యాప్ నిఘా | App surveillance | Sakshi
Sakshi News home page

యాప్ నిఘా

Published Fri, Oct 17 2014 1:52 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM

యాప్ నిఘా - Sakshi

యాప్ నిఘా

  • వైద్యులూ తస్మాత్ జాగ్రత్త!
  •  డుమ్మా కొడితే నయా యాప్మీ పనిపడుతుంది
  •  త్వరలో అందుబాటులోకి హెల్త్‌ఇజాన్
  •  ఇలాంటి ఏర్పాటు దేశంలో ఇదే మొదటిసారి
  •  నేడు ప్రారంభించనున్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్ కుమార్
  • సాక్షి, బెంగళూరు : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే కర్ణాటక ఈ విషయంలో మరో ముందడుగు వేసింది. రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని వైద్య విద్య కళాశాలల్లోని సమస్యలను ఎప్పటికప్పుడు, నేరుగా తెలుసుకోవడానికి వీలుగా రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ నూతన యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇలా ప్రభుత్వం వైద్య విభాగం సొంతంగా ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం దేశంలో ఇదేమొదటిసారి.

    పేదల వైద్యం కోసం ప్రభుత్వాలు ఏడాది రూ. వేలకోట్లు ఖర్చు చేస్తున్నా సర్కారీ దవాఖానాలో వైద్యం నాణ్యత ప్రమాణాలు ఎంతమాత్రం అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు. విడుదల చేసిన నిధులు చాలా వరకూ క్షేత్రస్థాయికి చేరకపోవడం... వచ్చిన నిధుల్లో సింహభాగం పక్కదారి పట్టడం మొదటి కారణం. దీని వల్ల ఆస్పత్రుల్లో మందులు కాదుకదా కనీసం తాగునీటి సౌకర్యం వంటి  మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వైద్యులు, నర్సులు, సిబ్బంది సరైన సమయానికి అందుబాటులో లేక పోవడం రెండవది.

    ఈ విషయాలన్నీ తెలిసినా కూడా ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏళ్ల తరబడి ఎక్కడి సమస్యలు ఎక్కడివక్కడే ఉండిపోతున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంలో భాగంగా రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ హెల్త్‌ఇజాన్ (HEALTHZEN)పేరుతో ఒక యూప్‌ను తయారు చేసింది. ఆండ్రాయిడ్ సదుపాయం కలిగిన ఏ ఫోన్ నుంచి అయిన ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

    ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న ఆస్పత్రుల పరిస్థితిని వివరించే విషయం అప్‌లోడ్‌చేసిన వెంటనే క్షేత్రస్థాయితో మొదలుకొని జిల్లా వైద్యాధికారితోపాటు  రాష్ట్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, సంబంధిత మంత్రికి కూడా వెంటనే విషయం తెలిసిపోతుంది. అంతేకాకుండా ఇందులో జీపీఎస్ వ్యవస్థ కూడా ఉండటం వల్ల ఎక్కడి నుంచి విషయాన్ని పంపిస్తున్నారనే విషయం కూడా సంబంధిత అధికారులకు క్షణాల్లో తెలిసిపోనుంది. దీని వల్ల సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించవచ్చనేది  ప్రభుత్వ ఆలోచన.

    ఈ విషయమై రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యూటీ ఖాదర్ మాట్లాడుతూ... ‘నూతన యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నాం. కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హర్షవర్ధన్ కుమార్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభిస్తున్నాం.  ఇటువంటి యాప్ దేశంలో ఇదే ప్రథమం.’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement