వారాంతాన యూఎస్ మార్కెట్లు అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్ 63 పాయింట్లు(0.25 శాతం) క్షీణించి 26,672 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 9 పాయింట్లు(0.3 శాతం) పుంజుకుని 3,225 వద్ద ముగిసింది. నాస్‌డాక్ సైతం 29 పాయింట్లు(0.3 శాతం) బలపడి 10,503 వద్ద స్థిరపడింది. దీంతో గత వారం డోజోన్స్ నికరంగా 2.3 శాతం ఎగసింది. ఇందుకు ప్రధానంగా ఫైజర్, మోడర్నా ఇంక్ రూపొందిస్తున్న వ్యాక్సిన్లు సానుకూల ఫలితాలు చూపడం దోహదపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. ఈ బాటలో ఎస్‌అండ్‌పీ 1.3 శాతం లాభపడగా.. నాస్‌డాక్ 1.1 శాతం నీరసించింది. కాగా.. టెక్నాలజీ దిగ్గజాల అండతో ఈ ఏడాది ఇప్పటివరకూ నాస్‌డాక్ 17 శాతం ర్యాలీ చేయగా.. ఎస్‌అండ్‌పీ దాదాపు యథాతథంగా నిలిచింది. డోజోన్స్ మాత్రం 6 శాతం క్షీణించింది. శుక్రవారం యూరోపియన్ మార్కెట్లలో ఫ్రాన్స్ 0.3 శాతం డీలాపడగా.. యూకే, జర్మనీ అదే స్థాయిలో బలపడ్డాయి.
బ్లూచిప్స్ తీరిలా
ఈ ఏడాది క్యూ3(జులై-సెప్టెంబర్)లో కొత్త పెయిడ్ కస్టమర్లు భారీగా తగ్గనున్న అంచనాలతో ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ షేరు 6.5 శాతం పతనమైంది. 493 డాలర్ల వద్ద ముగిసింది. మరోపక్క కోవిడ్-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ చివరి దశ క్లినికల్ పరీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్లు పేర్కొనడంతో ఫార్మా దిగ్గజం మోడర్నా ఇంక్ షేరు 16 శాతం దూసుకెళ్లింది. వెరసి 95 డాలర్ల వద్ద చరిత్రాత్మక గరిష్టానికి చేరింది. ఈ ఏడాది ఇప్పటివరకూ మోడర్నా షేరు 370 శాతం ర్యాలీ చేయడం విశేషం!
ఇతర దేశాల దన్ను
కోవిడ్-19 కట్టడికి ఫైజర్‌తో జత కట్టి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై చైనీస్ ఫోజన్ ఫార్మా పరీక్షలు చేపట్టేందుకు లైసెన్సింగ్‌ను పొందిన వార్తలతో బయోఎన్‌టెక్ షేరుకి హుషారొచ్చింది. మరోవైపు యూనియన్ యూనియన్‌లో వ్యాక్సిన్ సరఫరా కోసం ఆస్ట్రాజెనెకాతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో బయోఎన్‌టెక్ షేరు శుక్రవారం 12 శాతం జంప్‌చేసింది. 85 డాలర్లను అధిగమించింది. ఇక ఇండెక్స్ దిగ్గజాలలో కోకకోలా, ఇంటెల్, ఫైజర్ 1.5 శాతం చొప్పున బలపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో బోయింగ్, షెవ్రాన్, ఎక్సాన్ మొబిల్, గోల్డ్‌మన్ శాక్స్, జేపీ మోర్గాన్ 1 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. కరోనా వైరస్ కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై అంచనాలతో గత వారం ఫైజర్ ఇంక్ నికరంగా 7 శాతం లాభపడింది.
Comments
Please login to add a commentAdd a comment