వడివడిగా పడిపోయాం
వైద్యం, విద్య.. కీలక రంగాల్లో రాష్ర్టం వెనుకబడినట్లు ప్రణాళికా సంఘం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని సర్కారు చెబుతున్నా మరో పక్క కేంద్ర ప్రణాళికా సంఘం మాత్రం కీలకరంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉందని స్పష్టంచేసింది. ఇటీవల దేశంలోని 21 రాష్ట్రాల్లో ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల రంగాల్లో ప్రభుత్వాల పనితీరును గతంతో పోల్చుతూ ప్రణాళికా సంఘం అధ్యయనం చేసింది. ఈ మూడు రంగాల్లో 2009-10 ఆర్థిక సంవత్సరం కన్నా ముందున్న ర్యాంకులను, అధ్యయనం తరువాత ర్యాంకులను నివేదికలో పేర్కొంది. అంతే కాకుండా ఆ నివేదికలో ప్రణాళికా సంఘం ఆసక్తికర వ్యాఖ్యలను కూడా చేసింది. ఈ ర్యాంకుల ఆధారంగా ఆయా ప్రభుత్వాల పనితీరును ఓటర్లు అంచనా వేసుకోవచ్చంది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ అధ్యయనం చేసింది. ర్యాంకుల వారీగా 21 రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించింది.
నివేదికలోని ముఖ్యాంశాలు...
- ఆరోగ్యం, విద్య, మౌలిక వసతుల రంగాల్లో ఆంధ్రప్రదేశ్ గతంలో కన్నా వెనకబడిపోయింది.
- ఆరోగ్య రంగంలో రెండో కేటగిరి రాష్ట్రాల్లో ఏపీ చోటు దక్కించుకోగా విద్యలో మాత్రం మూడో కేటగిరి రాష్ట్రాల జాబితాల్లోకి వెళ్లింది.
- మౌలిక వసతుల్లో రెండో కేటగిరీ రాష్ట్రాల్లో ఏపీ నిలిచింది.
- ఆరోగ్య రంగంలో గతంలో రాష్ర్టం 8వ ర్యాంకులో ఉండగా ఇప్పుడు 11కు పడిపోయింది. అయితే ఈ రంగంలో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, బీహార్, కర్ణాటకలు తమ స్థానాలను మెరుగుపరుచుకొని ఏపీ కన్నా ముందంజలో ఉన్నాయి. శిశు మరణాలు, వైద్య చికిత్సల అందుబాటు ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు.
- విద్యలో రాష్ట్రం దారుణంగా దిగజారింది. గతంలో 12వ ర్యాంకులో ఉండగా, ఇప్పుడు 20కి పడిపోయింది. నాణ్యమైన విద్య, ఎన్‌రోల్‌మెంట్ శాతం, వసతులు ఆధారంగా అధ్యయనం చేశారు.
-మౌలిక వసతుల రంగంలో గతంలో 10వ ర్యాంకులో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు 14కు దిగజారింది. వ్యవసాయ, విద్యుత్, రవాణా రంగాల్లో వసతుల ఆధారంగా అధ్యయనం చేసి ర్యాంకులు ఇచ్చారు.