టెక్‌ డీల్స్‌- యూఎస్ మార్కెట్ల జోరు | US market up- Tech, Pharma counters zoom | Sakshi
Sakshi News home page

టెక్‌ డీల్స్‌- యూఎస్ మార్కెట్ల జోరు

Published Tue, Sep 15 2020 8:58 AM | Last Updated on Tue, Sep 15 2020 9:01 AM

US market up- Tech, Pharma counters zoom - Sakshi

టెక్నాలజీ రంగంలో డీల్స్‌, కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌పై అంచనాలు సోమవారం యూఎస్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. దీంతో డోజోన్స్‌ 328 పాయింట్లు(1.2%) ఎగసి 27,993 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ 43 పాయింట్లు(1.3%) లాభపడి 3,384 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 203 పాయింట్లు(2%) జంప్‌చేసి 11,057 వద్ద స్థిరపడింది. 

కారణాలేవింటే?
కోవిడ్‌-19 కట్టడికి బ్రిటిష్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై మళ్లీ అంచనాలు పెరిగాయి. సైడ్‌ఎఫెక్ట్స్‌పై సందేహాలతో తాత్కాలికంగా నిలిపివేసిన మూడో దశ క్లినికల్‌ పరీక్షలను ఆస్ట్రాజెనెకా తిరిగి ప్రారంభించింది. అంతేకాకుండా అక్టోబర్‌కల్లా పరీక్షల డేటా విశ్లేషణను అందించగలమని పేర్కొంది. ఫార్మా దిగ్గజం పైజర్‌ సీఈవో ఆల్బర్ట్‌ సైతం డిసెంబర్‌కల్లా వ్యాక్సిన్‌ను విడుదల చేయగలమని తాజాగా ప్రకటించారు. దీంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు తెలియజేశారు. 21 బిలియన్‌ డాలర్లతో ఇమ్యునోమెడిక్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు ఫార్మా దిగ్గజం గిలియడ్‌ సైన్సెస్‌ పేర్కొంది. తద్వారా క్యాన్సర్‌ చికిత్సను మరింత విస్తరించనున్నట్లు తెలియజేసింది. 

ఒరాకిల్‌ చేతికి టిక్‌టాక్‌
చైనీస్‌ వీడియో మేకింగ్‌ యాప్‌ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు తాజాగా సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం ఒరాకిల్‌ కార్పొరేషన్‌ రేసులోకి వచ్చింది. ప్రతిపాదిత డీల్‌ ప్రకారం టిక్‌టాక్‌ ప్రమోటర్‌ బైట్‌డ్యాన్స్‌కు ఒరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ భాగస్వామిగా నిలవనుంది. తద్వారా యూఎస్‌ వినియోగదారుల డేటాను నిర్వహించనుంది. అంతేకాకుండా టిక్‌టాక్‌ యూఎస్‌ విభాగంలో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుంది. మరోవైపు 40 బిలియన్‌ డాలర్లు వెచ్చించడం ద్వారా పీఈ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ నుంచి ఆర్మ్‌ హోల్డింగ్స్‌ను కొనుగోలు చేయనున్నట్లు చిప్‌ తయారీ దిగ్గజం ఎన్‌విడియా తాజాగా వెల్లడించింది. 

జోరు తీరు..
మార్కెట్లకు  సోమవారం పలు బ్లూచిప్‌ కౌంటర్లు దన్నుగా నిలిచాయి. ఆర్మ్‌ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకోనున్న ఎన్‌విడియా 6 శాతం జంప్‌చేయగా.. టిక్‌టాక్‌పై కన్నేసిన ఒరాకిల్‌ 4.3 శాతం ఎగసింది. ఈ ప్రభావంతో చిప్‌ కంపెనీలు ఏఎండీ, మైక్రాన్‌, స్కైవర్క్స్‌ సైతం 2-1 శాతం మధ్య బలపడ్డాయి. ఇక కొద్ది రోజులుగా దిద్దుబాటుకులోనైన ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ 3 శాతం పుంజుకోగా.. ఎలక్ట్రిక్‌ కార్ల కంపెనీ టెస్లా 13 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో మైక్రోసాఫ్ట్‌ 0.7 శాతం లాభపడగా.. ఫార్మా బ్లూచిప్స్‌ ఫైజర్‌ 2.6 శాతం, ఆస్ట్రాజెనెకా 0.6 శాతం చొప్పున ఎగశాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement