health sectors
-
వైద్య విద్య ప్రక్షాళన అత్యవసరం
ప్రస్తుతం ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి ప్రాక్టికల్ అంశాలపై అవగాహన నాస్తి. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరడమెలా అన్నదానిపైనే విద్యార్థి దృష్టి కేంద్రీకృతమై ఉంటోంది. కానీ ఎంబీబీఎస్ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు మూడొంతుల వరకూ తక్కువ. అయినా అత్యధికులు పీజీ కోసం పోటీపడుతూంటారు. సహజ సామర్థ్యం, అభిరుచులకు అనుగుణంగా పీజీ కోర్సులను ఎంచుకునే సౌలభ్యం వారికి ఉండాలి. దానికోసం ప్రాంతీయ, దేశ అవసరాలకు తగ్గట్టుగా పీజీ సీట్ల సంఖ్యలో మార్పులు చేసుకునే వెసులుబాటు కల్పించుకోవాలి. దేశంలో వైద్యవిద్య ఎదుర్కొంటున్న ఇంకో సవాలు, నాణ్యత! వైద్య విద్య బోధనాంశాలను సమీక్షించి, మార్పులు చేయాల్సిన అవసరముంది. ఈ మార్పుల్లో ప్రాక్టికల్ అంశాలపై శ్రద్ధ పెట్టడం ఒకటి. ఇటీవల వార్తా పత్రికల్లో ప్రచురితమైన రెండు వార్తలు పరస్పర విరుద్ధంగా కనిపించాయి. ఒకటేమో ప్రభుత్వం యాభై కొత్త వైద్య కళాశాలలకు అనుమతిచ్చిందన్నది. ఈ రెండు కాలేజీల చేరికతో దేశంలోని మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 1,07,000కు చేరుకుంటుంది. రెండో వార్త ఏమిటంటే, దేశం మొత్తమ్మీద కనీసం 38 వైద్యకళాశాలు తమ గుర్తింపును కొన సాగించేందుకు అవసరమైన ప్రమాణాలను పాటించడం లేదన్నది! ఇంకో వంద కాలేజీలూ ఇదే స్థితిలో ఉన్నట్లు ఈ వార్త చెబుతోంది. నేషనల్ మెడికల్ కమిషన్ మార్గదర్శకాలను ఇవి పాటించడం లేదన్నది ఆరోపణ. సిబ్బంది బయోమెట్రిక్ పద్ధతుల్లో అటెండెన్ ్స ఇవ్వాలన్న అంశంతోపాటు మరికొన్ని ఉల్లంఘనల కారణంగా వీటి గుర్తింపు రద్దయ్యే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. బహుశా ఈ సమస్య కళాశాలల్లో తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల ఉత్పన్నమై ఉండ వచ్చు. లేదా, సిబ్బంది ఒక చోట కాకుండా, మరిన్ని కళాశాలల్లో బోధనకు అంగీకరించి ఉండటమూ కావచ్చు. దేశంలో ప్రస్తుతం ఉన్న వైద్యులు ఎంతమంది? 2002 జూన్ నెలలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి పార్లమెంటుకు ఇచ్చిన సమాధానం ప్రకారం 13,08,009 మంది అల్లోపతి వైద్యులు ఉన్నారు. వీరిలో పదవీ విరమణ చేసినవారు, మరణించిన వారు లేదా ఇతర దేశాలకు వలస వెళ్లినవారు ఉజ్జాయింపుగా 20 శాతం మంది ఉన్నారని అనుకున్నా ప్రస్తుతం పది లక్షలకుపైగా వైద్యులు అందుబాటులో ఉన్నట్లు తేలుతుంది. ఆయుష్ వైద్యులు 5.75 లక్షల మందిని కూడా చేర్చితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉన్నట్లు అవుతుంది. 2014లో దేశంలోని మొత్తం వైద్య కళాశాలలు 387 కాగా, ఇప్పుడు ఆ సంఖ్య 695కి చేరింది. మరో 75 జిల్లా ఆసుపత్రులను వైద్యకళాశాలలుగా మార్చేందుకు ఇటీవలే ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటిల్లో కొన్నింటిని ఇప్పటికే మార్చేశారు కూడా. జిల్లా ఆసుపత్రి కానీ, ఈఎస్ఐ ఆసుపత్రి కానీ రాత్రికి రాత్రి వైద్య కళా శాలగా మారిపోదు. ఇందుకు శిక్షణ పొందిన సిబ్బంది, మౌలిక సదుపాయాల కూర్పు వంటి అనేక మార్పులు, చేర్పులు అవసర మవుతాయి. దేశంలో ఇప్పటిమాదిరిగానే రాన్నున ఐదు, ఏడేళ్లలో ఏటా ఒక లక్ష మంది కొత్త ఎంబీబీఎస్ వైద్యులు అందుబాటులోకి వస్తారని అనుకుందాం. అప్పటికి దేశ జనాభా సుమారు 150 కోట్లకు చేరుకుంటుంది. వైద్యుల సంఖ్య కూడా 15 లక్షల వరకూ ఉంటుంది. కాబట్టి ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు అందుబాటులో ఉంటాడు. ఈ దశలోనే పరిస్థితులు ఆసక్తికరంగా మారతాయి. ఏటా ఎంతమంది వైద్యులు అవసరం? వారందరితో సమర్థంగా పనిచేయించుకోగల పరిస్థితులు ఉన్నాయా? ప్రస్తుతం ఒక ఎంబీబీఎస్ విద్యార్థికి ప్రాక్టికల్ అంశాలపై అవ గాహన నాస్తి. ఎందుకంటే పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులో చేరడమెలా అన్నదానిపైనే విద్యార్థి దృష్టి కేంద్రీకృతమై ఉంటోంది. కానీ ఎంబీబీఎస్ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు మూడొంతుల వరకూ తక్కువ. అయినా ఎంబీబీఎస్ చదివిన వారిలో అత్యధికులు పీజీ కోసం పోటీపడుతూంటారు. పడాలి కూడా. సహజ సామర్థ్యం, అభిరుచు లకు అనుగుణంగా పీజీ కోర్సులను ఎంచుకునే సౌలభ్యమూ వారికి ఉండాలి. ప్రాంతీయ, దేశ అవసరాలకు తగ్గట్టుగా పీజీ సీట్ల సంఖ్యలో మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు కల్పించుకోవాలి. ఉదాహరణకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు ఫ్యామిలీ మెడిసిన్ లో పీజీ చేసిన వారిని ఎంపిక చేయవచ్చు. బోధన, పరిశోధనల పట్ల ఆసక్తి ఉన్నవారిని వైద్య కళాశాలలకు ఉపాధ్యాయులుగా శిక్షణ అందించాలి. ఆరోగ్య రంగంలో నగర, గ్రామీణ ప్రాంతాల మధ్య తీవ్ర అంతరం ఉంటోంది. మూడింట రెండొంతుల జనాభా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నా, అక్కడ పనిచేస్తున్న వైద్యులు మొత్తం వైద్యుల్లో 30 శాతాన్ని కూడా చేరడం లేదు. గ్రామీణ ఆరోగ్య రంగ గణాంకాల ప్రకారం 2021– 22లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది కొరత యాభై శాతం కంటే ఎక్కువే! అంతేకాదు... రాష్ట్రాల వారీగా చూసినా ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పంపిణీలో తేడా ఉంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, ఢిల్లీలతో పోల్చితే... జార్ఖండ్, యూపీ, బిహార్ రాష్ట్రాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఇంకో ఆసక్తికరమైన అంశం... కర్ణాటకలోని మొత్తం వైద్యుల్లో 40 శాతం రాజధాని బెంగళూరులోనే ఉండటం! ఫలితంగా అనేక గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం ఇప్పటికీ దూరంగానే ఉంటోంది. కేంద్ర ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్లను పెంచాలన్న విధాన నిర్ణయం తీసుకోవటం అసలు లక్ష్యమేమిటి? నగరాల్లో తగినంత మంది వైద్యులు అందుబాటులోకి వచ్చిన తరువాత గ్రామీణ ప్రాంత అవసరాలను తీర్చడమా? మౌలిక సదుపాయాలు లేకపోవడం అనే కారణంతో చాలామంది వైద్యులు పల్లె ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడరు. పల్లెల్లో పనిచేస్తే పెట్టిన పెట్టుబడికి తగిన రాబడి లేదన్న భావన కూడా కొంతమంది వైద్యుల్లో, మరీ ముఖ్యంగా ప్రైవేట్ కాలేజీల్లో చదివిన వారిలో ఉంటుంది. దేశంలో వైద్యవిద్య ఎదుర్కొంటున్న ఇంకో సవాలు, నాణ్యత! వైద్య విద్య బోధనాంశాలను అప్పుడప్పుడు సమీక్షించి, మార్పులు చేయాల్సిన అవసరముంది. ఈ మార్పుల్లో ప్రాక్టికల్ అంశాలపై శ్రద్ధ పెట్టడం ఒకటి. కొత్త కాలేజీలు ఏర్పాటవుతున్నంత వేగంగా మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదు. చాలా రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషలిస్టుల పోస్టులకు దరఖాస్తులే రాకపోవడం దీనికి ఒక ఉదాహరణ! తగిన మౌలిక సదుపాయాలు, పరికరాలు, పనిచేసుకునేందుకు తగినంత స్వేచ్ఛ ఉన్న ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో మాత్రం ఈ పరిస్థితి లేదు. ఎంబీబీఎస్‌లోకి ప్రవేశాలను నియంత్రించేందుకు ‘నీట్’ ద్వారా గట్టి ప్రయత్నమే జరిగింది. అయితే సగం కాలేజీలు ప్రైవేట్‌వి కావడం, అక్కడి విద్యార్థుల ర్యాంకులు అతి తక్కువగా ఉండటం వల్ల దేశంలోని విద్యా ప్రమాణాల్లో సమానత లేదని తెలుస్తుంది! టెలి మెడిసిన్ టెక్నాలజీ ద్వారా దేశం మొత్తమ్మీద ఒకే రకమైన వైద్య విద్యను ఎందుకు అందించలేకపోతున్నామన్నది ప్రశ్న! ఏతావతా... దేశంలో వైద్యవిద్యను సమూలంగా మార్చాల్సిన అవసరముంది. 1910లో ఫ్లెక్స్నర్ నివేదిక తరువాత అమెరికాలో జరిగిన మార్పుల మాదిరిగా అన్నమాట. అప్పట్లో బోధనాంశాలు మొత్తాన్ని రివైజ్ చేశారు. కాలేజీల సంఖ్యను 155 నుంచి తగ్గించారు. ప్రతి అంశానికి సంబంధించిన కనీస ప్రమాణాలు, శిక్షణ, అవధులను నిర్ణయించారు. తరువాతి కాలంలో కెనడా, యూరప్‌లలోనూ ఇదే పద్ధతిని అనుసరించడం గమనార్హం. భారత్‌లో వైద్య కళాశాలల సంఖ్యను హేతుబద్ధీకరించాల్సిన అవసరముంది. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని ఎంబీబీఎస్ వైద్యులు, స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులను సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు 2025లో మనకు చిన్న పిల్లల వైద్యులు, కంటి వైద్యుల అవసరం ఎక్కువ అనుకుందాం. అదే సమయంలో ఐదేళ్ల తరువాత న్యూరోసర్జన్లు, ఫిజీషియన్ల అవసరం ఉందని అనుకుంటే... అందుకు తగ్గట్టుగా పీజీ కోర్సులు, సీట్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు చేసుకోవాలి. రాకేశ్ కోచర్ వ్యాసకర్త ఇండియన్ సొసైటీ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ మాజీ అధ్యక్షులు(‘ద ట్రిబ్యూన్’ సౌజ్యంతో) -
ఆరోగ్య రంగంపై వ్యయాలు పెరగాలి
న్యూఢిల్లీ: ఆరోగ్య రంగంపై ప్రభుత్వ వ్యయాలు పెరగాల్సిన అవసరం ఉందని 15వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్కే సింగ్ బుధవారం స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఈ విలువ కేవలం 0.95 శాతం ఉందని పేర్కొన్న ఆయన, 2024నాటికి ఇది 2.5 శాతానికి చేరాలని సూచించారు. దురదృష్టవశాత్తూ, ఆరోగ్య రంగానికి సంబంధించి దేశంలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఆసియా హెల్త్ 2020 అనే అంశంపై పారిశ్రామిక వేదిక సీఐఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో సింగ్ మాట్లాడారు. ఆరోగ్య రంగంలో సవాళ్లను ఏ ఒక్కరో ఎదుర్కొనలేరనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ... ఈ రంగంపై కేటాయింపులను గణనీయంగా పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వాల నుంచి చర్యలు ఉంటాయని తాను విశ్వసిస్తున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఎంబీబీఎస్ కోర్సు పరిధి పెంచడం వంటి రెగ్యులేటరీ మార్పులను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం... ఆరోగ్య సేవల రంగంలో ప్రైవేటు రంగం భాగస్వామ్యం కూడా కీలకమని సింగ్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వినూత్న నైపుణ్యలతో ప్రైవేటు రంగం చక్కటి సేవలను అందించగలుగుతుందన్న విశ్వాసాన్ని వెలిబుచ్చారు. ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో మంచి ఫలితాలను సాధించవచ్చని అన్నారు. కోవిడ్–19ను ఎదుర్కొనడంలో ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్స్ కీలకపాత్ర పోషించారని పేర్కొన్న సింగ్, ఆరోగ్య సేవల విషయంలో మరింత గుర్తింపు లభించడానికి వారు అర్హులని అన్నారు. ‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్’ ప్రస్తావన ‘‘ఆల్ ఇండియా మెడికల్ సర్వీస్ ఏర్పాటవుతుందని 1951 సివిల్ సర్వీసెస్ యాక్ట్ పేర్కొంది. ఆశ్చర్యకమైన విషయం ఏమిటంటే, అప్పటి నుంచీ ఈ తరహా సర్వీస్ ఏదీ ఏర్పాటు కాలేదు’’ అని సందర్భంగా పేర్కొన్న సింగ్, అంతర్జాతీయ ప్రమాణాలు, ఇప్పటికే చోటుచేసుకున్న పరిణా మాలు, ఉదాహరణల ప్రాతిపదికన ఈ సర్వీసు ఏర్పాటుకావాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆరోగ్యం రంగం పలు సమస్యలు, సవాళ్ల వలయంలో చిక్కుకుందనీ వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ తరహాలో ఇండియన్ మెడికల్ సర్వీస్ (ఐఎంఎస్)ను ఏర్పాటు చేయాలని ఇండియన్ మెడికన్ అసోసియేషన్ (ఐఎంఏ) గత కొంత కాలంలో డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2021–22 నుంచి 2025–26 మధ్య దేశ ఆర్థిక రంగంలో తీసుకోవాల్సిన చర్యలపై సింగ్ నేతృత్వంలోని 15వ ఫైనాన్స్ కమిషన్ ఇప్పటికే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీలకు తన సిఫారసులను సమర్పించిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత నివేదికాంశాలు వెల్లడవుతాయి. -
పాతికేళ్ళ సంస్కరణల గుణపాఠాలు
ప్రపంచంలోని పేదలలో సగానికి పైగా ఇండియాలోనే. ప్రాథమిక ఆరోగ్యం, వైద్యరంగాల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలుగుతోంది. నిరుద్యోగం యువతను పీడిస్తూనే ఉంది. ఆర్థిక సంస్కరణలలో మానవీయకోణం కనిపించడం లేదని పదవీ విరమణ చేసిన తర్వాత పీవీ అంటూ ఉండే వారు. ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అంటూ ఆయన ప్రతిపాదించిన సూత్రం ఎక్కడో ఆగిపోయింది. ‘పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?’ కేబినెట్ సెక్రటరీ నరేశ్‌చంద్ర ఇచ్చిన నోట్ చదివిన మీదట ప్రధాని పీవీ నరసింహారావు ప్రశ్న. ‘లేదు సర్. అంతకంటే అధ్వానంగా ఉంది’ అని రమేశ్చంద్ర జవాబు. ఆ నోటు చదివిన తర్వాత కొన్ని గంటలలోనే ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని పీవీ నిర్ణయించారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ రాసిన గ్రంథం ‘టు ది బ్రింక్ అండ్ బ్యాక్-ఇండియాస్ 1991 స్టోరీ’లో ఈ ఉదంతం వివ రంగా ఉంది. ఆర్థిక సంస్కరణల అమలు జరిగిన విధంపైన మొట్టమొదట వచ్చిన పుస్తకం గురుచరణ్‌దాస్ రచించిన ‘ఇండియా అన్బౌండ్’. తాజా పుస్తకం వినయ్ సీతాపతి రచన ’పీవీ నరసింహారావు-హాఫ్ లయన్’. నాటి ప్రధాని కార్యాలయంలో ప్రత్యేకాధికారిగా పనిచేసిన జైరాం ఆర్థిక సంస్కరణ లకు ప్రత్యక్ష సాక్షి. సరిగ్గా పాతికేళ్ళ కిందట ఇదే రోజు (జూలై 24, 1991) కేంద్ర ఆర్థికమంత్రి మన్మోహన్సింగ్ తొలి సంస్కరణల బడ్జెట్ ప్రతిపాదనలను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మన్మోహన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే ‘సమయం ఆసన్నమైన ఆలోచనను ప్రపంచంలో ఏ శక్తీ నిలువరించలేదు’ అంటూ విక్టర్ హ్యూగోని ఉటంకించారు. ‘ఆర్థికశక్తిగా భారత్ ఎదగాలన్నది అటువంటి ఆలో చనలలో ఒకటి’ అని ప్రకటించారు. (’Victor Hugo said no power on earth can stop an idea whose time has come. I suggest to this August House that emergence of India as a major economic power in the world happens to be one such idea. Let the whole world hear loud and clear. India is now wide awake. We shall prevail. We shall overcome!’). ఈ చారిత్రక ఘట్టం తర్వాత పాతి కేళ్ళు కాలగర్భంలో కలసిపోయాయి. పీవీ-మన్మోహన్ ద్వయం ఆశించినట్టు ఇండియా ఆర్థికశక్తిగా ఎదిగే క్రమంలో వేగంగా ముందుకు పోతోంది. ఆర్థిక సంస్కరణలు అనివార్యమైన పరిస్థితి దాపురించిన పాడురోజులను తలచు కుంటే సంస్కరణలు దేశానికి చేసిన మేలు అర్థం అవుతుంది. దిగుమతులకు విదేశీ మారకద్రవ్యం చెల్లించలేని దుస్థితిలో దేశం ఉన్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్యసంస్థ (ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్-ఐఎంఎఫ్)తో చేసుకున్న ఒప్పందం ప్రకారం చంద్రశేఖర్ ప్రభుత్వం యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జ ర్లాండ్‌లో, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో బంగారం కుదువపెట్టవలసి వచ్చింది. అప్పటికి రెండు, మూడు వారాలకే బొటాబొటి సరిపోను విదేశీమారకద్రవ్యం నిల్వలు ఉన్నాయి. నిజానికి నరేశ్‌చంద్ర పీవీకి చూపించిన నోటు చంద్రశేఖర్ ప్రభుత్వ పరిశీలన కోసం మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా తయారుచేసింది. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణతో చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ నోట్లోని అంశాలను అమలు చేసే అవకాశం లేకపోయింది. 1991 ఎన్నికలు మొదటి దశ ముగిసి రెండవ దశకు ప్రచారంలో ఉండగా శ్రీపెరంబుదూరులో ఎల్టీటీఈ ప్రయోగించిన మానవబాంబు విస్ఫోటనంలో రాజీవ్ మరణిం చారు. సన్యాసం స్వీకరించి కుర్తాళం పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమైన పీవీకి ఆ విధంగా రాజయోగం పట్టింది. ఆర్థిక సంస్కరణలు అమలు చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అపూర్వమైన అవకాశం దక్కింది. అందరిదీ అదే బాట సంస్కరణల బాటలో రెండున్నర దశాబ్దాలు నిర్నిరోధంగా ప్రయాణం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. పరిస్థితిని సమీక్షించుకోవాలి. పీవీ హయాంలో ప్రారంభమైన సంస్కరణలనే వాజ్‌పేయి, మన్మోహన్సింగ్ కొనసాగించారు. నరేంద్రమోదీ సమధికోత్సాహంతో సంస్కర ణలను వేగవంతం చేస్తున్నారు. ఆర్థిక విధానంలో రెండు జాతీయ పక్షాలకూ భావసామ్యం ఉండటం వల్ల సంస్కరణలకు విఘాతం కలగలేదు. నాటి ఇండియా అభివృద్ధి చెందిన దేశాల బృందం జి-77 కి నాయకత్వం వహించింది. నేడు అభివృద్ధి చెందిన దేశాల సరసన జి-20లో కూర్చున్నది. ఈ రోజు చైనా కంటే వేగంగా పెరుగుతున్న ఆర్థికవ్యవస్థగా ముందు వరుసలో ఉంది. నాడు తలసరి ఆదాయం 375 డాలర్లు ఉండగా ఇప్పుడు 1,700 డాలర్లు. కొనుగోలు శక్తిని ప్రాతిపదికగా తీసుకుంటే చైనా, అమెరికాల తర్వాత స్థానం ఇండియాదే. 2004 నుంచి 2011 వరకూ దేశంలో 13.8 కోట్ల మంది దారిద్య్ర రేఖ దాటుకొని పైకి వచ్చారు. పేదరికం నిర్మూలన చైనాలో కంటే వేగంగా ఇండియాలో జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. నాడు భారతదేశంలోని కంపె నీలు బహుళజాతి కంపెనీలు వస్తే తమను మింగేస్తాయని బెదిరిపోయేవి. ఇప్పుడు భారతీయ కంపెనీలు బహుళజాతి సంస్థలుగా వర్థిల్లుతున్నాయి. వాణిజ్యంలో సంస్కరణలకు పూర్వం కొన్ని కుటుంబాలదే హవా. 1940లో ఏ కుటుంబాలు (టాటా, బిర్లా వగైరా) వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో ముందు న్నాయో 1990లో కూడా అవే కుటుంబాలు ఉన్నాయి- ధీరూభాయ్ అంబానీ మినహా. సంస్కరణల పుణ్యమా అని ప్రేమ్‌జీ, నారాయణమూర్తి వంటి ప్రతిభా వంతులు మెగా ఐటీ సంస్థలను నిర్మించగలిగారు. నెహ్రూ, పీసీ మహలనొ బిస్ల ఆలోచనల ఫలితంగా పంచవర్ష ప్రణాళికలతో, మిశ్రమ ఆర్థిక విధానా లతో, సోషలిస్టు భావాలతో ప్రారంభమైన ప్రయాణం ఇందిరాగాంధీ హయాంలో సోషలిజాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చే వరకూ వెళ్ళింది. 1950 లలోనే మన ఆర్థికవ్యవస్థను ‘లెసైన్స్రాజ్’ అంటూ చక్రవర్తుల రాజగోపాలా చారి ఎద్దేవా చేశారు. ఇది అవినీతికీ, అసమర్థతకూ దారితీస్తుందంటూ జోస్యం కూడా చెప్పారు. ప్రముఖ ఆర్థికవేత్త, నెహ్రూ అభిమాని రాజ్‌కృష్ణ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న తీరును ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’ అంటూ అభివర్ణించారు. హిందూ ఆచారాలకూ, సంప్రదాయాలకూ తగినట్టు సాదా సీదాగా అభివృద్ధి ఉన్నదనీ, దేశం నెహ్రూని విఫలం చేసింది కానీ నెహ్రూ దేశాన్ని విఫలం చేయలేదనీ ఆయన వాదన. నెహ్రూ హయాంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) అభివృద్ధి రేటు 4.8 శాతం ఉండేది. ఇందిర పాలనలో ఆత్యయిక పరిస్థితి వరకూ (1965-1975) అది 3.4 శాతానికి తగ్గింది. 1975 నుంచి 1984 వరకూ 4.2కు పెరిగింది. 1984 నుంచి 1995 వరకూ 5.9 శాతానికీ, 1995 నుంచి 2005 వరకూ 7.1 శాతానికీ, 2004-05 నుంచి 2013-14 వరకూ 8.3 శాతానికీ పెరిగింది. ఈ లెక్కల ప్రకారం ఆర్థిక సంస్కరణలు దేశానికి గొప్ప మేలు చేశాయనే చెప్పాలి. చైనాతో పోటీయా? ఇప్పుడు చైనాతో పోటీపడాలనీ, ప్రపంచంలోనే మూడవ ఆర్థికశక్తిగా ఎదగాలనీ కలలు కంటున్నాం. ఈ అభివృద్ధి కథ యావత్తూ నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇది చాలా ఆశాజనకం, ఆనందదాయకం. కానీ, నాణేనికి మరోవైపున ఏము న్నదో తెలుసుకుంటే ఆవేశం తగ్గి ఆలోచన మొదలవుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థలో మన ఆర్థికవ్యవస్థ విలువ అయిదింట ఒక వంతు మాత్రమే. చైనాను అందుకోవడం అంత తేలిక కాదు. ప్రగతి రేటూ, విదేశీమారకద్ర వ్యం నిల్వలూ పెరగడాన్ని అభివృద్ధికి సంకేతంగా పరిగణిస్తున్నాం. నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ అభివృద్ధి రేటును లెక్కించడానికి ప్రాతిపదికగా తీసుకునే సంవత్సరాన్ని 2011-12కు జరపడం వల్లనే ఎక్కువ రేటు కనిపిస్తున్నదంటూ దేశంలోనూ, విదేశాలలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విదేశీమారక ద్రవ్యం నిల్వలు పెరుగుతున్నది మనం దిగుమతులకు ఖర్చు చేసే నిధులకంటే ఎగుమతుల ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నందువల్ల కాదు. నిజానికి, ఇప్పటికీ మన దిగుమతుల విలువ ఎగుమతుల విలువ కంటే అధికం. అంటే విదేశీ మారకద్ర వ్యం సంక్షోభంలో దేశం ఉండాలి. కానీ నిల్వలు ఉన్నాయి. కారణం ఏమిటి? మన దేశంలో పెట్టుబడి పెడుతున్నవారు విదేశీమారకద్రవ్యం కుప్పలు తెప్పలుగా తెస్తున్నారు. 2004కు పూర్వం విదేశీమారకద్రవ్యం విదేశాల నుంచి 800 కోట్ల నుంచి 1,500 కోట్ల డాలర్లు వచ్చింది. 2007-08 నాటికి అది 6000 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ నిల్వలు ఉన్నాయి. అంటే నిల్వలు మనం సంపాదించుకున్నవి కావు. అరువు తెచ్చుకున్నవి. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు విదేశీమారకద్రవ్యం గురించీ, అభివృద్ధి గురించే ఆలోచించారు కానీ వ్యవసాయరంగంపైన దృష్టి పెట్టలేదు. పత్తి పంట 1998 నుంచి తెలంగాణలో, విదర్భలో లక్షల ప్రాణాలు బలి తీసుకున్నది. ఉత్పాదకరంగంలో స్తబ్దత సంస్కరణలు భేషంటూ ప్రశంసించినవారు ప్రగతిపథంలో పరిశ్రమలూ, ఉత్పా దకరంగం ముందుంటాయని నమ్మబలికారు. లెసైన్స్-పర్మిట్‌రాజ్‌ను రద్దు చేసిన తర్వాత పరిశ్రమలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని భావించారు. నిజానికి అభివృద్ధి చెందిన ఇతర దేశాలలో అదే జరిగింది. 2010లో చైనా జీడీపీలో ఉత్పాదక రంగానికి 47శాతం, ఇండొనేషియాలో 47 శాతం, దక్షిణ కొరి యాలో 39 శాతం, మలేసియాలో 44 శాతం, థాయ్‌ల్యాండ్‌లో 45 శాతం ఉంటే ఇండియాలో 27 శాతం. రెండు దశాబ్దాలుగా పారిశ్రామికరంగంలో ఎదుగూ బొదుగూ లేదు. నేరుగా విదేశీ పెట్టుబడులు (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్-ఎఫ్‌డీఐ) రూపంలో 2000 నుంచి 2015 వరకూ దేశంలోకి వచ్చిన 25,800 కోట్ల డాలర్లలో 49 శాతం ఫిలిప్పీన్స్, సింగపూర్ మార్గంలో వచ్చినవేనని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ పరిశోధనలో తేలింది. పన్ను ఎగగొట్టడానికి ఈ మార్గం ఎంచు కున్నవారు విదేశీయులు కావచ్చు. మన దేశానికి చెందిన పెట్టుబడిదారులు కావచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సింగపూర్‌ను ఆకాశానికి ఎత్తు తుంటే ఆందోళన కలుగుతోంది. ఎఫ్డీఐలో కూడా ఉత్పాదక రంగంలోకి వెడుతున్నది 30 శాతం మాత్రమే. ప్రాథమిక సౌకర్యాల (ఇన్ఫ్రాస్ట్రక్చర్) రంగా నికీ, బడావ్యాపార సంస్థలకే ప్రభుత్వ రంగంలోని వాణిజ్య బ్యాంకులు సైతం ఉదారంగా రుణాలు ఇస్తున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యం లేదు. ప్రధాని నరేంద్రమోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం తర్వాత కూడా పరిస్థితి మారలేదు. ప్రపంచంలోని పేదలలో సగానికి పైగా ఇండియాలోనే. ప్రాథమిక ఆరోగ్యం, వైద్య రంగాల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలుగుతోంది. నిరు ద్యోగం యువతను పీడిస్తూనే ఉంది. ఆర్థిక సంస్కరణలలో మానవీయకోణం కనిపించడం లేదని పదవీ విరమణ చేసిన తర్వాత పీవీ అంటూ ఉండే వారు.‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అంటూ ఆయన ప్రతిపాదించిన సూత్రం ఎక్కడో ఆగిపోయింది. ఆర్థికంగా పెరిగాం. మానవీయ కోణంలో ఎదగలేదు. ఆర్థికాభివృద్ధి ఫలితాలు పేదలకు అందడం లేదు. సమాజంలో అంతరాలు భయంకరంగా పెరుగుతున్నాయి. నేర ప్రవృత్తి హెచ్చుతోంది. ఈ పరిస్థితులు మారే వరకూ ఆర్థిక సంస్కరణల వల్ల ప్రయోజనం ఉండదు. - కె.రామచంద్రమూర్తి సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్ -
పన్ను మినహాయింపు పరిమితి రూ.4 లక్షలకు పెంచండి
కేంద్రానికి అసోచామ్ సూచన న్యూఢి ల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రానున్న బడ్జెట్లో రూ.4 లక్షలకు పెంచాలని పరిశ్రమ సమాఖ్య అసోచామ్ కేంద్రాన్ని కోరింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ప్రస్తుతం పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలుగా ఉంది. సేవింగ్స్‌కు సంబంధించి మరిన్ని ప్రోత్సాహకాలను అందించాలని పేర్కొంది. విద్య, ఆరోగ్య రంగాలపై ప్రభుత్వ నిధుల కేటాయింపు పెరగాల్సి ఉందని తెలిపింది. అసోచామ్ ఇటీవల ‘ఆమ్ ఆద్మీ’ పేరుతో ఒక సర్వే నిర్వహించింది. ఇందులో పాల్గొన్న 87% మంది పన్ను మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. నిత్యావసర జీవన ప్రమాణ ధరల పెరుగుదల నేపథ్యంలో పరిమితి పెంపు ఆవశ్యకమని అసోచామ్ పేర్కొంది. ప్రస్తుతం సెక్షన్ 80డీ ప్రకారం ఉన్న వార్షిక మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు పరిమితిని రూ.15,000 నుంచి రూ.50,000 వరకు పెంచాలని సర్వేలో పాల్గొన్న 88 శాతం మంది అభిప్రాయపడ్డారు. పిల్లల చదువు ఖర్చుల పరిమితిని కూడా నెలకు రూ.100 నుంచి రూ.1,000 వరకు పెంచాలని అసోచామ్ పేర్కొంది. అలాగే ప్రసు ్తతం ఇద్దరి పిల్లలకు ఇస్తున్న హాస్టల్ ఖర్చుల పరి మితిని నెలకు రూ.300 నుంచి రూ.3,000 వరకు పెంచాలని తెలిపింది. ఇంటి రుణాల వడ్డీరేట్లు పెరుగుతుండటం, ప్రాపర్టీ ధరలు ఎగయడం వంటి అంశాల నేపథ్యంలో వ్యక్తిగత ప్రాపర్టీ వడ్డీరేట్ల మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలని పేర్కొంది. -
వడివడిగా పడిపోయాం
వైద్యం, విద్య.. కీలక రంగాల్లో రాష్ర్టం వెనుకబడినట్లు ప్రణాళికా సంఘం వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సర్కారు చెబుతున్నా మరో పక్క కేంద్ర ప్రణాళికా సంఘం మాత్రం కీలకరంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉందని స్పష్టంచేసింది. ఇటీవల దేశంలోని 21 రాష్ట్రాల్లో ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల రంగాల్లో ప్రభుత్వాల పనితీరును గతంతో పోల్చుతూ ప్రణాళికా సంఘం అధ్యయనం చేసింది. ఈ మూడు రంగాల్లో 2009-10 ఆర్థిక సంవత్సరం కన్నా ముందున్న ర్యాంకులను, అధ్యయనం తరువాత ర్యాంకులను నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా ఆ నివేదికలో ప్రణాళికా సంఘం ఆసక్తికర వ్యాఖ్యలను కూడా చేసింది. ఈ ర్యాంకుల ఆధారంగా ఆయా ప్రభుత్వాల పనితీరును ఓటర్లు అంచనా వేసుకోవచ్చంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ అధ్యయనం చేసింది. ర్యాంకుల వారీగా 21 రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించింది. నివేదికలోని ముఖ్యాంశాలు... - ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల రంగాల్లో ఆంధ్రప్రదేశ్ గతంలో కన్నా వెనకబడిపోయింది. - ఆరోగ్య రంగంలో రెండో కేటగిరి రాష్ట్రాల్లో ఏపీ చోటు దక్కించుకోగా విద్యలో మాత్రం మూడో కేటగిరి రాష్ట్రాల జాబితాల్లోకి వెళ్లింది. - మౌలిక వసతుల్లో రెండో కేటగిరీ రాష్ట్రాల్లో ఏపీ నిలిచింది. - ఆరోగ్య రంగంలో గతంలో రాష్ర్టం 8వ ర్యాంకులో ఉండగా ఇప్పుడు 11కు పడిపోయింది. అయితే ఈ రంగంలో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, బీహార్, కర్ణాటకలు తమ స్థానాలను మెరుగుపరుచుకొని ఏపీ కన్నా ముందంజలో ఉన్నాయి. శిశు మరణాలు, వైద్య చికిత్సల అందుబాటు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. - విద్యలో రాష్ట్రం దారుణంగా దిగజారింది. గతంలో 12వ ర్యాంకులో ఉండగా, ఇప్పుడు 20కి పడిపోయింది. నాణ్యమైన విద్య, ఎన్రోల్మెంట్ శాతం, వసతులు ఆధారంగా అధ్యయనం చేశారు. -మౌలిక వసతుల రంగంలో గతంలో 10వ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 14కు దిగజారింది. వ్యవసాయ, విద్యుత్, రవాణా రంగాల్లో వసతుల ఆధారంగా అధ్యయనం చేసి ర్యాంకులు ఇచ్చారు. -
కొత్త ఏడాదిలో..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రతి శాఖలో చేయాల్సిన పనులకు ప్రణాళికను రూపొందించామని, కొత్త సంవత్సరంలో ఆ మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న చె ప్పారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై దృష్టి సారిస్తామన్నారు. 500 అంగన్వాడీ కేంద్రాలకు నూతన భవనాలను నిర్మించనున్నట్లు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీరు, మరుగుదొడ్ల వసతి కల్పించనున్నామన్నారు. పది అంగన్వాడీ ప్రాజెక్టులకు గాను ఆరు ప్రా జెక్టుల్లో అమృతహస్తం పథకాన్ని కొనసాగిస్తున్నామని, మరో రెండింటిని ఈ పథకంలోకి తీసుకు రానున్నట్లు పేర్కొన్నారు.ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ప్రసవాల కోసం వెళ్లే గర్భిణులకు 108 వాహన సౌకర్యం కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 75 శాతం ప్రసవాలు జరిగే విధంగా చర్య లు చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ట్రామా కేర్ సెంటర్‌ను విస్తరింపచేస్తామన్నారు. ఉత్తీర్ణత శాతాన్ని పెంచుతాం.. పదవ తరగతి పరీక్షల్లో జిల్లా ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు కృష్టి చేస్తామన్నారు. పదవ తరగ తి పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను నివారిస్తామన్నారు. పాఠశాలల్లో తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. రెండు వందల పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టామన్నారు. జిల్లాలో ఐదు ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ. 2.2 కోట్లతో బీసీ స్టడీ సర్కిల్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. తద్వారా 9 లక్షల మంది బీసీ విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నా రు.ఉపాధి హామీ పథకం కింద రూ. 155 కోట్లు ఖర్చు చేశామని కలెక్టర్ తెలిపారు. కొత్త సంవత్సరంలో రూ. 190 కోట్లు ఉపాధి హామీ పను ల కోసం ఖర్చు చేసేందుకు ప్రణాళి కను రూ పొందిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించనున్న కలెక్టరేట్ భవన సముదాయానికి రూ. 23 కోట్లతో ప్రతిపాదనలు పంపామని తెలి పారు. వ్యక్తిగత మరుగుదొడ్లు 1.50 లక్షలు నిర్మిం చేందుకు కృషి చేస్తున్నామని, వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. రబీ సీజన్లో రైతులకు రూ. 768 కోట్ల పంట రుణాలకు గాను రూ. 1000 కోట్లు పెంచి ఇవ్వాలని నిర్ణయిం చగా ఇప్పటి వరకు రూ. 350 కోట్లు రైతులకు పంపిణీ చేసినట్లు తెలి పారు. బ్యాంక్ లింకేజీ కింద మహిళా గ్రూపులకు రూ. 426 కోట్లకు గాను ఇప్పటి వరకు రూ. 160 కోట్లు అందజేసినట్లు తెలిపారు. శ్రీనిధి కింద ఇప్పటి వరకు రూ. 82 కోట్లు ఇచ్చామని, మార్చి నాటికి రూ. 120 కోట్ల వరకు అందజేయగలమన్నారు. ఈ ఏడాదిలో ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం 19,500 కాగా ఇప్పటి వరకు 7వేల ఇళ్లు పూర్తి చేశామని తెలిపారు. నిజామాబాద్ బైపాస్ రోడ్డును ఫిబ్రవరి కల్లా పూర్తి చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు. ఆర్అండ్బీ పరిధిలోని రోడ్లను మార్చి కల్లా పూర్తి చేస్తామన్నా రు. ఆర్మూర్, కామారెడ్డి, గాంధారి ప్రాంతాల్లో మంచినీటి పథకాలను వెంటనే పూర్తిచేయగలమన్నారు. సోయాపై బెంగవద్దు.... వచ్చే ఖరీఫ్ సీజన్లో 1.21 లక్షల హెక్టార్లలో సోయాబీన్ సాగవుతుందని అంచనా వేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. 90 వేల క్వింటాళ్ల సాయా విత్తనాలు అవసరం ఉండగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జుక్కల్, ఆర్మూర్ ప్రాం తాల్లో రెండు సోయాబీన్ సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏడవ విడత భూపంపిణీలో భాగంగా 120 ఎకరాలను జనవరి 10 కల్లా పంపిణీ చేస్తామన్నారు. పభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల జవాబుదారీ తనం పెంచడం ద్వారా పారదర్శక పాలనను అందించేందుకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. హాస్టళ్లలో వార్డెన్ల పనితీరును, స్థానికతను గుర్తించేందుకు కాల్సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాల్‌సెంటర్ ద్వారా వార్డెన్లకు అకస్మికంగా ఫోన్ చేయడంతో పాటు హాస్టల్లో ఉండే విద్యార్థులతో మాట్లాడుతామన్నారు. ఉద్యోగులు పనిచేసే చోటే నివాసం ఉండాలనే విధానాన్ని క్రమబద్దంగా అమలు చేయనున్నట్లు తెలిపారు.