పాతికేళ్ళ సంస్కరణల గుణపాఠాలు | government has left from health sectors | Sakshi
Sakshi News home page

పాతికేళ్ళ సంస్కరణల గుణపాఠాలు

Published Sun, Jul 24 2016 2:42 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

పాతికేళ్ళ సంస్కరణల గుణపాఠాలు

పాతికేళ్ళ సంస్కరణల గుణపాఠాలు

ప్రపంచంలోని పేదలలో సగానికి పైగా ఇండియాలోనే. ప్రాథమిక ఆరోగ్యం, వైద్యరంగాల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలుగుతోంది. నిరుద్యోగం యువతను పీడిస్తూనే ఉంది. ఆర్థిక సంస్కరణలలో మానవీయకోణం కనిపించడం లేదని పదవీ విరమణ చేసిన తర్వాత పీవీ అంటూ ఉండే వారు. ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అంటూ ఆయన ప్రతిపాదించిన సూత్రం ఎక్కడో ఆగిపోయింది.
 
 ‘పరిస్థితి ఇంత దారుణంగా ఉందా?’ కేబినెట్ సెక్రటరీ నరేశ్‌చంద్ర ఇచ్చిన నోట్ చదివిన మీదట ప్రధాని పీవీ నరసింహారావు ప్రశ్న. ‘లేదు సర్. అంతకంటే అధ్వానంగా ఉంది’ అని రమేశ్‌చంద్ర జవాబు. ఆ నోటు చదివిన తర్వాత కొన్ని గంటలలోనే ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని పీవీ  నిర్ణయించారు. కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ రాసిన గ్రంథం ‘టు ది బ్రింక్ అండ్ బ్యాక్-ఇండియాస్ 1991 స్టోరీ’లో ఈ ఉదంతం వివ రంగా ఉంది. ఆర్థిక సంస్కరణల అమలు జరిగిన విధంపైన మొట్టమొదట వచ్చిన పుస్తకం గురుచరణ్‌దాస్ రచించిన ‘ఇండియా అన్‌బౌండ్’.
 
 తాజా పుస్తకం వినయ్ సీతాపతి రచన ’పీవీ నరసింహారావు-హాఫ్ లయన్’. నాటి ప్రధాని కార్యాలయంలో ప్రత్యేకాధికారిగా పనిచేసిన జైరాం ఆర్థిక సంస్కరణ లకు ప్రత్యక్ష సాక్షి. సరిగ్గా పాతికేళ్ళ కిందట ఇదే రోజు (జూలై 24, 1991) కేంద్ర ఆర్థికమంత్రి మన్మోహన్‌సింగ్ తొలి సంస్కరణల బడ్జెట్ ప్రతిపాదనలను లోక్ సభలో ప్రవేశపెట్టారు. మన్మోహన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభంలోనే ‘సమయం ఆసన్నమైన ఆలోచనను ప్రపంచంలో ఏ శక్తీ నిలువరించలేదు’ అంటూ విక్టర్ హ్యూగోని ఉటంకించారు. ‘ఆర్థికశక్తిగా భారత్  ఎదగాలన్నది అటువంటి ఆలో చనలలో ఒకటి’ అని ప్రకటించారు.
 
 (’Victor Hugo said no power on earth can stop an idea whose time has come. I suggest to this  August House that emergence of India as a major economic power in the world happens to be one such idea. Let the whole world hear loud and clear. India is now wide awake. We shall prevail. We shall overcome!’). ఈ చారిత్రక ఘట్టం తర్వాత పాతి కేళ్ళు కాలగర్భంలో కలసిపోయాయి. పీవీ-మన్మోహన్ ద్వయం ఆశించినట్టు  ఇండియా ఆర్థికశక్తిగా ఎదిగే క్రమంలో వేగంగా ముందుకు పోతోంది. ఆర్థిక సంస్కరణలు అనివార్యమైన పరిస్థితి దాపురించిన పాడురోజులను తలచు కుంటే సంస్కరణలు దేశానికి చేసిన మేలు అర్థం అవుతుంది. దిగుమతులకు విదేశీ మారకద్రవ్యం చెల్లించలేని దుస్థితిలో దేశం ఉన్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్యసంస్థ (ఇంటర్నేషనల్ మానెటరీ ఫండ్-ఐఎంఎఫ్)తో చేసుకున్న ఒప్పందం ప్రకారం చంద్రశేఖర్ ప్రభుత్వం యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జ ర్లాండ్‌లో, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో బంగారం కుదువపెట్టవలసి వచ్చింది. అప్పటికి రెండు, మూడు వారాలకే బొటాబొటి సరిపోను విదేశీమారకద్రవ్యం నిల్వలు ఉన్నాయి. నిజానికి నరేశ్‌చంద్ర పీవీకి చూపించిన నోటు చంద్రశేఖర్ ప్రభుత్వ పరిశీలన కోసం మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా తయారుచేసింది.
 
 కాంగ్రెస్ మద్దతు ఉపసంహరణతో చంద్రశేఖర్ ప్రభుత్వం కూలిపోయింది. ఆ నోట్‌లోని అంశాలను అమలు చేసే అవకాశం లేకపోయింది. 1991 ఎన్నికలు మొదటి దశ ముగిసి రెండవ దశకు ప్రచారంలో ఉండగా శ్రీపెరంబుదూరులో ఎల్‌టీటీఈ ప్రయోగించిన మానవబాంబు విస్ఫోటనంలో రాజీవ్ మరణిం చారు. సన్యాసం స్వీకరించి కుర్తాళం పీఠాధిపతిగా బాధ్యతలు నిర్వహించేందుకు సిద్ధమైన పీవీకి ఆ విధంగా రాజయోగం పట్టింది. ఆర్థిక సంస్కరణలు అమలు చేసి చరిత్రలో చిరస్థాయిగా నిలిచే అపూర్వమైన అవకాశం దక్కింది.
 
 అందరిదీ అదే బాట
 సంస్కరణల బాటలో రెండున్నర దశాబ్దాలు నిర్నిరోధంగా ప్రయాణం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి. పరిస్థితిని సమీక్షించుకోవాలి. పీవీ హయాంలో ప్రారంభమైన సంస్కరణలనే వాజ్‌పేయి,  మన్మోహన్‌సింగ్ కొనసాగించారు. నరేంద్రమోదీ సమధికోత్సాహంతో సంస్కర ణలను వేగవంతం చేస్తున్నారు. ఆర్థిక విధానంలో రెండు జాతీయ పక్షాలకూ భావసామ్యం ఉండటం వల్ల సంస్కరణలకు విఘాతం కలగలేదు.  నాటి ఇండియా అభివృద్ధి చెందిన దేశాల బృందం జి-77 కి నాయకత్వం వహించింది. నేడు అభివృద్ధి చెందిన దేశాల సరసన జి-20లో కూర్చున్నది.
 
 ఈ రోజు చైనా కంటే వేగంగా పెరుగుతున్న ఆర్థికవ్యవస్థగా ముందు వరుసలో ఉంది. నాడు తలసరి ఆదాయం 375 డాలర్లు ఉండగా ఇప్పుడు 1,700 డాలర్లు. కొనుగోలు శక్తిని ప్రాతిపదికగా తీసుకుంటే చైనా, అమెరికాల తర్వాత స్థానం ఇండియాదే. 2004 నుంచి 2011 వరకూ దేశంలో 13.8 కోట్ల మంది దారిద్య్ర రేఖ దాటుకొని పైకి వచ్చారు. పేదరికం నిర్మూలన చైనాలో కంటే వేగంగా ఇండియాలో జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. నాడు భారతదేశంలోని కంపె నీలు బహుళజాతి కంపెనీలు వస్తే తమను మింగేస్తాయని బెదిరిపోయేవి. ఇప్పుడు భారతీయ కంపెనీలు బహుళజాతి సంస్థలుగా వర్థిల్లుతున్నాయి. వాణిజ్యంలో సంస్కరణలకు పూర్వం కొన్ని కుటుంబాలదే హవా. 1940లో ఏ కుటుంబాలు (టాటా, బిర్లా వగైరా) వాణిజ్య, పారిశ్రామిక రంగాలలో ముందు న్నాయో 1990లో కూడా అవే కుటుంబాలు ఉన్నాయి- ధీరూభాయ్ అంబానీ మినహా. సంస్కరణల పుణ్యమా అని ప్రేమ్‌జీ, నారాయణమూర్తి వంటి ప్రతిభా వంతులు మెగా ఐటీ సంస్థలను నిర్మించగలిగారు.
 
 నెహ్రూ, పీసీ మహలనొ బిస్‌ల ఆలోచనల ఫలితంగా పంచవర్ష ప్రణాళికలతో, మిశ్రమ ఆర్థిక విధానా లతో, సోషలిస్టు భావాలతో ప్రారంభమైన ప్రయాణం ఇందిరాగాంధీ హయాంలో సోషలిజాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చే వరకూ వెళ్ళింది. 1950 లలోనే మన ఆర్థికవ్యవస్థను ‘లెసైన్స్‌రాజ్’ అంటూ చక్రవర్తుల రాజగోపాలా చారి ఎద్దేవా చేశారు.  ఇది అవినీతికీ, అసమర్థతకూ దారితీస్తుందంటూ జోస్యం కూడా చెప్పారు. ప్రముఖ ఆర్థికవేత్త, నెహ్రూ అభిమాని రాజ్‌కృష్ణ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతున్న తీరును ‘హిందూ రేట్ ఆఫ్ గ్రోత్’ అంటూ అభివర్ణించారు.
 
 హిందూ ఆచారాలకూ, సంప్రదాయాలకూ తగినట్టు సాదా సీదాగా అభివృద్ధి ఉన్నదనీ, దేశం నెహ్రూని విఫలం చేసింది కానీ నెహ్రూ దేశాన్ని విఫలం చేయలేదనీ ఆయన వాదన. నెహ్రూ హయాంలో స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) అభివృద్ధి రేటు 4.8 శాతం ఉండేది. ఇందిర పాలనలో ఆత్యయిక పరిస్థితి వరకూ (1965-1975) అది 3.4 శాతానికి తగ్గింది. 1975 నుంచి 1984 వరకూ 4.2కు పెరిగింది. 1984 నుంచి 1995 వరకూ 5.9 శాతానికీ, 1995 నుంచి 2005 వరకూ 7.1 శాతానికీ, 2004-05 నుంచి 2013-14 వరకూ 8.3 శాతానికీ పెరిగింది. ఈ లెక్కల ప్రకారం ఆర్థిక సంస్కరణలు దేశానికి గొప్ప మేలు చేశాయనే చెప్పాలి.
 
 చైనాతో పోటీయా?
 ఇప్పుడు చైనాతో పోటీపడాలనీ, ప్రపంచంలోనే మూడవ ఆర్థికశక్తిగా ఎదగాలనీ కలలు కంటున్నాం. ఈ అభివృద్ధి కథ యావత్తూ  నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇది చాలా ఆశాజనకం, ఆనందదాయకం. కానీ, నాణేనికి మరోవైపున ఏము న్నదో తెలుసుకుంటే ఆవేశం తగ్గి ఆలోచన మొదలవుతుంది. చైనా ఆర్థిక వ్యవస్థలో మన ఆర్థికవ్యవస్థ విలువ అయిదింట ఒక వంతు మాత్రమే. చైనాను అందుకోవడం అంత తేలిక కాదు. ప్రగతి రేటూ, విదేశీమారకద్ర వ్యం నిల్వలూ పెరగడాన్ని అభివృద్ధికి సంకేతంగా పరిగణిస్తున్నాం. నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ అభివృద్ధి రేటును లెక్కించడానికి ప్రాతిపదికగా తీసుకునే సంవత్సరాన్ని 2011-12కు జరపడం వల్లనే ఎక్కువ రేటు కనిపిస్తున్నదంటూ దేశంలోనూ, విదేశాలలోనూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 విదేశీమారక ద్రవ్యం నిల్వలు పెరుగుతున్నది మనం దిగుమతులకు ఖర్చు చేసే నిధులకంటే ఎగుమతుల ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నందువల్ల కాదు. నిజానికి, ఇప్పటికీ మన దిగుమతుల విలువ ఎగుమతుల విలువ కంటే అధికం. అంటే విదేశీ మారకద్ర వ్యం సంక్షోభంలో దేశం ఉండాలి.  కానీ నిల్వలు ఉన్నాయి.  కారణం ఏమిటి? మన దేశంలో పెట్టుబడి పెడుతున్నవారు విదేశీమారకద్రవ్యం కుప్పలు తెప్పలుగా తెస్తున్నారు.  2004కు పూర్వం విదేశీమారకద్రవ్యం విదేశాల నుంచి 800 కోట్ల నుంచి 1,500 కోట్ల డాలర్లు వచ్చింది. 2007-08 నాటికి అది 6000 కోట్ల డాలర్లకు పెరిగింది. ఇప్పుడు ఇంకా చాలా ఎక్కువ నిల్వలు ఉన్నాయి.  అంటే నిల్వలు మనం సంపాదించుకున్నవి కావు. అరువు తెచ్చుకున్నవి. 1991లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టినప్పుడు విదేశీమారకద్రవ్యం గురించీ, అభివృద్ధి గురించే ఆలోచించారు కానీ వ్యవసాయరంగంపైన దృష్టి పెట్టలేదు. పత్తి పంట 1998 నుంచి తెలంగాణలో, విదర్భలో లక్షల ప్రాణాలు బలి తీసుకున్నది.
 
 ఉత్పాదకరంగంలో స్తబ్దత
 సంస్కరణలు భేషంటూ ప్రశంసించినవారు ప్రగతిపథంలో పరిశ్రమలూ, ఉత్పా దకరంగం ముందుంటాయని నమ్మబలికారు. లెసైన్స్-పర్మిట్‌రాజ్‌ను రద్దు చేసిన తర్వాత పరిశ్రమలు శరవేగంగా అభివృద్ధి చెందుతాయని భావించారు. నిజానికి అభివృద్ధి చెందిన ఇతర దేశాలలో అదే జరిగింది. 2010లో చైనా జీడీపీలో ఉత్పాదక రంగానికి 47శాతం, ఇండొనేషియాలో 47 శాతం, దక్షిణ కొరి యాలో 39 శాతం, మలేసియాలో 44 శాతం, థాయ్‌ల్యాండ్‌లో 45 శాతం ఉంటే ఇండియాలో 27 శాతం. రెండు దశాబ్దాలుగా పారిశ్రామికరంగంలో ఎదుగూ బొదుగూ లేదు.  
 
 నేరుగా విదేశీ పెట్టుబడులు (ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్-ఎఫ్‌డీఐ) రూపంలో 2000 నుంచి 2015 వరకూ దేశంలోకి వచ్చిన 25,800 కోట్ల డాలర్లలో 49 శాతం ఫిలిప్పీన్స్, సింగపూర్ మార్గంలో వచ్చినవేనని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ పరిశోధనలో తేలింది. పన్ను ఎగగొట్టడానికి ఈ మార్గం ఎంచు కున్నవారు విదేశీయులు కావచ్చు. మన దేశానికి చెందిన పెట్టుబడిదారులు కావచ్చు. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సింగపూర్‌ను ఆకాశానికి ఎత్తు తుంటే ఆందోళన కలుగుతోంది. ఎఫ్‌డీఐలో కూడా ఉత్పాదక రంగంలోకి వెడుతున్నది 30 శాతం మాత్రమే. ప్రాథమిక సౌకర్యాల (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) రంగా నికీ, బడావ్యాపార సంస్థలకే ప్రభుత్వ రంగంలోని వాణిజ్య బ్యాంకులు సైతం ఉదారంగా రుణాలు ఇస్తున్నాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యం లేదు. ప్రధాని నరేంద్రమోదీ ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదం తర్వాత కూడా పరిస్థితి మారలేదు.
 
 ప్రపంచంలోని పేదలలో సగానికి పైగా ఇండియాలోనే. ప్రాథమిక ఆరోగ్యం, వైద్య రంగాల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలుగుతోంది. నిరు ద్యోగం యువతను పీడిస్తూనే ఉంది. ఆర్థిక సంస్కరణలలో మానవీయకోణం కనిపించడం లేదని పదవీ విరమణ చేసిన తర్వాత పీవీ అంటూ ఉండే వారు.‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ అంటూ ఆయన ప్రతిపాదించిన సూత్రం ఎక్కడో ఆగిపోయింది. ఆర్థికంగా పెరిగాం. మానవీయ కోణంలో ఎదగలేదు. ఆర్థికాభివృద్ధి ఫలితాలు పేదలకు అందడం లేదు. సమాజంలో అంతరాలు భయంకరంగా పెరుగుతున్నాయి. నేర ప్రవృత్తి హెచ్చుతోంది. ఈ పరిస్థితులు మారే వరకూ ఆర్థిక సంస్కరణల వల్ల ప్రయోజనం ఉండదు.
 - కె.రామచంద్రమూర్తి
 సాక్షి, ఎడిటోరియల్ డైరెక్టర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement