చిన్న చూపు తగదు..!
Published Tue, Dec 17 2013 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:41 AM
సాక్షి, చెన్నై : రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో కేంద్రం చిన్న చూపు తగదని ముఖ్యమంత్రి జయలలిత ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల పెంపు కోసం సహకరించాలని ఫైనాన్స్ కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు. వైవీ రెడ్డి నేతృత్వంలో ఫైనాన్స్ కమిషన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం చెన్నై చేరుకుంది. సాయంత్రం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఈ కమిషన్ సమావేశం అయింది. ఇందులో ముఖ్యమంత్రి జయలలిత ప్రసంగిస్తూ, రాష్ర్ట ప్రభుత్వ ప్రగతిని వివరించారు. తమ ప్రభుత్వ పథకాలను గుర్తు చేస్తూ నిధుల కేటాయింపుల్లో కేంద్రం వివక్షను ఎత్తి చూపారు. ఇక్కడి పథకాలకు సమృద్ధిగా నిధుల్ని కేటాయించాల్సిన కేంద్రం, చిన్నచూపు చూడటం తగదన్నారు. రాష్ట్రాలకు ఆర్థిక సహకారం అందించాల్సిన కేంద్రం రాజకీయ ఎత్తుగడల్ని అనుసరించడం విచారకరమని పేర్కొన్నారు. తమిళనాడుకు పారదర్శకంగా నిధుల్ని కేటాయించాలని, సకాలంలో నిధుల మంజూరుకు సహకరించాలని ఫైనాన్స్ కమిషన్‌కు ఆమె విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఆ కమిషన్ చైర్మన్ వైవీ రెడ్డి, సభ్యులు సుష్మానాథ్, గోవిందరావు, సుదీప్ మున్డేల్, అభిజిత్ సేన్, కార్యదర్శి ఏఎన్ జా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement