రష్యాలో పెట్టుబడులు, వ్యాపారాలు నిలిపేస్తాం అంటూ కొన్నాళ్ల కిందట అమెరికా ఫార్మా దిగ్గజం ‘ఫైజర్’ సీఈవో అల్బర్ట బౌర్లా స్వయంగా ఒక ప్రకటన విడుదల చేశారు. మిగతా కంపెనీల్లాగే.. ఉక్రెయిన్‌పై యుద్ధానికి నిరసనగానే ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ నిర్ణయంలో పెద్ద మార్పే వచ్చింది ఇప్పుడు.
ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలెట్టిన రష్యాకు పారిశ్రామిక దిగ్గజాలు వరుస షాకులు ఇస్తున్నాయి. మెజారిటీ కంపెనీలు తమ కార్యకలాపాలను రష్యాలో నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించగా.. అందుకు విరుద్ధంగా రష్యాలో తమ కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రకటించిన ఔషధ తయారీ దిగ్గజం ఫైజర్ ఆపై ఓ కీలక ప్రకటన చేసింది. మానవతా దృక్పథంతో ఆలోచించి.. ఇప్పుడు వ్యాపారం కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు ఫైజర్ సీఈవో వెల్లడించారు.
‘‘రష్యాలో మందుల కొరత ఏర్పడింది. ఈ తరుణంలో మేం మానవతా కోణంలో ఆలోచించాలి. అందుకే వ్యాపారం కొనసాగించాలనుకుంటున్నాం. మందులు పంపిస్తాం. అయితే.. రష్యాలో వచ్చే మొత్తం లాభాలను మాత్రం ఉక్రెయిన్‌కే సాయంగా అందిస్తాం. అంతేకాదు... రష్యాకు మందుల వరకు సరఫరా చేసినప్పటికీ.. అక్కడ నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్ మాత్రం నిలిపివేస్తాం. ఇకపై రష్యాతో కొత్త ఒప్పందాలుండబోవ్’’ అని ఫైజర్ స్పష్టం చేసింది.
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని పాశ్చాత్య దేశాలతో పాటుగా మెజారిటీ సంస్థలు తప్పుబడుతున్నాయి. అందుకు నిరసనగా రష్యాతో సంబంధాలు తెంచుకుంటున్నట్లుగా కూడా మెజారిటీ దేశాలు, సంస్థలు ప్రకటించాయి. అయితే అందుకు భిన్నంగా వ్యవహరించిన అమెరికన్ ఫార్మా కంపెనీ ఫైజర్ మాత్రం రష్యాతో సంబంధాలు కొనసాగిస్తామని చెబుతూనే.. రష్యాలో వచ్చే లాభాలను ఉక్రెయిన్‌కు సాయంగా ప్రకటిస్తామని కొత్త తరహాలో ప్రకటన చేయడం రష్యాకు షాక్ అనే చెప్పొచ్చు. దీనిపై రష్యా రియాక్షన్ ఎలా ఉండబోతోందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment