.. ఫైజర్ వ్యాక్సిన్‌ను అందుకున్నారు. ఎన్నీస్కిల్లెన్కు చెందిన మార్గరెట్‌తో వ్యాక్సిన్ల పంపిణీ ప్రారంభంకాగా.. ఇందుకు తానెంతో గర్విస్తున్నట్లు మార్గరెట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన మార్గరెట్‌కు కోవెంట్రీ యూనివర్శిటీ ఆసుపత్రిలో వ్యాక్సిన్‌ను అందించారు. కాగా.. మార్గరెట్ తదుపరి వార్విక్‌షైర్‌కు చెందిన విలియం షేక్స్పియర్ అనే వ్యక్తి వ్యాక్సిన్ వేయించుకున్న రెండోవ్యక్తిగా నిలవడం విశేషం! చదవండి: (జనవరి 1 నుంచి విప్రో వేతన పెంపు!) తప్పనిసరికాదు కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు యూకే ప్రభుత్వం ఫైజర్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను అనుమతించినప్పటికీ ఇది తప్పనిసరికాదని విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. వ్యాక్సిన్‌ను భారీ స్థాయిలో అందించేందుకు లాజిస్టిక్స్ విభాగంలో పలువురు రోజంతా పనిచేస్తున్నట్లు జాతీయ ఆరోగ్య సేవల సంస్థ(ఎన్హెచ్ఎస్) పేర్కొంది. ఫైజర్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ మెసెంజర్ ఆర్ఎన్ఏ ఫార్ములాతో రూపొందిన సంగతి తెలిసిందే. -
కరోనా కిల్లర్: ఆఫ్టర్ 28 డేస్...
సాక్షి, హైదరాబాద్ : కరోనా కిల్లర్‌గా భావిస్తున్న ఫైజర్ టీకా మంగళవారం నుంచి బ్రిటన్‌లో ఇవ్వడం ప్రారంభించనున్నారు. ఇటు భారత్‌లోనూ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ కంపెనీ దరఖాస్తు చేసుకుంది.. ఈ నేపథ్యంలో ఒకవేళ ప్రభుత్వం కనుక అనుమతిస్తే.. అది ఎలా పనిచేస్తుంది అన్నది మనకు తెలియాలిగా.. ఈ టీకాను అక్స్‌ఫర్డ్, మోడెర్నా లాంటి వాటిలా కాకుండా –70డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది.. రెండు డోసులు తీసుకోవాలి. ఒక్కో డోసు ధర రూ.1,500.. అయితే.. 28 రోజులు చాలట.. వైరస్‌కు వ్యతిరేకంగా మన శరీరంలో పూర్తి స్థాయిలో రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుందని చెబుతున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దామా.. చదవండి: కరోనా వ్యాక్సిన్‌కు తొలి దరఖాస్తు మొదటి రోజు.. తొలి డోస్.. ► 12వ రోజు.. రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది.. ► 21వ రోజు.. రెండో డోస్ ► 28వ రోజు.. పూర్తి స్థాయిలో రోగనిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది -
డీసీజీఐ అనుమతి కోరిన ఫైజర్
న్యూఢిల్లీ: కోవిడ్-19 టీకా అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ‘భారత ఔషధ నియంత్రణ జనరల్’ (డీసీజీఐ)ని అమెరికా ఫార్మా కంపెనీ ఫైజర్ కోరింది. ఈ టీకాను ఇప్పటికే యునైటెడ్ కింగ్డమ్, బహ్రెయిన్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. భారతదేశంలో 96 లక్షలకు పైగా ప్రజలను ప్రభావితం చేసిన మహమ్మారి కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొనే రేసులో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న తొలి వ్యాక్సిన్ ఇదే కావడం విశేషం. డిసెంబర్ 4న సమర్పించిన తన దరఖాస్తులో ఫైజర్ ఇండియా ‘వ్యాక్సిన్‌ను దిగుమతి చేసుకుని విక్రయించడానికి, పంపిణీకి అనుమతించాలని, భారత ప్రజలపై క్లినికల్ పరీక్షల నిర్వహణ కోసం ఆవశ్యకతను ప్రత్యేక నిబంధనల కింద రద్దు చేయాలని దానిలో కోరింది’ అని పిటిఐ పేర్కొంది. (కరోనా వైరస్: ఎన్నో వ్యాక్సిన్లు..) కరోనా వ్యాక్సిన్‌పై ఫార్మా దిగ్గజం ఫైజర్ కీలక ప్రకటన చేసింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్ 95 శాతం సేఫ్ అని ఫైజర్ ప్రకటించింది. తుది దశ క్లినికల్ ట్రయల్స్ వివరాలను ఫైజర్ సంస్థ ఈయూకి అందించింది. ఈ వ్యాక్సిన్ కి మొదట అనుమతిచ్చిన మొదటి పాశ్చాత్య దేశంగా యుకె నిలిచింది. వ్యాక్సిన్ తయారీ, పంపిణీలకు జర్మన్ కంపెనీ బయో ఎన్‌టెక్ తోపాటు, చైనీస్ కంపెనీ ఫోజన్ తోనూ ఫైజర్ ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా యూరోపియన్ దేశాలు, ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేయనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. యుకె దీనిని ముందుకు తీసుకెళ్లడం ఒక చారిత్రాత్మక క్షణం అని ఫైజర్ తెలిపింది. భారత్ లో కూడా ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. మెసంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఫైజర్ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీలలో స్టోర్ చేయవలసి ఉంటుందని ఫార్మా నిపుణులు పేర్కొంటున్నారు. (వైరస్ ముప్పు సమసిపోలేదు..) -
కరోనా వ్యాక్సిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన బహ్రెయిన్
మనమా: ఫైజర్-బయోటెక్ కరోనా వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి ఆమోదించినట్లుగా బహ్రెయిన్ తెలిపింది. బ్రిటన్ తరువాత ఈ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రెండవ దేశం ఇదే. వ్యాక్సిన్ ఆమోదంతో కోవిడ్-19 నియంత్రణకు మరింత బలం చేకూరుతుందని నేషనల్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ సీఈవో మారియమ్ అల్ జలాహ్మా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే యూఎస్ ఔషద దిగ్గజం ఫైజర్ ఇంకా జర్మన్ భాగస్వామి బయోటెక్ ఈ టీకాను ఎప్పుడు ప్రారంభిస్తాయో మనమా పేర్కొనలేదు. సాధారణ ఉపయోగం కోసం కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఆమోదించినట్లు, వచ్చేవారం నుంచి దీనిని ప్రారంభించాలని చూస్తున్నట్లు బ్రిటన్ బుధవారం తెలిపింది. చదవండి: (వ్యాక్సిన్ : సీరం పూనావాలా అరుదైన ఘనత) మరోవైపు నవంబర్‌లో బహ్రెయిన్.. చైనాకు చెందిన సినోఫార్మ్ వ్యాక్సిన్‌ను ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ వర్కర్స్‌పై ఉపయోగించడాన్ని ఆమోదించింది. బహ్రెయిన్‌లో ఇప్పటికే 87 వేలకుపైగా కేసులు నమోదు కాగా, 341 మంది మరణించారు. ఫైజర్-బయోటెక్ కరోనా వ్యాక్సిన్ అన్ని భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని బ్రిటన్ శుక్రవారం ప్రకటించింది. కరోనా వైరస్ చైనాలో మొదలయినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది మృతి చెందగా, 65 మిలియన్లకిపైగా కరోనా బారినపడ్డారు. చదవండి: (కొన్ని వారాల్లో వ్యాక్సిన్) -
గుడ్‌న్యూస్; వచ్చే వారమే కరోనా వ్యాక్సిన్
లండన్: కోవిడ్-19 కట్టడికి వచ్చే వారం నుంచీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు తాజాగా యూకే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మెసెంజర్ ఆర్‌ఎన్‌ఈ సాంకేతితతో ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ఎంహెచ్ఆర్ఏ మద్దతివ్వడంతో యూకే ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో రూపొందించిన వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించమంటూ ఇటీవల యూఎస్ఎఫ్డీఏ, యూరోపియన్ ఔషధ నియంత్రణ సంస్థలకు ఫైజర్ దరఖాస్తు చేసింది. ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల స్వతంత్ర నియంత్రణ సంస్థ(ఎంహెచ్ఆర్ఏ) ఓకే చెప్పడంతో యూకే ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేసింది, దీంతో వచ్చే వారం నుంచి యూకేలో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా తొలిసారి వ్యాక్సిన్ అధికారిక వినియోగానికి అనుమతించిన దేశంగా యూకే నిలవనుంది. ఇదేవిధంగా కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్‌ను అందించిన తొలి కంపెనీలుగా ఫైజర్, బయోఎన్‌టెక్ ఆవిర్భవించనున్నాయి. చరిత్రాత్మకం అత్యవసర ప్రాతిపదికన తమ వ్యాక్సిన్ వినియోగానికి యూకే ప్రభుత్వం అనుమతించడం కంపెనీ చరిత్రలో చరిత్రాత్మక ఘట్టమని ఫైజర్ సీఈవో ఆర్బర్ట్ బోర్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోవిడ్-19పై సైన్స్ విజయం సాధిస్తుందంటూ ప్రకటించాక తాము లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నామని తెలియజేశారు. యూకే ప్రభుత్వ బాటలో ప్రపంచంలోని ఇతర దేశాలకూ అత్యంత నాణ్యమైన వ్యాక్సిన్లను సరఫరా చేయాలని చూస్తున్నట్లు చెప్పారు. షేరు జూమ్ కరోనా వైరస్ కట్టడికి మాతృ సంస్థ ఫైజర్ ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్ వినియోగానికి తాజాగా యూకే ప్రభుత్వం ఓకే చెప్పడంతో దేశీయంగా ఫైజర్ లిమిటెడ్ కౌంటర్‌కు డిమాండ్ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఎన్ఎస్ఈలో ఫైజర్ షేరు 7.3 శాతం జంప్‌చేసింది. రూ. 5,385ను తాకింది. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 5,310 వద్ద ట్రేడవుతోంది. బయోఎన్‌టెక్‌తో కలసి ఫైజర్ ఇంక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై అంచనాలతో ఇటీవల ఫైజర్ షేరు ర్యాలీ బాటలో సాగుతోంది. వెరసి ఈ నవంబర్ 10న రూ. 5,900 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. . -
ఇండియాకు మోడర్నా వ్యాక్సిన్
ముంబై: కరోనా వైరస్ కట్టడిలో 94.5 శాతం విజయవంతమైనట్లు తాజాగా పేర్కొన్న యూఎస్ ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ వ్యాక్సిన్ దేశీయంగా అందుబాటులోకి వచ్చే వీలున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కోవాక్స్ సౌకర్యాల ద్వారా ఇందుకు అవకాశమున్నట్లు తెలియజేశాయి. వ్యాక్సిన్ అభివృద్ధిలో ఎపిడిమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ సహకార సమితి(సీఈపీఐ) నుంచి గతంలోనే మోడర్నా ఇంక్‌కు నిధుల సహాయం అందినట్లు వివరించాయి. సీఈపీఐ కోవాక్స్‌లో భాగంకావడంతో ఇండియా సైతం వ్యాక్సిన్‌ను పొందనున్నట్లు తెలియజేశాయి. చదవండి: (పసిడి- వెండి అక్కడక్కడే..) 2 బిలియన్లు వచ్చే ఏడాది(2021) చివరికల్లా కోవాక్స్ సౌకర్యాల ద్వారా పేద, మధ్యాదాయ దేశాలకు 2 బిలియన్ వ్యాక్సిన్లను సరఫరా చేయాలని కోవాక్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు హెల్త్‌కేర్ రంగ నిపుణులు తెలియజేశారు. ఈ ఏడాది జనవరిలో మోడర్నా ఇంక్‌కు సీఈపీఐ 1 మిలియన్ డాలర్లను విడుదల చేసింది. తద్వారా మెసెంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికతతో వ్యాక్సిన్ అభివృద్ధికి పాక్షికంగా నిధులు అందజేసింది. ఈ నిధుల సమీకరణ కారణంగా మోడర్నా ఇంక్ పేద, మధ్యాదాయ దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేయవలసి ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 2016లో ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా సీఈపీఐ రూపొందింది. వ్యాక్సిన్ల అభివృద్ధి, తయారీ, నిల్వలకు ఉద్ధేశించి సీఈపీఐను ఏర్పాటు చేశారు. చదవండి: (జుకర్‌బర్గ్‌ను దాటేసిన ఎలన్ మస్క్?) ఒప్పందం లేదు దేశీ ఫార్మా కంపెనీలతో మోడర్నా ఇంక్‌కు ఒప్పందాలేవీ లేవని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. దీంతో మోడర్నా తొలుత వ్యాక్సిన్‌ను యూఎస్ ప్రభుత్వానికి సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేశాయి. మోడర్నా ఇంక్ ఆచరించిన ఎంఎన్ఆర్ఏ పద్ధతిలోనే ఫైజర్ ఇంక్ సైతం వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఈ వ్యాక్సిన్ సైతం 90 శాతంపైగా ఫలితాలు సాధించినట్లు ఇప్పటికే యూఎస్ హెల్త్‌కేర్ దిగ్గజం ఫైజర్ ప్రకటించింది. అయితే మోడర్నా రూపొందించిన వ్యాక్సిన్‌ను 2-8 సెల్షియస్లలో నిల్వ చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ నిల్వ చేసేందుకు -70 సెల్షియస్ అవసరమంటూ వార్తలు వెలువడిన విషయం విదితమే. దీంతో మోడర్నా ఇంక్ వ్యాక్సిన్‌పట్ల పరిశ్రమవర్గాలలో అంచనాలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. -
వ్యాక్సిన్ ఎఫెక్ట్- ఫైజర్ చైర్మన్ షేర్ల అమ్మకం
న్యూయార్క్: కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ 90 శాతం విజయవంతమైందన్న వార్తల తదుపరి ఫైజర్ చైర్మన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ షేర్లను విక్రయించారు. తమ హోల్డింగ్స్‌లో 62 శాతానికి సమానమైన 1.76 లక్షల షేర్లను విక్రయించారు. చైర్మన్, సీఈవో ఆల్బర్ట్ బౌర్ల ,32,508 షేర్లు, ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్ శాలీ 43,662 షేర్లు విక్రయించారు. షేరుకి 41.94 డాలర్ల సగటు ధరలో వీటిని అమ్మివేశారు. ఎస్ఈసీకి మంగళవారం ఈ వివరాలను ఇరువురూ వెల్లడించారు. దీంతో బౌర్ల 5.56 మిలియన్ డాలర్లు, శాలీ 1.83 మిలియన్ డాలర్లు ఆర్జించారు. సోమవారం ఫైజర్ వ్యాక్సిన్‌పై అప్డేట్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఎగ్జిక్యూటివ్‌లు ఇద్దరూ ముందుగా ప్రకటించిన ట్రేడింగ్ ప్రణాళిక ప్రకారమే షేర్లను విక్రయించినట్లు బుధవారం కంపెనీ పేర్కొంది. ఎస్ఈసీ నిబంధనల ప్రకారం వ్యక్తిగత ఫైనాన్షియల్ ప్రణాళికలలో భాగంగా వాటాలను అమ్మినట్లు తెలియజేసింది. వ్యాక్సిన్ విజయవంతమైన వార్తలతో సోమవారం ఫైజర్ షేరు ఇంట్రాడేలో దాదాపు 42 డాలర్లకు ఎగసింది. -
ఫైజర్ వ్యాక్సిన్ అందని ద్రాక్షేనా?
న్యూయార్క్/ముంబై: మహమ్మారి కోవిడ్-19ను నిలువరించడంలో సత్ఫలితాలు సాధించామంటున్న అమెరికన్ దిగ్గజం ఫైజర్ ఇంక్ రూపొందించిన వ్యాక్సిన్ అందుబాటుపై పరిశ్రమవర్గాలు పెదవి విరుస్తున్నాయి. నిజానికి క్లినికల్ పరీక్షలలో 90 శాతానికిపైగా విజయవంతమైనట్లు ఫైజర్ ఇంక్ పేర్కొన్నప్పటికీ.. వ్యాక్సిన్ భద్రత, పనితీరుపై అప్పుడే ఒక అభిప్రాయానికి రాలేమని ఫార్మా నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో ఫైజర్ సైతం భద్రతకు సంబంధించి డేటాను మరింత విశ్లేషించవలసి ఉన్నట్లు ఇప్పటికే పేర్కొంది. కాగా.. వ్యాక్సిన్ కు ఏడాది చివరికల్లా అనుమతులు వచ్చినప్పటికీ భారత్ వంటి వర్ధమాన దేశాలకు చేరేందుకు ఆలస్యంకావచ్చని తెలుస్తోంది. దీనికితోడు వ్యాక్సిన్ ను నిల్వ చేయడం, రవాణా, పంపిణీ వంటి అంశాలు సవాళ్లు విసరవచ్చని వివరిస్తున్నారు. వివరాలు చూద్దాం మైనస్ 70 డిగ్రీలు మెసంజర్ ఆర్ఎన్ఏ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఫైజర్ వ్యాక్సిన్ ను మైనస్ 70 డిగ్రీలలో స్టోర్ చేయవలసి ఉంటుందని ఫార్మా నిపుణులు పేర్కొంటున్నారు. ఇది అమెరికా వంటి దేశాలకూ సమస్యేనని చెబుతున్నారు. దీంతో వ్యాక్సిన్ నిల్వ, రవాణా, పంపిణీ వంటివి సవాళ్లు విసరగలవని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాలమేరకు ఫైజర్ తొలుత 10 కోట్ల డోసేజీలను అమెరికా మార్కెట్లకు సరఫరా చేయవలసి ఉంది. తదుపరి జపాన్, కెనడా, యూకేలకూ అందించవలసి ఉన్నట్లు తెలుస్తోంది. భాగస్వామ్యాలు వ్యాక్సిన్ తయారీ, పంపిణీలకు జర్మన్ కంపెనీ బయో ఎన్‌టెక్ తోపాటు, చైనీస్ కంపెనీ ఫోజన్ తోనూ ఫైజర్ ఒప్పందాలు కుదుర్చుకుంది. తద్వారా యూరోపియన్ దేశాలు, ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ ను సరఫరా చేయనున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. మధ్య, తక్కువస్థాయి ఆదాయాలుగల దేశాలకు అందించేందుకు వీలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థతోనూ ఫైజర్ ఎలాంటి ఒప్పందాలనూ కుదుర్చుకోలేదని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు. కాగా.. ఫైజర్ వ్యాక్సిన్ ఖరీదును 39 డాలర్లుగా అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ వల్ల ఏర్పడే రోగనిరోధక శక్తి కనీసం ఏడాదిపాటు పనిచేసే వీలున్నట్లు బయో ఎన్‌టెక్ తాజాగా అభిప్రాయపడింది. -
వ్యాక్సిన్: యూఎస్ కంపెనీల కీలక ప్రకటన
వాషింగ్టన్: ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో ఇప్పటికే కరోనా కేసులు 8 మిలియన్లు దాటాయి. ఇలాంటి పరిస్థితుల్లో నవంబర్ 3న జరిగే అధ్యక్ష ఎన్నికల నాటికి కరోనా వ్యాక్సిన్లు సిద్ధమవుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే వ్యాక్సిన్ విషయంలో తాము సిద్ధంగా ఉన్నట్లు ఫైజర్, మోడెర్నా ప్రకటించాయి. అమెరికన్ వ్యాక్సిన్ తయారీ కంపెనీలు కోవిడ్-19 వ్యాక్సిన్ల అత్యవసర ఆమోదం కోసం దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నాయి. అయితే అత్యవసర అనుమతి వచ్చిన తర్వాత ఏవిధంగా ముందుకు వెళ్లాలి అనే దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. (నిర్లక్ష్యానికి ఫలితం.. కోటి టెస్ట్‌లు) ఇక మరో కంపెనీ మసాచుసెట్స్ బయోటెక్ సంస్థ మోడెర్నా నవంబర్ 25 నాటికి టీకా ఆమోదం పొందాలని లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ చైర్మన్, సీఈఓ అల్బర్ట్ బౌర్లా ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తంగా ఏడాది చివరికల్లా రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. నవంబర్ మూడో వారంలో టీకాలు ఆమోదం పొందినప్పటికీ.. అవి విస్తృతంగా లభించడానికి కొన్ని నెలల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే అత్యవసర ఆమోదం పొందినా అవి ఎంతమాత్రం పనిచేస్తాయోనని మరికొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. (ప్రధానమంత్రివా.. మోడల్‌వా?) -
టెక్ డీల్స్- యూఎస్ మార్కెట్ల జోరు
టెక్నాలజీ రంగంలో డీల్స్, కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్‌పై అంచనాలు సోమవారం యూఎస్ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో డోజోన్స్ 328 పాయింట్లు(1.2%) ఎగసి 27,993 వద్ద నిలిచింది. ఎస్అండ్పీ 43 పాయింట్లు(1.3%) లాభపడి 3,384 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 203 పాయింట్లు(2%) జంప్‌చేసి 11,057 వద్ద స్థిరపడింది. కారణాలేవింటే? కోవిడ్-19 కట్టడికి బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై మళ్లీ అంచనాలు పెరిగాయి. సైడ్‌ఎఫెక్ట్స్‌పై సందేహాలతో తాత్కాలికంగా నిలిపివేసిన మూడో దశ క్లినికల్ పరీక్షలను ఆస్ట్రాజెనెకా తిరిగి ప్రారంభించింది. అంతేకాకుండా అక్టోబర్‌కల్లా పరీక్షల డేటా విశ్లేషణను అందించగలమని పేర్కొంది. ఫార్మా దిగ్గజం పైజర్ సీఈవో ఆల్బర్ట్ సైతం డిసెంబర్‌కల్లా వ్యాక్సిన్‌ను విడుదల చేయగలమని తాజాగా ప్రకటించారు. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. 21 బిలియన్ డాలర్లతో ఇమ్యునోమెడిక్స్ను కొనుగోలు చేయనున్నట్లు ఫార్మా దిగ్గజం గిలియడ్ సైన్సెస్ పేర్కొంది. తద్వారా క్యాన్సర్ చికిత్సను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. ఒరాకిల్ చేతికి టిక్‌టాక్ చైనీస్ వీడియో మేకింగ్ యాప్ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం ఒరాకిల్ కార్పొరేషన్ రేసులోకి వచ్చింది. ప్రతిపాదిత డీల్ ప్రకారం టిక్‌టాక్ ప్రమోటర్ బైట్‌డ్యాన్స్‌కు ఒరాకిల్ సాఫ్ట్వేర్ భాగస్వామిగా నిలవనుంది. తద్వారా యూఎస్ వినియోగదారుల డేటాను నిర్వహించనుంది. అంతేకాకుండా టిక్‌టాక్ యూఎస్ విభాగంలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. మరోవైపు 40 బిలియన్ డాలర్లు వెచ్చించడం ద్వారా పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ నుంచి ఆర్మ్ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు చిప్ తయారీ దిగ్గజం ఎన్విడియా తాజాగా వెల్లడించింది. జోరు తీరు.. మార్కెట్లకు సోమవారం పలు బ్లూచిప్ కౌంటర్లు దన్నుగా నిలిచాయి. ఆర్మ్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకోనున్న ఎన్విడియా 6 శాతం జంప్‌చేయగా.. టిక్‌టాక్‌పై కన్నేసిన ఒరాకిల్ 4.3 శాతం ఎగసింది. ఈ ప్రభావంతో చిప్ కంపెనీలు ఏఎండీ, మైక్రాన్, స్కైవర్క్స్ సైతం 2-1 శాతం మధ్య బలపడ్డాయి. ఇక కొద్ది రోజులుగా దిద్దుబాటుకులోనైన ఐఫోన్ల దిగ్గజం యాపిల్ 3 శాతం పుంజుకోగా.. ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా 13 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో మైక్రోసాఫ్ట్ 0.7 శాతం లాభపడగా.. ఫార్మా బ్లూచిప్స్ ఫైజర్ 2.6 శాతం, ఆస్ట్రాజెనెకా 0.6 శాతం చొప్పున ఎగశాయి. -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ చివరి దశలో!
వాషింగ్టన్: ప్రపంచ దేశాలన్నిటినీ వణికిస్తున్న కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందుకు వీలుగా ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ ఏజెడ్‌డీ 1222 చివరి దశ క్లినికల్ పరీక్షలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నేటి నుంచి యూఎస్ సహకారంతో రెండు డోసేజీలు ఇవ్వడం ద్వారా 30,000 మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా నవంబర్‌కల్లా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించాలని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆశిస్తున్నారు. ఆస్ట్రాజెనెకాతోపాటు.. బయోఎన్‌టెక్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల డేటాను అక్టోబర్‌కల్లా విశ్లేషించే వీలున్నట్లు యూఎస్ దిగ్గజం ఫైజర్ తాజాగా పేర్కొంది. ఇప్పటికే ప్రయోగాలు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇప్పటికే బ్రిటన్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో చివరి దశ పరీక్షలలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటికి జతగా జపాన్, రష్యాలోనూ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌లో నిర్వహించిన మూడో దశ పరీక్షల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 50,000 మందిపై తుది దశ ప్రయోగాలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
కోవిడ్-19 వ్యాక్సిన్ల ధరల యుద్ధం?!
అంతర్జాతీయంగా ఫైజర్, మోడర్నా ఇంక్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్, సనోఫీ- జీఎస్కే, మెర్క్ తదితర గ్లోబల్ ఫార్మా దిగ్గజాలు కోవిడ్-19 కట్టడికి వ్యాక్సిన్ల అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి. ఇందుకు వీలుగా ఇప్పటికే క్లినికల్ పరీక్షలను వేగవంతం చేశాయి. ప్రస్తుతం పలు ఔషధాలు రెండు, మూడో దశ పరీక్షలకు చేరుకున్నాయి. సాధారణంగా నాలుగు దశల తదుపరి ఔషధ పరీక్షల ఫలితాలను విశ్లేషించాక సంబంధిత ఔషధ నియంత్రణ సంస్థలు అనుమతులు మంజూరు చేస్తాయని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి. ఇందుకు రోగుల భద్రత, వ్యాక్సిన్ పనితీరు తదితర పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటాయని తెలియజేశాయి. కాగా.. 2020 డిసెంబర్‌లోగా మోడర్నా తదితర సంస్థలు వ్యాక్సిన్‌ను విడుదల చేసే అంచనాలు వేస్తుంటే.. సనోఫీ, జీఎస్కే 2021 తొలి అర్ధభాగంలో ప్రవేశపెట్టే వీలున్నట్లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశ, విదేశీ కంపెనీలు భారీ స్థాయిలో వ్యాక్సిన్లను తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ప్రజలకు ఆరోగ్యపరమైన సవాళ్లు విసురుతున్న కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల ధరలు తదితరాలపై వెలువడుతున్న అంచనాలను చూద్దాం.. 60-4 డాలర్ల మధ్య కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు యూఎస్, తదితర సంపన్న దేశాలలో 50-60 డాలర్ల చొప్పున ధరను మోడార్న్ ఇంక్ ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. అయితే జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్ భాగస్వామ్యంతో ఫైజర్ రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు 39 డాలర్లను ప్రకటించే యోచనలో ఉన్నట్లు విదేశీ మీడియా పేర్కొంది. కాగా.. లక్షలాది మంది రోగులకు వినియోగించగల వ్యాక్సిన్ల ధరలపై ప్రభుత్వంతో తొలుత సంప్రదింపులు జరిపాకే ధరలు నిర్ణయమవుతాయని మోడర్నా ఇంక్ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. మరోవైపు యూఎస్ ప్రభుత్వం నుంచి ముందస్తుగా అందుకోనున్న 120 కోట్ల డాలర్ల చెల్లింపులకుగాను ఆస్ట్రాజెనెకా 4 డాలర్ల ధరలో 30 కోట్ల డోసేజీలను సరఫరా చేయవచ్చని మీడియా పేర్కొంది. యూఎస్ ప్రభుత్వం మోడర్నాకు సైతం 100 కోట్ల డాలర్ల ఫండింగ్‌ను అందించిన విషయం విదితమే. 30 కోట్ల డోసేజీలు కోవిడ్-19కు వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు తొలిసారి ఏప్రిల్‌లో చేతులు కలిపిన ఫార్మా దిగ్గజాలు సనోఫీ, జీఎస్కే.. 2021 తొలి అర్ధభాగంలో ఔషధ నియంత్రణ సంస్థల అనుమతి పొందగలమని భావిస్తున్నట్లు తెలియజేశాయి. క్లినికల్ పరీక్షలు విజయవంతమైతే 6 కోట్ల డోసేజీలను సరఫరా చేసేందుకు బ్రిటన్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొన్నాయి. ఈ బాటలో యూరోపియన్ యూనియన్, ఇటలీ, ఫ్రాన్స్ ప్రభుత్వాలతోనూ చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. తద్వారా 30 కోట్లకుపైగా డోసేజీలను సరఫరా చేసే యోచనలో ఉన్నట్లు విదేశీ మీడియా తెలియజేసింది. -
బ్లూచిప్స్ వీక్- యూఎస్ మార్కెట్లు డౌన్
ప్రధానంగా బ్లూచిప్ స్టాక్స్ నష్టపోవడంతో మంగళవారం యూఎస్ మార్కెట్లు నీరసించాయి. డోజోన్స్ 205 పాయింట్లు(0.8 శాతం) బలహీనపడి 26,379కు చేరగా.. ఎస్అండ్పీ 21 పాయింట్ల(0.7 శాతం) వెనకడుగుతో 3,218 వద్ద ముగిసింది. ఇక నాస్డాక్ మరింత అధికంగా 134 పాయింట్లు(1.3 శాతం) క్షీణించి 10,402 వద్ద నిలిచింది. రెండు రోజులపాటు నిర్వహించిన పాలసీ సమీక్షా నిర్ణయాలను నేడు కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ ప్రకటించనుంది. కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ఫెడ్ సరికొత్త ప్యాకేజీపై స్పందించవచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. జూన్‌లో నిరుద్యోగిత పెరగడం, జులైలో వినియోగ విశ్వాస సూచీ డీలాపడటం వంటి అంశాల నేపథ్యంలో ఫెడ్ నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ప్యాకేజీ ఇలా కోవిడ్-19 ప్రభావంతో సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలకు దన్నుగా రిపబ్లికన్స్ ట్రిలియన్ డాలర్ల సహాయక ప్యాకేజీని ప్రతిపాదిస్తున్నారు. దీనిలో భాగంగా నిరుద్యోగులకు 1200 డాలర్ల చొప్పున ప్రత్యక్ష చెల్లింపులకు ప్రతిపాదించారు. ఇదే విధంగా చిన్నతరహా బిజినెస్‌లకు రుణాలకింద 60 బిలియన్ డాలర్లు విడుదల చేయాలని సూచించారు. ఈ బాటలో స్కూళ్లకు 100 బిలియన్ డాలర్లు కేటాయించారు. అయితే ప్యాకేజీ అంశంపై రిపబ్లికన్స్, డెమక్రాట్ల మధ్య చర్చలు అంత త్వరగా కొలిక్కివచ్చే అవకాశంలేదని విశ్లేషకులు పెదవి విరుస్తుండటం గమనార్హం! ఫలితాల ఎఫెక్ట్ ఈ బుధ, గురువారాలలో టెక్నాలజీ దిగ్గజాలు యాపిల్, అల్ఫాబెట్, అమెజాన్, ఫేస్బుక్ క్యూ2(ఏప్రిల్-జూన్) ఫలితాలు ప్రకటించనున్నాయి. ఆటో దిగ్గజం టెస్లా ఇంక్ 4 శాతం పతనంకాగా.. యాపిల్, నెట్‌ఫ్లిక్స్ 1.5 శాతం చొప్పున డీలాపడ్డాయి. దీంతో నాస్డాక్ నీరసించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. క్యూ2లో ఫలితాలు నిరాశపరచడంతో డైవర్సిఫైడ్ దిగ్గజం 3ఎం కంపెనీ 5 శాతం పతనంకాగా.. సేమ్ స్టోర్ అమ్మకాలు నీరసించడంతో ఫాస్ట్‌ఫుడ్ చైన్ కంపెనీ మెక్‌డొనాల్డ్స్ కార్ప్ 2.5 శాతం క్షీణించింది. అయితే ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ షేరు 4 శాతం జంప్‌చేసింది. కోవిడ్-19కు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో పూర్తిఏడాదికి పటిష్ట గైడెన్స్‌ను ప్రకటించడం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు. -
మోడర్నా వహ్వా.. నెట్‌ఫ్లిక్స్ బేర్
వారాంతాన యూఎస్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 63 పాయింట్లు(0.25 శాతం) క్షీణించి 26,672 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 9 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుని 3,225 వద్ద ముగిసింది. నాస్డాక్ సైతం 29 పాయింట్లు(0.3 శాతం) బలపడి 10,503 వద్ద స్థిరపడింది. దీంతో గత వారం డోజోన్స్ నికరంగా 2.3 శాతం ఎగసింది. ఇందుకు ప్రధానంగా ఫైజర్, మోడర్నా ఇంక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్లు సానుకూల ఫలితాలు చూపడం దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ బాటలో ఎస్అండ్పీ 1.3 శాతం లాభపడగా.. నాస్డాక్ 1.1 శాతం నీరసించింది. కాగా.. టెక్నాలజీ దిగ్గజాల అండతో ఈ ఏడాది ఇప్పటివరకూ నాస్డాక్ 17 శాతం ర్యాలీ చేయగా.. ఎస్అండ్పీ దాదాపు యథాతథంగా నిలిచింది. డోజోన్స్ మాత్రం 6 శాతం క్షీణించింది. శుక్రవారం యూరోపియన్ మార్కెట్లలో ఫ్రాన్స్ 0.3 శాతం డీలాపడగా.. యూకే, జర్మనీ అదే స్థాయిలో బలపడ్డాయి. బ్లూచిప్స్ తీరిలా ఈ ఏడాది క్యూ3(జులై-సెప్టెంబర్)లో కొత్త పెయిడ్ కస్టమర్లు భారీగా తగ్గనున్న అంచనాలతో ఎంటర్టైన్మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ షేరు 6.5 శాతం పతనమైంది. 493 డాలర్ల వద్ద ముగిసింది. మరోపక్క కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ పరీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ షేరు 16 శాతం దూసుకెళ్లింది. వెరసి 95 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ మోడర్నా షేరు 370 శాతం ర్యాలీ చేయడం విశేషం! ఇతర దేశాల దన్ను కోవిడ్-19 కట్టడికి ఫైజర్‌తో జత కట్టి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై చైనీస్ ఫోజన్ ఫార్మా పరీక్షలు చేపట్టేందుకు లైసెన్సింగ్‌ను పొందిన వార్తలతో బయోఎన్‌టెక్ షేరుకి హుషారొచ్చింది. మరోవైపు యూనియన్ యూనియన్‌లో వ్యాక్సిన్ సరఫరా కోసం ఆస్ట్రాజెనెకాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బయోఎన్‌టెక్ షేరు శుక్రవారం 12 శాతం జంప్‌చేసింది. 85 డాలర్లను అధిగమించింది. ఇక ఇండెక్స్ దిగ్గజాలలో కోకకోలా, ఇంటెల్, ఫైజర్ 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్, షెవ్రాన్, ఎక్సాన్ మొబిల్, గోల్డ్‌మన్ శాక్స్, జేపీ మోర్గాన్ 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై అంచనాలతో గత వారం ఫైజర్ ఇంక్ నికరంగా 7 శాతం లాభపడింది. -
ఖుషీఖుషీగా.. ఫైజర్- ఐడీబీఐ బ్యాంక్
సానుకూల విదేశీ సంకేతాలతో వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 329 పాయింట్లు జంప్‌చేసి 35,744ను తాకగా.. నిఫ్టీ 94 పాయింట్లు ఎగసి 10,524 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 చికిత్సకు వీలుగా రూపొందిస్తున్న వ్యాక్సిన్ సత్ఫలితాలను ఇస్తున్నట్లు యూఎస్ మాతృ సంస్థ ఫైజర్ ఇంక్ ప్రకటించడంతో దేశీ అనుబంధ సంస్థకు డిమాండ్ పెరిగింది. వెరసి ఫైజర్ లిమిటెడ్ జోరందుకుంది. ఇక మరోపక్క ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్లో ర్యాలీ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడుతుండటంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ఫైజర్ లిమిటెడ్ జర్మన్ కంపెనీ బయోఎన్‌టెక్‌తో భాగస్వామ్యంలో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ కోవిడ్-19 రోగులపై నిర్వహించిన పరీక్షలలో మంచి ఫలితాలు సాధిస్తున్నట్లు ఫైజర్ ఇంక్ తాజాగా పేర్కొంది. దీంతో బుధవారం యూఎస్ మార్కెట్లో ఫైజర్ ఇంక్ షేరు 3 శాతం బలపడింది. ఈ బాటలో దేశీ అనుబంధ కంపెనీ ఫైజర్ లిమిటెడ్‌కూ డిమాండ్ పెరిగింది. మాతృ సంస్థ నుంచి వ్యాక్సిన్ వెలువడితే.. దేశీయంగానూ ఫైజర్ లిమిటెడ్ లబ్ది పొందే వీలున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఈ కౌంటర్ వెలుగులోకి వచ్చినట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఎన్ఎస్ఈలో ఫైజర్ లిమిటెడ్ షేరు 5 శాతం జంప్‌చేసి 4,170 వద్ద ట్రేడవుతోంది. తొలుత 8 శాతం ఎగసి రూ. 4275 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఐడీబీఐ బ్యాంక్ గత నెల రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్‌కు మరోసారి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రస్తుతం ఎన్ఎస్ఈలో బ్యాంక్ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. 48.60 వద్ద ఫ్రీజయ్యింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. బ్యాంక్ మార్కెట్ కేపిటలైజేషన్(విలువ) రూ. 50,000 కోట్లను తాకింది. తద్వారా పీఎన్బీ, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంకులను మార్కెట్ విలువలో ఐడీబీఐ బ్యాంక్ అధిగమించింది. జూన్ 1 నుంచీ ఐడీబీఐ బ్యాంక్ కౌంటర్ ఏకంగా 137 శాతం ర్యాలీ చేసింది. రూ. 20.3 స్థాయి నుంచి బలపడుతూ వస్తోంది. 13 త్రైమాసికాల తదుపరి గతేడాది క్యూ4(జనవరి-మార్చి)లో బ్యాంక్ నికర లాభాలు ఆర్జించడంతో ఈ కౌంటర్ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు ఇటీవల బీమా అనుబంధ విభాగం ఐడీబీఐ ఫెడరల్ లైఫ్ ఇన్సూరెన్స్‌లో 27 శాతం వాటా విక్రయించేందుకు బ్యాంక్ బోర్డు అనుమతించడం ఇందుకు జత కలిసినట్లు తెలియజేశారు. -
ఫైజర్ వ్యాక్సిన్?- ఫాంగ్ స్టాక్స్ రికార్డ్
కోవిడ్-19 చికిత్సకు వీలుగా రూపొందిస్తున్న వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు వేసినట్లు ఫార్మా దిగ్గజం ఫైజర్ ఇంక్ వెల్లడించడంతో బుధవారం యూఎస్ మార్కెట్లు లాభపడ్డాయి. అయితే డోజోన్స్ 78 పాయింట్లు(0.3 శాతం) బలహీనపడి 25,735 వద్ద నిలవగా.. ఎస్అండ్పీ 16 పాయింట్లు(0.5 శాతం) ఎగసి 3,116 వద్ద ముగిసింది. నాస్డాక్ మరింత అధికంగా 96 పాయింట్లు(1 శాతం) పురోగమించి 10,155 వద్ద స్థిరపడింది. తద్వారా మరోసారి సరికొత్త గరిష్టాన్ని అందుకుంది. బయోఎన్‌టెక్‌తో సంయుక్తంగా ఫైజర్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ యాంటీబాడీలను న్యూట్రలైజ్ చేస్తున్నట్లు తాజాగా పేర్కొంది. ఆన్లైన్లో విడుదలైన ఈ ఫలితాలను మెడికల్ జర్నల్ సమీక్షించవలసి ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. కాగా.. వ్యాక్సిన్‌కు ఔషధ నియంత్రణ సంస్థలు అనుమతిస్తే ఏడాది చివరికల్లా 10 కోట్ల డోసేజీలను రూపొందించగలమని ఫైజర్ తెలియజేసింది. ఈ బాటలో 2021 చివరికల్లా 120 కోట్ల డోసేజీలను అందించగమని వివరించింది. ఈ నేపథ్యంలో ఫైజర్ ఇంక్ షేరు 3.2 శాతం ఎగసింది. 34 డాలర్ల సమీపంలో ముగిసింది. ఫేస్బుక్ అప్ ఇటీవల ఫ్లోరిడా, మిసిసిపి, టెక్సాస్ తదితర రాష్ట్రాలలో 60వరకూ స్టోర్లను మూసివేసిన ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇంక్ తాజాగా మరో రెండు డజన్ల స్టోర్లను తాత్కాలికంగా క్లోజ్ చేయనున్నట్లు వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కాలిఫోర్నియా, అలబామా, జార్జియా, లూసియానా, ఒక్లహామా తదితర రాష్ట్రాలలో వీటిని మూసివేస్తున్నట్లు తెలియజేసింది. ఫలితంగా మూత పడనున్న స్టోర్ల సంఖ్య 77కు చేరనున్నట్లు తెలుస్తోంది. అయితే యాపిల్ షేరు స్వల్పంగా 0.2 శాతం నీరసించి 364 డాలర్ల వద్ద నిలిచింది. కాగా..ఇతర ఫాంగ్(FAANG) స్టాక్స్‌లో ఫేస్బుక్ 4.6 శాతం, అమెజాన్ 4.4 శాతం, నెట్‌ఫ్లిక్స్ 6.7 శాతం చొప్పున జంప్‌చేయడంతో నాస్‌డాక్‌కు బలమొచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. అమెజాన్ 2879 డాలర్లకు, నెట్‌ఫ్లిక్స్ 486 డాలర్లకు చేరడం ద్వారా సరికొత్త గరిష్టాల వద్ద ముగిశాయి. ఇక ఆటో దిగ్గజం టెస్లా సైతం 3.7 శాతం పెరిగి 1120 డాలర్లకు చేరడం ద్వారా రికార్డ్ గరిష్టం వద్ద స్థిరపడింది. కొద్ది రోజులుగా పలు రాష్ట్రాలలో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అంతర్గతంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలు కొనసాగుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. దీంతో బుధవారం మార్కెట్లు ఆటుపోట్లు ఎదుర్కొన్నట్లు తెలియజేశారు.