
వాషింగ్టన్: లక్షలాది మంది అమెరికన్లకు కోవిడ్ వ్యాక్సిన్‌ని అందించడంలో అమెరికా తీవ్రంగా కృషి చేస్తుండడంతో ఈ యేడాది చివరికల్లా పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వెల్లడించారు. మిచిగావ్, కలాంజూలోని ఫైజర్ వ్యాక్సిన్ తయారీ కేంద్రంలో ఆయన పర్యటించారు. కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలన్న బైడెన్, తమ ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా పెంచేందుకూ, పంపిణీని క్రమబద్ధీకరించేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ క్రిస్‌మస్ గత ఏడాది క్రిస్‌మస్‌కన్నా భిన్నంగా ఉండబోతోందన్న ఆశాభావాన్ని బైడెన్ వ్యక్తం చేశారు. వైరస్‌లో చాలా రకాలున్నాయని, పరిస్థితులు మారవచ్చునని బైడెన్ అన్నారు.
వ్యాక్సిన్ రావడానికీ, దాన్ని అందరూ తీసుకోవడానికీ తేడా ఉందన్నారు. అది అందరికీ చేరే వరకు కృషి చేయాలని చెప్పారు. జూలై చివరి నాటికి 600 మిలియన్ మోతాదులకు మించి పంపిణీ చేస్తాం అన్నారు. అయితే ఇది మారవచ్చునని బైడెన్ అన్నారు. ప్రస్తుతం తీవ్రమైన శీతల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వ్యాక్సిన్ పంపిణీ ఆలస్యం అవుతోందని, అలాగే ఏం జరుగుతుందో వేచి చూడాలని ఆయన అన్నారు. మంచు తుపాన్‌లు, అతిశీతల వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు 60 లక్షల వ్యాక్సిన్ డోసుల పంపిణీ ఆలస్యం అయ్యిందన్నారు. ‘ఎప్పటికి ఈ సంక్షోభం ముగుస్తుందో నేను తేదీలు ప్రకటించలేను కానీ, సాధ్యమైనంత త్వరలో ఆరోజుని చూసేందుకు ప్రయత్నిస్తున్నాం’అని బైడెన్ చెప్పారు. ప్రజల ప్రాణాలను రక్షించేందుకు, ప్రజల జీవితాలను మెరుగు పరిచేందుకు ఈ ప్రభుత్వం సైన్స్‌ను అనుసరిస్తుందని బైడెన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment