
జెనీవా: కరోనా వైరస్‌ను తరిమికొట్టడానికి తాము ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేసిన యాంటీ వైరల్ మాత్రల్ని ఇతర కంపెనీలూ తయారు చేయడానికి అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ అంగీకరించింది. ఐక్యరాజ్య సమితి మద్దతు కలిగిన జెనీవాకి చెందిన మెడిసన్స్ పేటెంట్ పూల్(ఎంపీపీ) బృందంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. యాంటీవైరల్ పాక్స్‌లోవిడ్ మాత్రలు తయారు చేయడానికి ఆ బృందానికి లైసెన్స్‌లు మంజూరు చేసినట్టుగా ఫైజర్ మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎంపీపీ సంస్థ నిరుపేద దేశాలకు తక్కువ ధరలకే మందుల్ని పంపిణీ చేస్తోంది.
ఫైజర్ చేసుకున్న ఒప్పందం ద్వారా ప్రపంచ జనాభాలో 53% మందికి కోవిడ్ మాత్రలు అందుబాటులోకి వస్తాయి. ఫైజర్ కంపెనీ రాయల్టీలను వదులుకోవడంతో 95 దేశాల్లో ఈ మాత్రల్ని అత్యంత చౌక ధరలకే పంపిణీ చేయవచ్చు. మరికొద్ది నెలల్లోనే ఈ మాత్రల్ని మార్కెట్‌లోకి తెస్తామని ఎంపీపీ పాలసీ చీఫ్ ఎస్టెబన్ బరోన్ చెప్పారు. ఫైజర్ చేసుకున్న ఈ ఒప్పందంతో కరోనాను త్వరితంగా అంతమొందించవచ్చునని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.