నిజామాబాద్ అర్బన్ : ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఎలాంటి ప్రయోజనాలు అందక కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు తీవ్ర ఇబ్బం ది పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 44 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 377 ఉప కేంద్రాలు, 17 క్లస్టర్ల పరిధిలో కొనసాగుతున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఒకరిద్దరు చొప్పున కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు ప్రతి ఆరోగ్య ఉప కేంద్రానికి ఒక కాంట్రాక్ట్ ఏఎన్‌ఎం కొనసాగుతోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య కేంద్రానికి ముగ్గురు కొనసాగుతున్నారు. 487 మంది కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు కొనసాగుతున్నారు. వీరిలో కొంత మందిని యురోపియన్ స్కీం కింద మరికొందరిని నేషనల్ గ్రామీణ హెల్త్ మిషన్, మరికొందరిని ఆర్‌సీహెచ్-2 స్కీం కింద నియమించారు. 2001 నుంచి 2007 వరకు జిల్లా కలెక్టర్ పరిధిలో ఇంటర్వ్యూలు, రోస్టర్ రిజర్వేషన్ ప్రకారం నియామకాలు చేపట్టారు.
దీనికి సంబంధించి కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు 186 మంది ఉన్నారు. 2007 తరువాత ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆస్పత్రి అభివృద్ధి సంఘం కమిటీ ఆధ్వర్యంలో మరికొందరిని నియమించారు. వీరిని అవుట్‌సోర్సింగ్ కింద పరిగణిస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఐదేళ్లు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగిన, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రొస్టర్ రిజర్వేషన్ నియమితులైన వారిని రెగ్యులర్ చేస్తామని ప్రకటించింది. దీని ప్రకారం 186 మంది కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలు రెగ్యులర్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇందులో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నిబంధనల్లో తరచు మార్పులు తీసుకురావడంతో ఏఎన్‌ఎంలు అయోమయం చెందుతున్నారు.
కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ గతేడాది కాంట్రాక్ట్ గడువు ఏడాది ముగిసిన తరువాత మరో ఏడాదికి బాండ్ పేపర్ ద్వారా కాంట్రాక్ట్‌ను సమర్పించాల్సి ఉంది. ఇందులో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలను అవుట్‌సోర్సింగ్ కింద పరిగణిస్తూ రాయించుకున్నారు. దీని వల్ల ప్రస్తుత రెగ్యులరైజ్‌కు వీరిని అనర్హులుగా చూపెడుతున్నారు. జిల్లా అధికారులు చేసిన తప్పిదాలకు అర్హులైన కాంట్రాక్ట్ ఏఎన్‌ఎంలకు తీరని అ న్యాయం జరుగుతోంది. ఈ విషయంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కలెక్టర్ యోగితారాణా దృష్టికి తీసుకెళ్లా రు. తమను ఎలాగైన రెగ్యులర్ చేయాలని 10 రోజులుగా విధులు బహిష్కరించి నిరసనలు చేస్తున్నారు.
డిమాండ్లు
పదో పీఆర్‌సీ నుంచి వేతనాలు ఇవ్వాలి
కనీస వేతనం రూ.21,300తోపాటు, డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు కల్పించాలి.
వ్యాక్సిన్ అలవెన్సు రూ.500లు, యూనిఫాం అలవెన్సుకు 1,500లు, ఎఫ్‌టీఏ రూ.550లు, 35 క్యాజువల్ లీవ్స్, 180రోజులు వేతనాలతో కూడిన మెటర్నిటీ లీవ్‌లు మంజూరు చేయాలి.
సబ్ సెంటర్లకు అద్దె వెయ్యి, స్టెషనరీ, జిరాక్స్ ఖర్చులు ఇవ్వాలి, అన్ టైడ్ ఫండ్స్ పెంచాలి, ఏఎన్ ఎంలకు పర్యవేక్షణ బాధ్యత మాత్రమే ఇవ్వాలి
నైట్ డ్యూటీలు, ఓపీ డ్యూటీలు రద్దు చేయాలని, బదిలీకి అవకాశం కల్పించి, విధి నిర్వహణలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి.
ఆరోగ్య బీమా, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం, ట్రాకింగ్ చేయుటకు ప్రతి పీహెచ్ సెంటర్‌కు ఒక డాట ఎంట్రీ ఆపరేటర్‌ను నియమించాలి.
రెగ్యులరైజ్ చేయాలి
రెగ్యులర్ ఏఎన్‌ఎంలతోపాటు సమానంగా విధులు నిర్వహిస్తున్నాం. మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. సంవత్సరాల తరబడి పనిచేస్తునా మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రభుత్వం ఇకనైన మమ్మల్ని రెగ్యులర్ చేయాలి.
- పద్మ, కాంట్రాక్ట్ ఏఎన్‌ఎం
హామీలు అమలు చేయాలి
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు రెగ్యులర్ చేయడం లేదు. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఏళ్ల తరబడి పనులు చేస్తున్నాము. మమ్మల్ని వెంటనే రెగ్యూలర్ చేయాలి.
- స్వరూప, కాంట్రాక్ట్ ఏఎన్‌ఎం