![Apple announced it will reinstate the ByteDance owned TikTok app on its US App Store](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/apple01.jpg.webp?itok=wFAbmZhm)
చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్ యాజమాన్యంలోని టిక్‌టాక్ యాప్‌ను తన యూఎస్ యాప్ స్టోర్‌లో పునరుద్ధరిస్తున్నట్లు యాపిల్ ప్రకటించింది. కొంతకాలంగా యాప్‌పై నిషేధం ఉంది. దాంతో ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీసులు అందిస్తున్న కంపెనీలు ఈ యాప్‌ను తొలగించాయి. ఈ యాప్‌ను హోస్ట్ చేసినందుకు కంపెనీలు జరిమానాలు ఎదుర్కోబోవని తాజాగా అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ హామీ ఇచ్చారు. దాంతో తిరిగి యూఎస్‌లోని యాప్ స్టోర్‌లో యాపిల్ దీన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది.
అసలు వివాదం ఏమిటి?
చైనాకు చెందిన బైట్‌డ్యాన్స్(ByteDance) ఆధ్వర్యంలోని టిక్‌టాక్‌ను 2025 జనవరి 19 నాటికి అమెరికాకు చెందిన ఓ కంపెనీకి విక్రయించాలనేలా గతంలో ఆంక్షలు విధించారు. ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలనేలా టిక్‌టాక్ అమెరికా ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. దాంతో 2025 జనవరి 10న కంపెనీ వాదనలు వినడానికి న్యాయస్థానం అంగీకరించింది. టిక్‌టాక్‌పై నిషేధం ఉత్తుర్వులను తాము అధికారంలోకి వచ్చేదాకా నిలుపుదల చేయాలని ట్రంప్ తరఫు లాయర్లు కోర్టును కోరారు. అయినాసరే వ్యక్తుల వ్యక్తిగత డేటా భద్రత కంటే దేశభద్రత ముఖ్యమని తేల్చిచెబుతూ కోర్టు 2025 జనవరి 17న వ్యాఖ్యానించింది.
భద్రతపై ఆందోళనలు
అమెరికాలో జాతీయ భద్రతా ఆందోళనల కారణంగా ఈ యాప్‌పై చాలా విమర్శలొచ్చాయి. దాంతో గత అమెరికా ప్రభుత్వం ప్రాథమికంగా దర్యాప్తు జరిపింది. అమెరికా దేశ భద్రతకు భంగం వాటిల్లేలా స్థానికుల నుంచి సున్నితమైన సమాచారాన్ని సేకరించి దాన్ని చైనాలోని డేటా సెంటర్లలో స్టోర్ చేస్తున్నారని ప్రాథమికంగా నిర్ధారించింది. యూజర్ లొకేషన్లు, ప్రైవేట్ సందేశాలతో సహా అమెరికన్ యూజర్ల నుంచి టిక్‌టాక్ పెద్దమొత్తంలో డేటా సేకరించి దేశ భద్రతకు భంగం కలిగించేలా డేటాను చైనా ప్రభుత్వం యాక్సెస్ చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికన్లు చూసే కంటెంట్‌ను తారుమారు చేయడానికి, ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి టిక్‌టాక్‌ను వినియోగిస్తున్నారనే భయాలు ఉన్నాయి.
ఇదీ చదవండి: లవర్స్‌డే రోజున బంగారం గిఫ్ట్ ఇస్తున్నారా? తులం ఎంతంటే..
ఈ నేపథ్యంలో బైట్‌డ్యాన్స్ 2025 జనవరి 19 లోగా టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయించాలని లేదా నిషేధాన్ని ఎదుర్కోక తప్పదని 2024 ఏప్రిల్‌లో ఒక చట్టం ఆమోదించారు. ద్వైపాక్షిక మద్దతుతో ఈ చట్టాన్ని రూపొందించి జో బైడెన్ దానిపై సంతకం చేశారు. దాంతో కంపెనీ అమెరికా ఉన్నత న్యాయస్థానం ముందు తన వాదనలు వినిపించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా టిక్‌టాక్‌ను పునరుద్ధరించే ప్రణాళికలను ప్రకటించారు. 75 రోజుల పాటు నిషేధం అమలును వాయిదా వేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందు టిక్‌టాక్ తన సేవలను పునరుద్ధరించినట్లు ధ్రువీకరించింది.
Comments
Please login to add a commentAdd a comment