సాక్షి, అమరావతి : 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ లోటు భర్తీ కింద రూ.5,987 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాల్సిందిగా 15వ ఆర్థిక సంఘం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 14వ ఆర్థిక సంఘం కాలంతో పాటు 15వ ఆర్థిక సంఘం కాలంలో కూడా రాష్ట్రం రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది కనుక.. 15వ ఆర్థిక సంఘం కాల వ్యవధిలో కూడా రెవెన్యూ లోటు భర్తీకి సిఫార్సు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం చేసిన వినతిపై 15వ ఆర్థిక సంఘం ఈ మేరకు స్పందించింది. కాగా, 2020–21 ఆర్థిక ఏడాదికి మాత్రమే సిఫార్సులు చేయగా మిగిలిన నాలుగు ఆర్థిక సంవత్సరాలకు పూర్తిస్థాయి నివేదికను తరువాత ఇస్తామని వెల్లడించింది. అలాగే.. రంగాల వారీగా, రాష్ట్ర నిర్ధిష్ట అవసరాలు, వ్యవసాయ రంగంలో సంస్కరణలు, విద్య.. వైద్య రంగాలకు సంబంధించిన అన్ని గ్రాంట్లపైన పూర్తిస్థాయి నివేదికలో చర్చించి తగు సిఫార్సులు చేస్తామని నివేదికలో స్పష్టంచేసింది. అంతేకాక, తాజా నివేదికలో రాష్ట్ర విభజన అంశాలను, రాజధాని, వెనుకబడిన జిల్లాలతో పాటు రాష్ట్ర ప్రత్యేక అవసరాల గురించి ఆర్థిక సంఘం ఎక్కడా చర్చించలేదు. పూర్తిస్థాయి నివేదికలో చర్చిస్తుందేమో చూడాలి.
2020–21 ఏడాదికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల్లో రాష్ట్రానికి చెందిన ప్రధాన అంశాలు..
- 2020–21 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో వాటా తేల్చకముందు ఏపీ రెవెన్యూ లోటు రూ.41,054 కోట్లు. పన్నుల వాటాగా రూ.35,156 కోట్లను బదిలీ చేసిన తరువాత రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.5,897 కోట్లుగా ఉంది. దీన్ని భర్తీచేయాలి.
- ఇదే కాలంలో గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ల రూపంలో రూ.2,625 కోట్లను, పట్టణ స్థానిక సంస్థలకు రూ.1,264 కోట్లను ఇవ్వాలి.
- పౌష్టికాహార గ్రాంటు కింద రూ.263 కోట్ల మంజూరు.
- స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద మొత్తం రూ.1,491 కోట్లను సిఫార్సు చేయగా ఇందులో కేంద్రం వాటా రూ.1,119 కోట్లు కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.372 కోట్లు.
2020–21లో రాష్ట్ర రెవెన్యూ రాబడి, వ్యయంపై 15వ ఆర్థిక సంఘం అంచనాలు..
Comments
Please login to add a commentAdd a comment