ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రమే | CM YS YS Jagan Mohan Reddy letter to PM Narendra Modi On Special Category Status to AP | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రమే

Published Wed, Feb 5 2020 3:29 AM | Last Updated on Wed, Feb 5 2020 10:04 AM

CM YS YS Jagan Mohan Reddy letter to PM Narendra Modi On Special Category Status to AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని 15వ ఆర్థిక సంఘం స్పష్టం చేసినందున రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవడానికి ఈ బడ్జెట్‌లో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ప్రధానికి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రజల బాధను మీ దృష్టికి తెస్తున్నానని, ప్రత్యేక హోదా కల్పించే విషయం పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నందున అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరారు. సీఎం జగన్‌ లేఖ సారాంశం ఇలా ఉంది.  

ప్రజల ఆవేదనను మీ దృష్టికి తెస్తున్నా 
‘‘ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్న సంక్లిష్ట తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2020–21 బడ్జెట్‌ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేదిగా, వృద్ధి రేటును పెంచేదిగా విశ్వాసాన్ని కలిగించి,నూతనోత్సాహాన్ని ఇచ్చింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి అభినందనలు తెలియజేస్తున్నాను. కానీ, ఏపీ ప్రజలలో మాత్రం అసంతృప్తి కలిగించిందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏపీని ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. దాంతో ఏపీ ప్రజలు అసంతృప్తికి గురయ్యారు.

ఏపీ ప్రజల్లో తీవ్రంగా ఉన్న ఆవేదన, బాధను గతంలో కూడా పలు పర్యాయాలు మీ దృష్టికి తీసుకొచ్చాను. తాజాగా కేంద్ర బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 15వ ఆర్థిక సంఘం నివేదికలో పేర్కొన్న అంశాల నేపథ్యంలో మీ సహకారం, మార్గ నిర్దేశం కోరుతూ ఈ లేఖ రాస్తున్నాను. రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. విభజన అనంతరం అత్యధిక ఆదాయం ఇచ్చే వనరుల ప్రయోజనాలు తెలంగాణకు దక్కాయి. అవశేష ఆంధ్రప్రదేశ్‌ ఈ ఆదాయ వనరులను కోల్పోయింది. 
 
దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించ కూడదని 14వ ఆర్థిక సంఘం నివేదిక ఇచ్చిందని లోక్‌ సభలో ఆర్థిక శాఖ చెప్పింది. 15వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు మా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని మేము కోరాము. దీనిపై వారు స్పందిస్తూ ప్రెసిడెన్షియల్‌ నోటిఫికేషన్‌ ప్రకారం ప్రత్యేక హోదా అంశం 15వ ఆర్థిక సంఘం మార్గదర్శకాల్లో లేదని స్పష్టం చేశారు. ఆర్థిక సంఘానికి, ప్రత్యేక హోదా కల్పించే అంశానికి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పారు. కానీ మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రతిపాదన పట్ల 15వ ఆర్థిక సంఘం చైర్మన్, సభ్యులు సానుకూలంగా స్పందించారు. ప్రత్యేక హోదా కల్పించడం అనేది జాతీయ అభివృద్ధి మండలి తుది నిర్ణయం అని చెప్పారు.

2020–21కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నివేదికలో కూడా ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. పలు రాష్ట్రాలు ప్రత్యేక హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశాయని, కానీ ఆ అంశం తమ పరిధిలో లేదని, దీనిపై కేంద్ర ప్రభుత్వమే సముచిత నిర్ణయం తీసుకోవాలని స్పష్టీకరించారు. 2018 అక్టోబర్‌లో మీడియా 15వ ఆర్థిక సంఘం చైర్మన్‌ను ప్రశ్నించిన సందర్భంలోనూ ప్రత్యేక హోదా అనేది ఆర్థిక సంఘం పరిధిలో లేదని కుండబద్ధలు కొట్టారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ప్రత్యేక హోదాపై 15వ ఆర్థిక సంఘం వెల్లడిస్తున్న దానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్న దానికీ పొంతన లేదనేది స్పష్టమవుతోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తోంది. దయచేసి ఈ అంశంపై మీరు జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయం తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement