ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
దౌసా (రాజస్తాన్): కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంలో మరో మైలు రాయిని అందుకుంది. దేశంలో అతి పెద్దదైన జాతీయ ఎక్స్‌ప్రెస్ హైవే ఢిల్లీ–ముంబై మహా రహదారిలో 246కి.మీ. భాగాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆవిష్కరించారు.ఢిల్లీలోని సోహ్నా నుంచి రాజస్తాన్‌లో దౌసా మధ్య నిర్మాణం జరుపుకున్న తొలిదశను దౌసా వద్ద రిమోట్ కంట్రోల్ బటన్ ద్వారా ప్రధాని ప్రారంభించారు.
8 లేన్లతో నిర్మించిన ఢిల్లీ–దౌసా–లాస్‌సాట్ రహదారి అందుబాటులోకి రావడంతో ఢిల్లీ, జైపూర్ మధ్య దూరం సగానికి సగం తగ్గిపోతుంది. ఇన్నాళ్లు 5 గంటలు పట్టే ప్రయాణం ఈ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళితే మూడున్నర గంటలే పడుతుంది. దీంతోపాటు రూ.5,940 కోట్ల జాతీయ హైవే ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. తమ ప్రభుత్వం హైవే ప్రాజెక్టులు, పోర్టులు, రైల్వేలు, ఆప్టికల్ ఫైబర్, మెడికల్ కాలేజీల మీద అత్యధికంగా దృష్టి సారించిందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు.
ఇలాంటి హైవేలతో పారిశ్రామికవేత్తలతో పాటు, వ్యాపారులు, చిరు వ్యాపారులు కూడా ఆర్థికంగా బలోపేతమవుతారని తెలిపారు. మౌలిక సదుపాయాలపై ఖర్చు చేస్తే మరిన్ని పెట్టుబడుల్ని ఆకర్షించవచ్చునని మోదీ చెప్పారు. ఢిల్లీ–ముంబై తొలిదశతో ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత బలోపేతమవుతుందన్నారు. ఎక్స్‌ప్రెస్‌వే అందుబాటులోకి రావడంతో జైపూర్, అజ్మీర్‌లకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయన్నారు.
సరిహద్దు ప్రాంతాలపై కాంగ్రెస్ నిర్లక్ష్యం: ప్రధాని మన దేశ సైనికుల శక్తి సామర్థ్యాలను కాంగ్రెస్ తక్కువగా అంచనా వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని, దేశంలోకి చొరబడడానికి మన శత్రువులు కొత్త మార్గాలు వెతుక్కుంటారన్న భయంతో ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. దౌసాలో ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించిన తర్వాత బీజేపీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ రాజస్తాన్‌లో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కాంగ్రెస్ కాగితాలకే పరిమితం చేసిందని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉంటేనే రాజస్తాన్ అభివృద్ధి పథంలో దూసుకువెళుతుందని అన్నారు.
దయానంద సరస్వతి 200వ జయంత్యుత్సవాలు
ఆర్యసమాజ్ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంత్యుత్సవాలను మోదీ ఆదివారం ప్రారంభించారు. ఆయన చూపిన మార్గం కోట్లాది మందిలో ఆశల్ని నింపుతోందని ఈ సందర్భంగా ఆయనన్నారు. నిరుపేదలకు సేవ చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అణగారిన వర్గాల అభ్యున్నతి మొట్టమొదటి యజ్ఞంగా చేపట్టామని తెలిపారు.
ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్ వే విశేషాలు
మొత్తం పొడవు: 1,380 కి.మీ.
మొత్తం వ్యయం: దాదాపుగా రూ. లక్ష కోట్లు
ఢిల్లీ ముంబై మధ్య ప్రయాణ సమయం: 12 గంటలు
(ప్రస్తుతం 24 గంటలు పడుతోంది)
తొలి దశ పొడవు : 246 కి.మీ. (సోహ్నా నుంచి దౌసా)
వ్యయం: రూ.12,150 కోట్లు
è ఢిల్లీ నుంచి జైపూర్ మధ్య సగానికి సగం తగ్గనున్న ప్రయాణ సమయం. (ఇన్నాళ్లూ 5 గంటలు పట్టేది. ఇకపై మూడున్నర గంటల్లో చేరుకోవచ్చు) .
è ఆరు రాష్ట్రాల మీదుగా వెళ్లనున్న ఎక్స్‌ప్రెస్ వే
90 గంటలు, 10 సమావేశాలు, 10,800కి.మీ..
నాలుగు రోజుల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోదీ అక్షరాలా సుడిగాలి పర్యటనలు చేపట్టారు. మొత్తం 90 గంటల్లో ఏకంగా 10 బహిరంగ సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన 10,800 కి.మీ. దూరం ప్రయాణిస్తారు. ఫిబ్రవరి 10న ఢిల్లీ నుంచి యూపీకి వెళ్లి ప్రపంచ పెట్టుబడుల సదస్సుని ప్రారంభించారు. ముంబైకి వచ్చి వందేభారత్ రైళ్లకు పచ్చ జెండా ఊపారు. ఫిబ్రవరి 11న త్రిపురలో రెండు బహిరంగ సదస్సుల్లో పాల్గొన్నారు. ఆదివారం ఢిల్లీ నుంచి రాజస్తాన్ వెళ్లి దౌసాలో ఎక్స్‌ప్రెస్ వేను ప్రారంభించారు. రెండు బహిరంగ సమావేశాల్లో ప్రసంగించారు. సోమవారం బెంగుళూరులో ఏరో ఇండియా 2023ను ప్రారంభిస్తారు. అక్కడ్నుంచి మళ్లీ త్రిపురకి వెళ్లి అగర్తాలా ర్యాలీలో పాల్గొని సోమవారం రాత్రి ఢిల్లీకి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment