కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి 14వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి రూ.89కోట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను అకడమిక్ డీఎంఈ డాక్టర్ ఎ.వెంకటేష్ ఆదేశించారు. బుధవారం ఆయన కర్నూలు మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, ప్రాంతీయ కంటి వైద్యశాలలను తనిఖీ చేశారు. ముందుగా మెడికల్ కాలేజీలోని ప్రిన్సిపాల్ చాంబర్‌లో కళాశాల అభివృద్ధి కమిటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
అనంతరం ఆసుపత్రిలోని ఎంసీహెచ్ భవనం, ట్రామాబ్లాక్, గైనకాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, రేడియాలజీ, లైబ్రరీ, ఆఫ్తమాలజీ, మెడాల్, మెడికల్ ఎడ్యుకేషన్ యూనిట్‌లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. లైబ్రేరిపై మరో ఫ్లోర్ నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని ఇంజనీర్లకు ఆదేశించారు. దాంతో పాటు పీడియాట్రిక్ బ్లాక్‌పై మరో ఫ్లోర్‌కు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఆరోగ్యశ్రీ కేసులు పెండింగ్ లేకుండా చూడాలని చెప్పారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పదోన్నతుల ద్వారా ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేస్తామని, 350 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను, 495 ఏపీవీవీ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులతో పాటు బోధనాసుపత్రుల్లో ఆర్‌ఎంవో పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. కొన్నేళ్లుగా తాను ఒక్కడినే పని చేస్తున్నానని, అసిస్టెంట్‌ను ఇవ్వాలని యురాలజీ విభాగాధిపతి డాక్టర్ సీతారామయ్య కోరగా త్వరలో వైద్యుల పోస్టులు భర్తీ కానున్నాయని, వారిలో ఒకరిని సహాయకునిగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఆసుపత్రిలో నిర్వహణకు రూ.1.5కోట్లు మంజూరయ్యాయన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ, ఆసుపత్రులకు రూ.1.5కోట్లు, ప్రాంతీయ కంటి ఆసుపత్రికి రూ.1.2కోట్ల నిధులతో ఆధునిక పరికరాలు మంజూరైనట్లు చెప్పారు. ఆసుపత్రిలో క్యాన్సర్, థైరాయిడ్ నిర్ధారణ పరీక్షలకు ఉపయోగించే ఆధునిక కెమిలూషన్స్ పరికరం మంజూరు చేసినట్లు తెలిపారు.
దీంతో పాటు 800 ఎంఏ ఎక్స్‌రే మిషన్, ఆధునిక అల్ట్రాసౌండ్ మిషన్, శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావాన్ని నిలువరించే మూడు వెజెల్‌సీలింగ్ కాట్రిమెషీన్‌లు మంజూరయ్యాయని.. ఇవన్నీ రెండు నెలల్లో ఆసుపత్రికి చేరుకుంటాయన్నారు. అలాగే పీడియాట్రిక్ విభాగంలో మానిటర్ల ఏర్పాటుకు రూ.15లక్షలను ఆయన మంజూరు చేశారు. ఆయన వెంట కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రాంప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.ఉమామహేశ్వర్, కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.సుధాకర్‌రావు, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ చంద్రశేఖర్, వివిధ విభాగాధిపతులు, వైద్యులు ఉన్నారు.
పెద్దాసుపత్రి అభివృద్ధికి రూ.89కోట్లతో ప్రతిపాదనలు
Published Thu, Oct 24 2013 3:27 AM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement